టాప్ టు టో... ఫ్రెష్ అండ్ గ్లో! | Top to toe ... fresh and glow | Sakshi
Sakshi News home page

టాప్ టు టో... ఫ్రెష్ అండ్ గ్లో!

Published Tue, May 26 2015 11:48 PM | Last Updated on Sun, Sep 3 2017 2:44 AM

టాప్ టు టో... ఫ్రెష్ అండ్ గ్లో!

టాప్ టు టో... ఫ్రెష్ అండ్ గ్లో!

మన శరీరం శుభ్రంగా ఉంటే మనసూ శుభ్రంగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటుంది. అంటే... ఒంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడమంటే ఆ శుభ్రత ఆ ఒక్కదానికే పరిమితం కాదన్నమాట. మనసూ శుభ్రపడుతుందన్నమాట. మరి వ్యక్తిగత పరిశుభ్రతకు ఇంతటి ప్రాధాన్యం ఉన్నప్పుడు దాన్ని పాటించకపోతే ఎలా? తల వెంట్రుకల చివరి నుంచి పాదం చివరి వరకూ పరిశుభ్రతను పాటించి, మేనూ, మనసూ ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎలాగో తెలుసుకుందాం.
 
 నోటి సంరక్షణ ఇలా


 ప్రతిరోజూ ఉదయమే మనం మన పళ్లను బ్రషింగ్ చేసుకుంటాం. కానీ నిజానికి ఆహారం తీసుకున్న ప్రతిసారీ పళ్లను శుభ్రపరచుకోవాలి. అయితే ఆహారం తీసుకున్న ప్రతిసారీ బ్రషింగ్ చేసుకోలేకపోయినా... నీటిని తగినంతగా నోట్లోకి తీసుకుని పుక్కిలిస్తూ నోరంతా శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే మనం ఆహారం తీసుకున్న తర్వాత బ్యాక్టీరియా పెరిగేందుకు అనువైన వాతావరణం మన నోట్లో ఉంటుంది. కాబట్టి ఆహారం తీసుకున్న తర్వాత నోరు శుభ్రం చేసుకోవడం, విధిగా ప్రతిరోజూ ఉదయం, రాత్రి నిద్రపోబోయే ముందు బ్రషింగ్ చేసుకోవడం అవసరం. బ్రషింగ్ తర్వాత మన చిగుర్లపై వేలితో గుండ్రంగా తిప్పుడూ మసాజ్ చేసుకుంటున్నట్లుగా రాయాలి. దీనివల్ల చిగుర్లకు రక్తప్రసరణ పెరిగి చిగుర్ల వ్యాధులు నివారితమవుతాయి. ఇక నోటి పూర్తి సంరక్షణ కోసం కనీసం ప్రతి ఆర్నెల్లకోసారి డెంటిస్ట్‌ను కలిసి స్కేలింగ్, పళ్లను పాలిష్ చేయించుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలి.

రోజూ ముఖం కడుక్కోండి : స్నానం తర్వాత మనం శరీరానికి బట్టలతో రక్షణ కల్పిస్తుంటాం. ఆచ్ఛాదన ఉండని భాగాల్లో వెంటనే మురికి చేరుతుంటుంది. ఇదో నిత్యక్రతువు (కంటిన్యువస్ ప్రాసెస్). కాబట్టి వీలైనప్పుడల్లా ముఖంతో పాటు బట్టల ఆచ్ఛాదన లేని చేతులు, అరికాళ్లు కూడా కడుక్కుంటూ ఉండటం మంచిది. దీనివల్ల ముఖంపైన బ్యాక్టీరియా చేరడం వల్ల వచ్చే మొటిమలూ చాలావరకు తగ్గుతాయి.

చేతులు శుభ్రం చేసుకోవడం ఇలా: మనం ఆహారం తీసుకునే ముందర క్రమం తప్పకుండా చేతులను శుభ్రం చేసుకోవాలి. అలాగే వాష్‌రూమ్‌కు వెళ్లి వచ్చాక (మూత్ర, మల విసర్జన తర్వాత) చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. చాలామంది వాష్‌రూమ్ ‘నాబ్’ను ముట్టుకోవచ్చు. వారికి ఏవైనా బ్యాక్టీరియల్, వైరల్, ఏకకణజీవుల వంటి పరాన్నజీవులు ఉంటే... వారు ముట్టుకున్న చోటిని మనం మళ్లీ ముట్టుకోవడం వల్ల మనకూ అవి  సంక్రమించవచ్చు. అందుకే వాష్‌రూమ్‌కు వెళ్లివచ్చాక తప్పక చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.
 చెవుల సంరక్షణ : చెవులను చాలా జాగ్రత్తగా సంరక్షించుకోవాలి. స్నానం సమయంలో కాసిని నీళ్లతో చెవిలో కాస్తంత లోపలివరకూ శుభ్రం చేసుకోవాలి. మన చెవుల్లో వచ్చే గులివి చెవికి రక్షణ కల్పించడం కోసమే పుడుతుంది. కాబట్టి దాన్ని శుభ్రం చేసుకోడానికి ఇయర్‌బడ్స్ లాంటివి వాడకూడదని గుర్తుంచుకోవండి. చెవిలోని గులివిని శుభ్రం చేయడం కోసం పదునైన పిన్నులు, పిన్నీసులు, అగ్గిపుల్లలు వాడటం వల్ల చెవిలోపలి భాగం గాయపడవచ్చు లేదా గులివి మరింత లోపలికి చేరవచ్చు. చెవి లోపల గువిలి మరీ ఎక్కువగా ఉంటే ‘డీ-వ్యాక్స్’ అనే చుక్కల మందును వేసుకుని, ఈఎన్‌టీ డాక్టర్‌ను సంప్రదిస్తే వారే సురక్షితమైన రీతిలో చెవులను శుభ్రపరుస్తారు.

 చర్మ సంరక్షణ కోసం : చాలామందిలో పొడి చర్మం ఒక సమస్యగా పరిణమిస్తుంది. ఇలాంటివారు మాయిష్చరైజింగ్ క్రీమ్స్ రాసుకోవాలి. ముఖ్యంగా చలికాలంలో తప్పనిసరిగా రాసుకోవాలి. లేకపోతే చర్మం మీద మంట, దురద వస్తాయి. పొడిచర్మం ఉన్నవారి చర్మంపై గీరితే ఒక్కోసారి పైచర్మం దోక్కుపోయి కిందిచర్మం బయటపడి ఇన్ఫెక్షన్‌కు దారితీయవచ్చు.

 ఇక శరీరంపై చాలాచోట్ల చర్మం ముడుతలు పడి ఉంటుంది. ముఖ్యంగా మెడ, భుజాలు, బాహుమూలాల వద్ద, తొడలు, గజ్జల వద్ద చర్మం ముడుతలతో ఉంటుంది. ఇలాంటి చోట్ల శుభ్రంగా, పొడిగా ఉంచుకోకపోతే అక్కడ ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. అందుకే స్నానం తర్వాత చర్మం ముడుతలు ఉన్నచోట్ల ప్రత్యేకంగా పూర్తిగా పొడిగా అయ్యేలా టవల్‌తో తుడుచుకోవాలి.
 గోళ్లు : గోళ్లను క్రమం తప్పకుండా ట్రిమ్ చేసుకోవాలి. అంటే గోరు చివరకంటా కత్తిరించకుండా, మట్టిచేరనంత పాటి గోరంచు ఉండేలా ఎప్పటికప్పుడు కత్తిరించుకుంటూ ఉండాలి.

 పాదాల శుభ్రత : మన కాళ్లనూ, మోకాళ్లనూ, పాదాలను శుభ్రంగా ఉంచుకోవడం చాలా అవసరం. ప్రతిరోజూ రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు మన మడమలు శుభ్రంగా ఉన్నాయా లేక ఏవైనా పగుళ్లు ఉన్నాయా అన్నది పరీక్షించుకోండి. పాదాలపై పుండ్లుగానీ, ఇన్ఫెక్షన్లుగానీ, పగుళ్లుగానీ ఏర్పడకుండా సంరక్షింకుంటూ పరిశుభ్రంగా ఉంచుకోండి. పాదాలు కడుక్కున్న తర్వాత అవి పూర్తిగా పొడి అయ్యేంతవరకూ తుడుచుకోండి. కాలివేళ్ల గోళ్లు తీసుకుంటూ ఉండాలి. ఇలాంటి సమయంలో ముఖ్యంగా మన కాలి బొటనవేలి (పెద్దనేలు) గోరును జాగ్రత్తగా తీసుకోవాలి. ఇక మన పాదరక్షలు ధరించినప్పుడు అవి కాలికి సౌకర్యంగా ఉండేలా ఎంపిక చేసుకోవాలి. షూ ధరించేవారు పరిశుభ్రమైన సాక్స్‌ను మాత్రమే తొడుక్కోవాలి. పాద సంరక్షణ మామూలు వారిలోకంటే డయాబెటిస్ రోగుల్లో మరింత ఎక్కువ అవసరం. హైహీల్స్ కాకుండా తక్కువ హీల్ ఉన్న పాదరక్షలే వేసుకోవాలి. ఇలా తల వెంట్రుకల నుంచి పాదం వరకూ పరిశుభ్రత పాటిస్తే తనువూ, మనసూ రెండూ శుభ్రంగా ఆరోగ్యంగా ఉంటాయి.
 
స్నానం చేయడం : మనలో అందరూ రోజూ స్నానం చేసినా అది మనల్ని పూర్తిగా శుభ్రపరుస్తోందా అన్నది చాలామంది చూసుకోరు.  చాలామంది తమ చెవుల వెనక భాగాలనూ, శరీరంలో మడతపడే చోట్లనూ పరిశుభ్రం చేసుకోవడాన్ని విస్మరిస్తారు. తలస్నానం అన్నది క్రమం తప్పని వ్యవధుల్లో తప్పక చేయాలి. కొందరు తలస్నానం చేసే ముందు తలకు నూనె రాస్తారు. అందరి తలలకూ నూనె అవసరం లేదు. కేవలం పొడిబారినట్లు ఉండే చర్మమూ, వెంట్రుకలు ఉన్నవారు తలస్నానానికి ముందర నూనెతో మృదువుగా మర్దన (మసాజ్) చేసుకోవాలి. ఆ తర్వాత అదంతా శుభ్రమయ్యేలా మంచి షాంపూతో స్నానం చేయాలి. చలికాలం లాంటి రోజుల్లో ప్రతిరోజూ స్నానం చేయండి. అయితే వేసవిలో ఉదయం, సాయంత్రం రెండు పూటలా స్నానం చేయడం చాలా మంచిది.
 
 డాక్టర్ హరికిషన్ బూరుగు
 కన్సల్టెంట్ ఫిజీషియన్, అపోలో
 హాస్పిటల్స్, హైదర్‌గూడ, హైదరాబాద్
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement