నాగబాబు తనయుడు 'మెగా' సక్సెస్ సాధిస్తాడా?
కొణిదెల వంశం నుంచి మరో హీరో వస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి (కొణిదెల శివశంకర వరప్రసాద్) సోదరుడు నాగబాబు కుమారుడు వరుణ్‌తేజ్ హీరోగా తెరంగేట్రం ఖరారైంది. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. దాదాపు నాలుగేళ్లుగా వినిపిస్తున్న ఊహాగానాలకు తెరపడింది. టాలీవుడ్లో చాలా కాలంగా వరుణ్‌తేజ్ సినీరంగ ప్రవేశంపై చర్చ జరుగుతోంది. మెగాస్టార్ - అల్లు వారి కుటుంబాల నుంచి ఇప్పటికే నాగబాబు - పవన్ కళ్యాణ్ - రామ్చరణ్ - అల్లు అర్జున్ - అల్లు శిరీష్ చిత్ర రంగంలో ఉన్నారు. చిరంజీవి మేనల్లుడు ధర్మతేజ కూడా ఓ చిత్రంలో నటిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వెలుగు వెలుతున్నారు. అత్తారింటికి దారేది? చిత్రం ద్వారా కలెక్షన్ల రికార్డు బద్దలు కొట్టారు.
వాస్తవానికి ఈ ఏడాదే వరుణ్ తేజ హీరోగా సినీరంగ ప్రవేశం చేయవలసి ఉంది. వరుణ్ తేజ ఎత్తుకు ఎత్తు - రూపానికి రూపం - అందానికి అందం అన్నీ ఉన్నాయి. హీరోకు కావలసిన లక్షణాలు మెండుగా ఉన్నాయి. వీటికి తోడు నటన - భాష - ఉచ్ఛారణలో శిక్షణ పొందాడు. ఈ నాడు అగ్రతారలుగా వెలుగొందుతున్న సినీప్రముఖులు ఎందరికో నటన నేర్పిన దిట్ట సత్యానంద్. పవన్‌కళ్యాణ్, మహేష్‌బాబు, ప్రభాస్... వంటి వారు ఆయన వద్దే నటన, భాష నేర్చుకున్నారు. విశాఖలో ఆయన వద్దే వరుణ్ కూడా శిక్షణ పొందాడు. అయితే వివిధ కారణాల వల్ల తేజ వెండితెర పరిచయం వాయిదాపడుతూ వచ్చింది. ఆ సమయం ఇప్పుడు వచ్చేసింది.
వరుణ్ పరిచయం చేసే దర్శకులలో ప్రముఖ దర్శకులు పూరి జగన్నాథ్, క్రిష్, శ్రీకాంత్ అడ్డాల ... పేర్లు వినిపించాయి. విజయవంతమైన 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు'కు దర్శకత్వం వహించిన శ్రీకాంత్ అడ్డాల తేజను పరిచయం చేయడానికి ఓ మంచి కథ రూపొందించారు. ఈ విషయాన్ని ఈ ఏడాది ఫిబ్రవరిలోనే సాక్షి తెలిపింది. ఏడాదికిపైగా ఆయనతో కథా చర్చలు జరుగుతున్నాయి. చివరకు వరుణ్ తేజ్‌ని తెరకు పరిచయం చేసే బాధ్యతను శ్రీకాంతే స్వీకరించారు.
ఇక నిర్మాత విషయంలో కూడా చాలా ఊహాగానాలు వినిపించాయి. తొలుత నాగబాబు తమ సొంత బేనర్ అంజనా ప్రొడక్షన్పైనే తన కుమారుడిని పరిచయం చేయాలని అనుకున్నారు. అయితే ఆరంజ్ చిత్రం తరువాత ఆ ప్రొడక్షన్పై చిత్రం నిర్మించడానికి ఆయన అంతగా ఆసక్తి చూపించడంలేదు. ప్రస్తుతానికి చిత్రాలు నిర్మించే ఉద్దేశం కూడా ఆయనకు లేదు. మెగా ప్రొడ్యూసర్ అశ్వనీదత్ వైజయంతీ మూవీస్పై నిర్మిస్తారని కొంతకాలం ప్రచారం జరిగింది. పవన్ కళ్యాణే కొత్తగా 'పవన్ క్రియేటివ్ వర్క్స్' బేనర్ ఏర్పాటు చేసి, తేజని హీరోగా పరిచయం చేసే అవకాశం ఉందని కూడా భావించారు. ఇవన్నీ కాకుండా అల్లు అరవింద్ గీతాఆర్ట్స్పైనే తేజని పరిచయం చేసే అవకాశం ఉందని అనుకున్నారు. చివరకు తేజని పరిచయం చేసే ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి నిర్మాతలుగా ఠాగూర్ మధు, నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి) వ్యవహరిస్తున్నారు. మిక్కీ జె.మేయర్ స్వరాలందిస్తారు. ఇక హీరోయిన్ విషయానికి వచ్చేసరికి మొదట్లో కాజల్ పేరు వినపడింది. హీరోయిన్ను ఇంకా ఎవరినీ ఎంపిక చేయలేదు. మహానటుడు కమల్హాసన్ రెండవ కూమార్తె అక్షర, ఒకప్పుడు కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ను ఒక ఊపు ఊపిన అందాల నటి శ్రీదేవి కుమార్తె జాహ్నవి కపూర్ పేర్లు వినవస్తున్నాయి. తేజ మెగా కుటుంబానికి చెందిన వాడైనందున వారు కూడా ఒప్పుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ నూతన సంవత్సరం ప్రారంభం రోజునే మొదలవుతుంది. ఇక వరుణ్ మెగాస్టార్ వారసుల విజయపరంపరను అందుకుంటాడా లేదా అనేది శ్రీకాంత్ అడ్డాల చేతిలోనే ఉంది. శ్రీకాంత్కు ఇది ఓ ఛాలెంజ్!
s.nagarjuna@sakshi.com