ఆర్ట్ ఈజ్ లైఫ్..
నందు
మనవడిని పొదివి పట్టుకుని పేవ్‌మెంట్‌పై ఉన్న సిమెంట్ బెంచ్ మీద కూర్చున్న అమ్మమ్మ ఆలింగనంలో ఆర్తి ఉంది. తుది శ్వాస వరకూ మనవడి భవిష్యత్తుకు ఆసరాగా నిలవాలన్న ఆదుర్దా ఉంది. వీటిని యథాతథంగా ప్రతిఫలింపజేసిన వర్ణ చిత్రం ఆహూతుల్ని ఆకట్టుకుంది. మ్యూజ్ ఆర్ట్ గ్యాలరీలో ఆదివారం ప్రారంభమైన ఆర్ట్‌లైఫ్ ఎట్ 55 ప్రదర్శన ఇలాంటి అర్థవంతమైన చిత్రాలకు వేదికైంది.
గోమాతతో ముచ్చట్లాడుతున్న బాలుడి వదనంలో సంతోషాన్ని, ఆర్ఫన్ హోమ్‌లోని చిన్నారి దీనమైన చూపుల్ని ఒడిసిపట్టుకున్న చిత్రకారిణి ఎన్‌ఆర్‌ఐ రాధా వల్లూరి అచ్చమైన భారతీయతను ప్రతిబింబించే చిత్రాలను గీసి కళాభిమానుల ప్రశంసలు అందుకున్నారు.
చిత్ర ప్రదర్శనను దర్శకుడు శేఖర్ కమ్ముల ప్రారంభించారు. సినీ హీరో నందు, హీరోయిన్లు విమలారామన్, నిఖితా నారాయణన్, పేజ్‌త్రీ ప్రముఖులు హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా సినీనటి సమంత ఆధ్వర్యంలోని ప్రత్యూష సపోర్ట్‌కు నిర్వాహకులు ఆర్థిక సహాయం అందించారు.