టీవీక్షణం: చిట్టి చిట్టి చాంపియన్స్! | Reality shows play role of Children's in Television | Sakshi
Sakshi News home page

టీవీక్షణం: చిట్టి చిట్టి చాంపియన్స్!

Published Sun, May 18 2014 1:22 AM | Last Updated on Sat, Sep 2 2017 7:28 AM

Reality shows play role of Children's in Television

ప్రతి ఆదివారం రాత్రి 8.30కి జీ తెలుగు చానెల్ ‘చోటా చాంపియన్స్’ను ప్రసారం చేస్తోంది. పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులు కూడా పాల్గొనే ఈ గేమ్ షో భలే సరదాగా ఉంటుంది. పిల్లల శక్తికి, వారికున్న తెలివితేటలకు తగ్గట్టుగానే పోటీ ఉంటుంది. తల్లిదండ్రులు కూడా వారికి సహాయ పడుతుంటారు. చక్కగా ఆడి గెలిస్తే చదువుకోవడానికి డబ్బును గెలుచుకోవచ్చు. అయితే ఇవన్నీ పిల్లలకు తెలియదు. వారికది ఆట. అమ్మానాన్నా దగ్గరుండి ఆడిస్తారు... అంతే. అందుకే వాళ్లు ఎంజాయ్ చేస్తూ గేమ్ ఆడుతుంటారు. ప్రేక్షకులు అంతకంటే ఎంజాయ్ చేస్తూ కార్యక్రమాన్ని చూస్తున్నారు. యాంకర్ అనసూయ సందడి, పిల్లల అల్లరి కలిసి చోటా చాంపియన్‌ని బెస్ట్ షోగా నిలబెడుతున్నాయి!
 
 ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఏమైనా చేస్తారు!
 ప్రేక్షకులను కేరింతలు కొట్టించడానికి సోనీ టీవీ 2009లో ఒక ప్రోగ్రామ్ మొదలుపెట్టింది. అదే... ఎంటర్‌టైన్‌మెంట్ కేలియే కుచ్‌భీ కరేగా! ‘30 సెకెండ్స్ టు ఫేమ్’ అనే అమెరికన్ రియాలిటీ షో ఆధారంగా రూపొందించిన ఈ కార్యక్రమంలో పోటీదారులకి ముప్ఫై సెకన్లు టైమిస్తాయి. ఆ సమయం ముగిసేలోగా వారు తమ టాలెంట్‌ని నిరూపించుకోవాలి. అది ఏ రకమైన ప్రతిభ అయినా సరే... ఇక్కడ ప్రదర్శించవచ్చు. ఆ ప్రయత్నంలో వాళ్లు ప్రదర్శించే కొన్ని విన్యాసాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటే, కొన్ని కడుపుబ్బ నవ్విస్తుంటాయి. ప్రముఖ దర్శకురాలు ఫరాఖాన్, సంగీత దర్శకుడు అనూమల్లిక్‌లు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించే ఈ షో ఇప్పటికే నాలుగు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఐదో సీజన్ ప్రారంభమవుతోంది.

బుల్లితెరపై బిగ్ బీ!
అమితాబ్... దేశం గర్వించదగ్గ పేరు. అతడు మావాడు అని సినీ పరిశ్రమ తలెత్తుకుని చెప్పే పేరు. ఆయన ఉన్నారంటేనే సినిమాకి ముందే క్రేజ్ ఏర్పడిపోతుంది. సినిమాయే అలా ఉంటే సీరియల్ పరిస్థితి ఎలా ఉంటుంది! టీఆర్పీ ఎక్కడికో వెళ్లిపోదూ! ఆ రోజు త్వరలోనే రానుంది. వెండి తెర మీద వెలుగులు కురిపించిన బిగ్ బీ.. త్వరలో బుల్లితెర మీద మెరవబోతున్నారు. ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’తో ఆయన ఆల్రెడీ బుల్లితెర మీద సంచలనాలు సృష్టించారు. ఈసారి సీరియల్ ద్వారా వచ్చి సర్‌ప్రైజ్ చేయబోతున్నారు. త్వరలోనే ఓ సీరియల్‌లో యుక్త వయసు వచ్చిన కూతురికి తండ్రిగా కీలకమైన పాత్రను పోషించనున్నారట బిగ్ బీ. ఆయన భార్యగా కమల్ హాసన్ మాజీ భార్య సారిక నటించనున్నారని తెలిసింది. విడిపోయిన బిగ్ బీ, సారికలను కలిపేందుకు వారి కూతురైన హీరోయిన్ చేసే ప్రయత్నాల చుట్టూ కథ నడుస్తుందట. కథ ఏదైతేనేం... అమితాబ్ నటిస్తున్నారు. ప్రేక్షకులు పిచ్చిగా ఫాలో అయిపోతారు. ఓ సీరియల్‌కి టీఆర్పీ తెచ్చి పెట్టడానికి అంతకంటే ఏం కావాలి!
 

Advertisement

పోల్

Advertisement