కథ: నవ్వేవాడు
నువ్వేం చేస్తావని నన్నెవరైనా అడిగినప్పుడు తత్తరపాటుకు గురవుతాను నేను. వేరే సమయాల్లో స్థిర చిత్తునిగా ఉండే నేను, అప్పుడు మాత్రం సిగ్గుపడి నత్తిగా మాట్లాడతాను. తానొక మేస్త్రీనని చెప్పుకోగలిగేవాని పట్ల నేను అసూయపడతాను. అదేవిధంగా క్షవరం చేసేవాళ్ల పట్ల, గుమాస్తాల పట్ల, రచయితల పట్ల నాకు ఈర్ష్య. ఎందుకంటే నువ్వేం చేస్తావని అడిగినప్పుడు జవాబివ్వటం వాళ్లకు చాలా సులభం. ఆ వృత్తులన్నీ సంబంధిత పని స్వభావాన్ని తమంతట తామే చెప్పేస్తాయి. దీర్ఘమైన వివరణల అవసరం పడదు వాటికి. కాని నేను మాత్రం అటువంటి ప్రశ్నలకు ‘నవ్వేవాణ్ని’ అని జవాబివ్వక తప్పదు. ఈ విధంగా చెప్పింతర్వాత మరో వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుంది నాకు. ‘అదే మీకు జీవన భృతినిస్తుందా?’ అనే రెండో ప్రశ్నకు ‘అవును’ అని సత్యపూర్వకంగా సమాధానమివ్వాల్సి ఉంటుంది.
నేను నవ్వటం ద్వారా డబ్బు గడించి బతుకుతున్నాననేది వాస్తవం. అంతేకాదు, ఆ సంపాదన ఎక్కువగానే ఉంటుంది కూడా. ఎందుకంటే నా నవ్వటానికి వ్యాపారపరంగా మంచి గిరాకీ ఉంది. నేను చాలా బిజీగా నవ్వగలగటమే కాక, అందులో మంచి అనుభవం ఉన్నవాణ్ని కూడా. నేను నవ్వినంత బాగా మరెవ్వరూ నవ్వలేరు. ఆ విద్యలోని చిన్న చిన్న అంశాల పట్ల నాకున్నంత నైపుణ్యం వేరెవరికీ లేదు. దీర్ఘమైన వివరణలు ఇవ్వటం నుంచి తప్పించుకోవడం కోసం చాలాకాలం పాటు నేనొక నటుడినని చెప్పుకునేవాణ్ని. కాని నటనలో నాకున్న ప్రతిభ చాలా తక్కువ కనుక, నన్ను నేను నటునిగా చెప్పుకోవడంలో అర్థం లేదనిపించింది. అది అసత్యం అని భావించాను. నేను సత్యాన్ని ప్రేమించేవాణ్ని మరి. సత్యమేమిటంటే నేను నవ్వేవాణ్ని. అంతే తప్ప బఫూన్నీ కాను, హాస్యనటుడినీ కాను. ఉల్లాసాన్ని ప్రదర్శిస్తానే తప్ప ఇతరులను ఉల్లాసవంతులుగా చేయను నేను. ఒక రోమన్ చక్రవర్తిలాగా కాని, ఒక సున్నిత మనస్కుడైన స్కూలు విద్యార్థిలాగా కాని నవ్వుతాను. నాకు పందొమ్మిదవ శతాబ్దపు నవ్వును నవ్వటం ఎంత సులువో, పదిహేడవ శతాబ్దపు నవ్వును నవ్వటం కూడా అంతే సులువు. సందర్భమొచ్చినప్పుడు నేను అన్ని శతాబ్దాల, అన్ని సామాజిక వర్గాల, అన్ని వయసుల నవ్వులనూ నవ్వుతాను. చెప్పులు కుట్టడమనేది ఎట్లా అయితే ఒక నైపుణ్యమున్న పనో, నవ్వటం కూడా అటువంటి పనే. నేను ఆ పనిలో నైపుణ్యాన్ని సంపాదించాను. అంతే. నా హృదయం అమెరికా నవ్వు, ఆఫ్రికా నవ్వు, తెల్ల నవ్వు, ఎర్ర నవ్వు, పచ్చ నవ్వు - వీటన్నింటికీ నిలయం. సరైన పారితోషికమిచ్చినప్పుడు, ఆ నవ్వును నేను డెరైక్టరుగారికి అవసరమైన విధంగా నవ్వుతాను.
నేను కొందరికి చాలా అవసరమున్నవాణ్ని అయిపోయాను. గ్రామఫోను రికార్డుల మీదా టేపుల మీదా నవ్వుతాను నేను. టెలివిజన్ డెరైక్టర్లు నన్నెంతో గౌరవంతో చూస్తారు. నేను దిగులుగా నవ్వగలను, సాధారణ మోతాదులో నవ్వగలను, హిస్టీరియా నవ్వును నవ్వగలను. ఒక బస్ కండక్టర్‌లాగా, కిరాణా కొట్టులోని ఒక పనివాడిలాగా నవ్వగలను. ఉదయపు నవ్వు, పగటి నవ్వు, సాయంత్రపు నవ్వు, రాత్రి నవ్వు అన్నీ వచ్చు నాకు. ఒక్క మాటలో చెప్పాలంటే నవ్వు అన్నది ఎక్కడ ఏ రూపంలో అవసరమైతే అలా నవ్వుతాను.
ఈ రకమైన వృత్తి చాలా అలసట కలిగిస్తుంది అని చెప్పాల్సి ఉంటుందిక్కడ. అంటువ్యాధిలా ఒకరి నుండి మరొకరికి సోకే నవ్వును నవ్వటంలో నేను స్పెషలిస్టునని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ ప్రత్యేకత నన్ను చిల్లర నవ్వు నవ్వే హాస్యగాళ్లకు అవసరమైనవాడిగా మార్చింది. అటువంటి హాస్యగాళ్లు తమ దమ్మున్న వాక్యాలను శ్రోతలు మిస్ అవుతారేమోనని భయపడుతుంటారు. అలా భయపడటం సమంజసమే. కాబట్టి చాలావరకు సాయంత్రాలను నేను నైట్ క్లబ్బుల్లో గడుపుతుంటాను. అక్కడ నేనొక వివేకవంతుడైన కిరాయి శ్రోతను. ఆ కార్యాక్రమాల్లో కేరింతలు తగ్గిన సమయాల్లో అంటువ్యాధిలా ఇతరులకు సోకేలా నవ్వటం నా పని. ఆ నవ్వటం చాలా జాగ్రత్తతో, సరైన సమయంలో జరగాలి. మనసారా తుళ్లుతూ పెద్ద శబ్దం వచ్చేలా నవ్వటం అన్నది అవసరమైన వేళకు ముందు కాని, తర్వాత కాని జరగకూడదు. కరెక్టుగా సమయంలోనే జరగాలి ఆ పని. ఆ విధంగా ముందు నిర్ధారించుకున్న క్షణంలో నేను పెద్దగా నవ్వుతాను. శ్రోతలందరూ నాతో పాటు పెద్ద శబ్దం చేస్తూ నవ్వుతారు. అప్పుడు ఒక జోకు ఆదా అవుతుందన్నమాట.
అంతా అయిపోయాక నేను చాలా అలసిపోయి, ప్రవేశ ద్వారం దగ్గరి గదిలోకి పోయి, అక్కడ పెట్టుకున్న నా కోటును తొడుక్కుని, డ్యూటీ తర్వాత ఇంటికి పోగలుగుతున్నందుకు ఆనందిస్తాను. ఇంటికి చేరుకోగానే, సాధారణంగా కొన్ని టెలిగ్రాములు నాకోసం వేచి ఉంటాయి. ‘అర్జెంటుగా మీ నవ్వు అవసరమైంది. మంగళవారం నాడు రికార్డింగు’ అన్న టెలిగ్రామును చదువుకుని, కొన్ని గంటల తర్వాత నేను వేడెక్కిన ఎక్స్‌ప్రెస్ రైల్లో ప్రయాణిస్తూ, నా విధి రాతకు ఏడుస్తుంటాను.
డ్యూటీలో లేనప్పుడు గాని, సెలవు మీద ఉన్నప్పుడు గాని నాకు అసలే నవ్వాలనిపించదని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పశువులను గమనించే పని లేనప్పుడు పశువుల కాపరికి, సిమెంటూ సున్నం గురించి ఆలోచించే అవసరం లేనప్పుడు మేస్త్రీకి ఆనందంగా ఉంటుంది కదా. వడ్రంగివాళ్ల ఇళ్లల్లో సాధారణంగా ద్వారం తలుపులు పాడైపోయి ఉంటాయి. లేదా టేబులు సొరుగులు జామ్ అయి, లాగితే రావు. కేకులు చేసేవాళ్లకు పుల్లని పచ్చళ్లు నచ్చుతాయి. మాంసం అమ్మేవాడికి బెల్లంపట్టీలు ఇష్టం. బ్రెడ్ తయారుచేసేవాడు బన్ను కన్నా మాంసపు ముట్టీలనే ఎక్కువగా ఇష్టపడతాడు. బయట బుల్ ఫైటింగ్ చేసేవాళ్లు వ్యాపకం కోసం ఇంట్లో పావురాలను పెంచుతారు. బాక్సింగ్ చేసే వీరులు ఇంట్లో తమ పిల్లవాని ముక్కులోంచి రక్తం కారితే చూసి భయంతో పాలిపోతారు. ఇవన్నీ నాకు చాలా సహజం అనిపిస్తాయి. ఎందుకంటే డ్యూటీలో లేనప్పుడు నేను కూడా అసలే నవ్వను కనుక. అప్పుడు నేనొక గంభీరమైన మనిషిని. అందరూ నన్ను నిరాశావాది అంటారు. అలా అనటం సహజమే మరి.
మా పెళ్లయిన కొత్తలో నా భార్య తరచుగా ‘నవ్వండి’ అనేది. కాని ఆమె కోరికను నేను తీర్చనని తెలిసిపోయిందావిడకు. గాఢమైన గంభీరతతో కూరుకుపోయి నా గట్టి ముఖ కండరాలను వొదులు చేసుకోవటం, చితికిన నా జీవచైతన్యాన్ని కూడగట్టుకోవడం సంతోషకరంగా ఉంటుంది నాకు. నిజానికి ఎదుటివాళ్ల నవ్వు కూడా నాకు భారమైన ఆందోళనను కలిగిస్తుంది. కారణం అది నా వృత్తిని నాకు పదేపదే గుర్తు చేస్తుంది. కాబట్టి మా కుటుంబ జీవితం నిశ్శబ్దంగా, ప్రశాంతంగా గడిచిపోతోంది. నా భార్య కూడా హాయిగా నవ్వటం అనే విషయాన్ని మరిచిపోయింది. అప్పుడప్పుడు ఆమె చిరునవ్వు నవ్వటం గమనించి, నేను కూడా నిశ్శబ్దంగా నవ్వుతాను. నైట్ క్లబ్బుల గోల అంటే నాకు అసహ్యం కనుక, అదే విధంగా రికార్డింగ్ స్టూడియోల్లో నిండిపోయే చప్పుడంటే నాకిష్టం లేదు కనుక, మేము తగ్గు స్వరాల్లో మాట్లాడుకుంటాం. కొత్తవాళ్లు నన్ను చూసి నేను మితభాషిననుకుంటారు. బహుశా అది నిజమే కావచ్చు. ఎందుకంటే మాట్లాడటం కోసం కంటె, నవ్వటం కోసమే ఎక్కువసార్లు నోరు తెరవాల్సి ఉంటుంది నాకు. అప్పుడప్పుడు చిరునవ్వు నవ్వుతూ, ఉద్వేగం లేని ముఖ కవళికతో జీవితాన్ని గడుపుతున్నాను నేను. ఎప్పుడైనా అసలైన నవ్వును నవ్వానా? అనుకుంటాను నాలో నేనే. నా తోడబుట్టినవాళ్లకు నేనెప్పుడూ గంభీరమైనవాడిగానే తెలుసు. రకరకాలుగా నవ్వే నేను, నా నిజమైన సొంత నవ్వు శబ్దాన్ని విననే లేదు. బయట బుల్ ఫైటింగ్ చేసేవాళ్లు వ్యాపకం కోసం ఇంట్లో పావురాలను పెంచుతారు. బాక్సింగ్ చేసే వీరులు ఇంట్లో తమ పిల్లవాని ముక్కులోంచి రక్తం కారితే చూసి భయంతో పాలిపోతారు. ఇవన్నీ నాకు చాలా సహజం అనిపిస్తాయి.
రచయిత పరిచయం
జర్మనీలోని కొలోన్‌లో 1917లో జన్మించాడు. రెండవ ప్రపంచ యుద్ధానంతర కాలంలోని అగ్రగణ్యులైన జర్మన్ రచయితల్లో ఒకడు. 1930లో హిట్లర్ పార్టీలో చేరమంటే అందుకు నిరాకరించాడు. ఫ్రాన్స్, రొమేనియా, హంగెరీ, సోవియెట్ యూనియన్ సైన్యాల్లో పనిచేసి, నాలుగుసార్లు గాయపడ్డాడు. 1945 లో అమెరికన్ సైన్యానికి పట్టుబడి, యుద్ద ఖైదీ అయ్యాడు.
ద క్లౌన్, బిలియర్డ్స్ ఎట్ హాఫ్ పాస్ట్ నైన్, గ్రూప్ పోర్ట్రెయిట్ విత్ లేడీ, అండ్ నెవర్ సెడ్ ఎ వర్డ్ మొదలైన నవలలు ఇతని రచనల్లో ముఖ్యమైనవి. ‘పి.ఇ.ఎన్.(పెన్) ఇంటర్నేషనల్’ అనే రచయితల/మానవ హక్కుల సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నాడు. 1972లో నోబెల్ ప్రైజ్ గెలుచుకున్నాడు. ఉదయపు నవ్వు, పగటి నవ్వు, సాయంత్రపు నవ్వు, రాత్రి నవ్వు అన్నీ వచ్చు నాకు. ఒక్క మాటలో చెప్పాలంటే నవ్వు అన్నది ఎక్కడ ఏ రూపంలో అవసరమైతే అలా నవ్వుతాను.
జర్మన్ మూలం: హెన్రిక్ బోల్
అనువాదం: ఎలనాగ