కథల్లో అంతరార్థం | storys internal meaning by elanaga | Sakshi
Sakshi News home page

కథల్లో అంతరార్థం

Published Sun, Nov 20 2016 11:55 PM | Last Updated on Mon, Sep 4 2017 8:38 PM

storys  internal meaning by elanaga

మరీ కొరకరాని కొయ్యల వంటి కథల గురించి కాదు గానీ, మెదడుకు కొంత పని పెట్టే ఐదు కథల గురించి చెప్పదల్చు కున్నాను. తిలక్‌ రాసిన ‘మణిప్రవాళం’ కొరకరాని కొయ్య కిందకే వస్తుంది. ఆయనే రాసిన ‘లిబియా ఎడారిలో’ కూడా కొంచెం కొరకరానిదే. అర్థం చేసుకోవడానికి మరీ అంత మేధ కాకపోయినా, కొంత రీజనింగ్‌ అవసరమయ్యే కథలు కొన్ని జ్ఞప్తికి రావడం నన్ను ఈ వ్యాసం రాసేలా చేసింది.
 
ఏలూరెళ్లాలి:
చాసో రాసిన కథల్లో ఈ రకానికి చెందినవి రెండు మూడున్నాయి. ‘ఏలూరెళ్లాలి’ని మాత్రం ప్రస్తావిస్తానిక్కడ.
చాసో దీన్ని ఎందుకు రాశాడా అని ఆలోచించకుండా ఉండలేకపోయాను, కథను చదవటం ముగించాక. సంక్షిప్తంగా కథాంశమేమంటే – తన పక్కింట్లో వుండే ఒక వివాహిత స్త్రీతో అనుకోకుండా శారీరక సంబంధం ఏర్పడుతుంది కథకునికి. ఆమెకు పిల్లలు లేరు. భర్త తీరును బట్టి చూస్తే, పిల్లలు కలిగే అవకాశం కూడా లేదు. అతడు అమాయకుడు, మెత్తని వాడు, వ్యవహార దక్షత లేనివాడు. కొంత కాలమయ్యాక ఆ దంపతులు బదిలీ మీద వేరే ఊరికి పోవటం వల్ల, వాళ్ల గురించిన సమాచారం కథకునికి తెలియదు. తర్వాత ఎన్నో యేళ్లకు కథకుడు ఒక రైల్లో ప్రయాణం చేస్తుంటే అందులో ఆ స్త్రీ, ఆమెతోపాటు తొమ్మిదేళ్ల బాలుడు కనిపిస్తారు. ఆ బాలుడు కథకునికి పుట్టినవాడే అన్న రహస్యాన్ని బహిర్గతం చేస్తుంది ఆమె. తనకు సంతానం కలిగివుండకపోతే తన మరుదులు ఆస్తినంతా లాక్కుని దిక్కు లేనిదానిగా మార్చే వారనీ, ఇప్పుడు తన జీవితానికి ఏ ఢోకా లేదనీ చెప్పి, కృతజ్ఞతలను తెలుపుకుంటుంది ఆమె. ‘‘ఏలూరెళ్లాలి’’ అని కథకుడు అనుకోవటంతో కథ ముగుస్తుంది.
ఈ కథ ద్వారా చాసో ఒక అక్రమ సంబంధం తాలూకు అనైతికతను సమర్థిస్తున్నాడా? లేక కొన్నిసార్లు కొన్ని సంఘటనలు జరుగుతాయంతే. వాటికి యాదృచ్ఛికత, విధిలీల తప్ప వేరే ప్రత్యేక కారణాలంటూ ఉండవు, అని మాత్రమే చెప్పదల్చుకున్నాడా? సాధారణ సందర్భాలలో ఇటువంటి సంబంధాలు గర్హించతగినవే అయినా, ఈ కథలోని చర్య మాత్రం ఒక జీవితాన్ని నిలిపింది. ఇదే ఈ కథలోని విశేషం.
సూరిబాబు నవ్వు:
రావిశాస్త్రి రాసిన ఈ కథను ఇరవై ఐదేళ్ల క్రితం చదివాను. కథలో సూరిబాబుకు ఒక స్నేహితుడుంటాడు. అతడు జీవితంలో ఎన్నో ఒడిదుడుకులకు లోనవుతాడు. ఆ సందర్భాల్లో సొంతవాళ్లెవ్వరూ అతనికి బాసటగా ఉండరు. కథ చివరలో ‘‘నాకు అండగా ఉన్న వాళ్లే లేరు’’ అంటూ వాపోతాడు ఆ మిత్రుడు. ‘అప్పుడు సూరిబాబు ఒక వెర్రినవ్వు నవ్వాడు’ అంటూ కథను ముగిస్తాడు కథకుడు. కథను జాగ్రత్తగా చదివితే సూరిబాబు ఒక్కడే ఆ స్నేహితునికి గడ్డు పరిస్థితుల్లో ఎంతో బాసటగా నిలిచాడనే సంగతి తెలిసిపోతుంది. అయితే ఆ విషయాన్ని కథకుడు పూర్తిగా వాచ్యం చేసి చెప్పడు.
అవకాశమిస్తే:
ఈ కథ వట్టికోట ఆళ్వారు స్వామి రాసిన ‘జైలు లోపల’ సంపుటిలోనిది. నిరపరాధులైన ఖైదీల గురించి నెహ్రూ చేసిన ఒక సానుభూతికర వ్యాఖ్యను ప్రస్తావించడంతో ప్రారంభమయ్యే ఈ కథ, స్త్రీలకు సమాన హక్కులుండాలనే అంశం మీద భార్యాభర్తలు చేసే చర్చకు దారి తీస్తుంది. అయితే ఈ చర్చకు సమాంతరంగా, ఆళ్వారు స్వామి తాను చూసిన ఒక ఖైదీ తాలూకు దీనగాథను వివరిస్తాడు. ఆ ఖైదీ వేరే రాష్ట్రంవాడు. తన సొంత ఊరికి దగ్గర్లో వుండే జైలుకు మార్చమని అధికారుల వద్ద దీనంగా వేడుకున్నా వాళ్లు మన్నించరు. అన్నపానాదులను మానడంతో చివరకు అతడు ఆ జైలులోనే మరణిస్తాడు. కథకుడు ఇట్లా ఒకే కథలో రెండు వృత్తాంతాలను ఇమడ్చటం ద్వారా ఏం సాధించాడు? స్త్రీల సమాన హక్కులను గురించిన చర్చల్లో ‘‘స్త్రీలమైన మేము కూడా అవకాశమిస్తే పురుషులతో సమానంగా రాణిస్తాం’’ అంటుంది కథకుని భార్య. ఖైదీ చేసుకున్న విన్నపానికి అధికారులు అనుకూలంగా స్పందించి వుంటే అతడు కూడా జీవితంలో రాణించే వాడేమో అనే అర్థం వచ్చేలా చూచాయగా చెప్తాడు కథకుడు. దీన్ని పట్టుకుంటే, రెండు వృత్తాంతాలలోని సామ్యం బోధపడుతుంది. చాలా తేటతెల్లంగా చెప్పడం చాసో కథల్లో సాధారణంగా  కనపడదు. లేదా, ఇదే విషయాన్ని ఇంకో రకంగా కూడా చెప్పుకోవచ్చు: కథనంలో కొంత యుక్తిని ప్రవేశ పెట్టడం మంచిదే అనే అభిప్రాయం ఉన్నవాడు చాసో. రావిశాస్త్రి, ఆళ్వారుస్వామి మాత్రం కథలను తేటతెల్లంగా రాసేవాళ్లే. ఈ కథలను మాత్రం ఈ విధంగా రాయటం ఉద్దేశపూర్వకమైనా కావాలి, లేదా యాదృచ్ఛికమైనా కావాలి.
ఆంగ్ల కథల్లో కూడా ఇటువంటి చమత్కారాలున్న సందర్భాలున్నాయి.
The Dream:
ఈ మామ్‌ కథను దాదాపు నలభై సంవత్సరాల కిందట నేను తెలుగులోకి అనువదిస్తే, ‘విపుల’ వారు ప్రచురించారు. ఒక రష్యన్‌ వ్యక్తి వేరే దేశపు యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. కానీ, వాళ్ల మధ్య విపరీతమైన ద్వేషాలుంటాయి. ఆ భార్యాభర్తలు ఎన్నో అంతస్తులున్న భవనంలోని పై అంతస్తులో నివసిస్తుంటారు. న్యాయవాది అయిన ఒక పాత మిత్రునితో కలిసి ఒక హోటల్లో భోజనం చేస్తూ, తన భార్య పైనుండి గ్రౌండ్‌ ఫ్లోర్‌లోని నేల మీద పడి చనిపోయినట్టు ప్రతిరోజూ కల వస్తోందని చెప్తాడు ఆ భర్త. ఒకరోజు నిజంగానే ఆమె కింద నేల మీద పడి చనిపోయి వుంటుంది. అంతటితో కథ ముగుస్తుంది. అతను నిజంగా తన భార్యను హత్య చేశాడా? అనే సందేహం పాఠకుని మెదడును తినేస్తూనే వుంటుంది.

A Friend in Need:
జపాన్‌ లోని కోబె పట్టణంలో బర్టన్‌ అని ఒకాయనుంటాడు. అతడు బ్రిడ్జ్‌ బాగా ఆడుతాడు. కానీ, అదే పేరు గల మరొకతడు మొదటి బర్టన్‌ను చాలాసార్లు బ్రిడ్జ్‌లో ఓడిస్తాడు. కొంత కాలం తర్వాత ఈ రెండవ బర్టన్‌  దారుణమైన ఆర్థిక ఇబ్బందులతో బాధ పడుతుంటాడు. అతడు మొదటి బర్టన్‌ దగ్గరికి వచ్చి, తనకు ఉద్యోగమివ్వమని ప్రార్థిస్తాడు. ‘‘నువ్వు ఏ పని చేయగలవు?’’ అని మొదటి బర్టన్‌ అడిగినప్పుడు, ‘‘ఈదగలుగుతాను’’ అని జవాబిస్తాడు. ఒకప్పుడతడు మంచి ఈతగాడే. కానీ, ఇప్పుడు చాలా పీలగా, బలహీనంగా ఉన్నాడు. మొదటి బర్టన్‌ ‘‘నువ్వు సముద్ర తీరంనుండి ఈదడం మొదలుపెట్టి, అదే సముద్రంలో మరోచోట వున్న బండరాళ్ల దగ్గరికి చేరుకోవాలి’’ అంటాడు. ‘‘నేనిప్పుడు బలహీనంగా ఉన్నాను కనుక, ఈదటం కష్టం’’ అంటాడతడు. ‘‘కొన్ని సంవత్సరాల క్రితం నేను లైట్‌ హౌస్‌ చుట్టూ ఈదుతూ బండరాళ్ల దగ్గరికి చేరుకునే వాణ్ని. ఈ దూరాన్ని ఈదటానికి నీకు గంటపావుకన్న ఎక్కువ సమయం పట్టదు, నేను కొంచెం ఆలస్యంగా కారులో వస్తానక్కడికి’’ అంటాడు మొదటి బర్టన్‌. అయితే అంత సమయం గడిచినా రెండవ బర్టన్‌ ఆ రాళ్లగుట్ట దగ్గర కనిపించడు.

‘‘ఆఖరి నిమిషంలో మనసు మార్చుకుని ఈదలేదా?’’ అని అడుగుతాడు కథకుడు. ‘‘సుడిగుండాల్లో చిక్కుకుని మరణించి వుంటాడు. మూడు రోజులదాకా అతని శవం దొరకలేదు’’ అంటాడు బర్టన్‌.
‘‘అతడు ఈదలేక మునిగిపోతాడని ముందుగానే ఊహించావా?’’ అని అడుగుతాడు కథకుడు. అప్పుడు దాపరికం లేని నీలికళ్లతో గెడ్డాన్ని రుద్దుకుంటూ ‘‘అప్పుడు నా ఆఫీసులో ఖాళీ లేదు మరి’’ అని జవాబిస్తాడు బర్టన్‌. ఇది కూడా మామ్‌ రాసిన కథే.

లాటిన్‌ అమెరికన్‌ కథకులు కూడా కొందరు ఇటువంటి కథలను రాశారు. వీటిలో హూలియో కొర్తాజర్‌ రాసిన Letter to a Young Lady in Paris,  ఉక్తావియో పాజ్‌ రాసిన The Blue Bouquet చెప్పుకోతగినవి. కొర్తాజర్‌ కథ అద్భుతమైన కవితా వచనంతో నిండి వుంటుంది. అంతే కాక, కథాంశం మాంత్రిక వాస్తవికతతో కూడుకున్నది. లిఫ్టు్టలో పై అంతస్తులకు పోతుంటే మధ్యమధ్యన కథానాయకుని గొంతులోంచి అకస్మాత్తుగా చిన్న కుందేలు పిల్లలు బయటికి వచ్చినట్టు చెప్తాడు రచయిత. అవి పుస్తకాలకు ప్రతీకలు అని కొందరు పాఠకులు మాత్రమే ఊహించగలుగుతారు – అదీ కథ చివరి దాకా వచ్చింతర్వాతనే. ఉక్తావియో పాజ్‌ రాసిన కథ పెద్ద పజిల్‌ లాగా ఉంటుంది.
పాఠకుల ఊహాశక్తిని పరీక్షకు పెట్టే ఇటువంటి కథలు కూడా అప్పుడప్పుడు కొన్ని రావటం మంచిదేనేమో అనిపిస్తుంది, బాగా ఆలోచిస్తే.
ఎలనాగ
9866945424

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement