విభజన పాపం ఆ రెండు పక్షాలదే | ABK Prasad Article On Kashmir Issue | Sakshi
Sakshi News home page

విభజన పాపం ఆ రెండు పక్షాలదే

Published Tue, Aug 13 2019 1:00 AM | Last Updated on Tue, Aug 13 2019 1:00 AM

ABK Prasad Article On Kashmir Issue - Sakshi

‘‘కశ్మీర్, జమ్మూ ప్రజల అభీష్టమే శిలా శాసనంగా ఉండాలి. మీరు ఇండియాలో కలిసిపోవాలని నేను మహారాజా హరిసింగ్‌ను కోరబోను. కశ్మీర్‌ ప్రజల్ని ‘మీరు పాకిస్తాన్‌లో చేరదలచారా, లేక ఇండియాలో చేరతారా అని మాత్రమే అడగాలి. విలీనీకరణ నిర్ణయం వారి ఇష్టం, పూర్తిగా వారి అభీష్టం. ఈ విషయంలో పాలకుడికి పాత్ర లేదు, అతడు నిమిత్తమాత్రుడే, కేవలం ప్రజలే సర్వ శక్తిమంతులు, వారి నిర్ణయమే అంతిమం. కశ్మీర్‌ విక్రయ దస్తావేజు ఫలితం’’
– మహాత్మాగాంధీ : దేశ స్వాతంత్య్ర ప్రకటనకు ముందు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ కశ్మీర్‌ ప్రజల అభీష్టాన్ని తెలుసుకు రమ్మని గాంధీని కశ్మీర్‌ పర్యటనకు పంపినప్పుడు పర్యటనానంతరం ప్రకటన 1947.
‘‘సగటు కశ్మీర్‌ కుటుంబాలు ఉన్నంతలో తాము హుందాగా బతికేందుకే ప్రాధాన్యమిస్తాయి. ఉపాధి కోసం ఇతర బయటి రాష్ట్రాలకు వెళ్లడాన్ని, కూలిపని చేయడాన్ని కశ్మీరీలు నామోషీగా భావిస్తారు. సుగంధ ద్రవ్యాలు, యాపిల్‌ పండ్ల సాగు, కళాత్మకమైన పనులు, చేతి వృత్తుల విషయంలో కశ్మీరీలకు మంచి నైపుణ్యం ఉంది. సొంతంగా తాము నిలదొక్కుకోవాలన్న తపన కశ్మీరీలలో చాలా అధికం’’
– ఇస్మాయిల్, ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి, జమ్మూ–కశ్మీర్‌ నుంచి (8.8.2019)

‘నరజాతి చరిత్ర సమస్తం పరపీడనా పరాయణత్వం’ అన్న మహాకవి వాక్కు అక్షరసత్యం. దుష్ట పాలకులవల్లే మానవ జాతికి ఈ దుస్థితిపట్టింది. మరోసారి తన ఉనికికే ప్రమాదం ఏర్పడిన సంద ర్భంగా, తనకు సంబంధం లేని పాత, కొత్త రకం పాలనా శక్తుల, విధానాల ఫలితంగా అమాంబాపతు సంధుల పర్యవసానంగా కశ్మీర్‌ తన ప్రత్యేకతనే కోల్పోయే స్థితిలో పడింది. కర్ణుడి చావుకి అనేక కారణాలన్నట్టుగా ఆది నుంచి అందాల కశ్మీర్‌ తన ఉనికిని కోల్పోవ డానికి కారకులు ఒకరా, ఇద్దరా, ఎందరెందరో. భారత స్వాతంత్య్ర మహోదయ ముహూర్తంలో, కశ్మీర్‌ ఇంకా భారతదేశంలో విలీనం కాని దశ అది. కశ్మీర్‌ ఉత్థాన పతనాల చరిత్రను తలచుకుంటే, నిన్న మొన్నటిదాకా బీజేపీ పాలకులు దాని ప్రస్తుత ఉనికిని కాపాడు కుంటూ వచ్చిన ప్రత్యేక ప్రతిపత్తిని కాస్తా రద్దు చేయడంతో మరో సారి కశ్మీర్‌ ప్రజల్ని ‘పెనం నుంచి పొయ్యిలోకి పడదోసినట్టయింది. కడుపు చించుకుంటే కాళ్లమీద పడినట్టుగా అసలు జమ్మూ–కశ్మీర్‌ ఏర్పాటే బ్రిటిష్‌ పాలకులు తమ సామ్రాజ్య ప్రయోజనాలు ఈడేరు కోవడానికి సృష్టించిన పన్నాగం. ఈ ఏర్పాటుకు తన విద్రోహం ద్వారా బ్రిటిష్‌ పాలకులకు సాయపడిన త్రాష్టులు కొందరు డోగ్రా రాజులు (శుద్ధ శ్రోత్రియులు) లాహోర్‌లోని సిక్కు దర్బార్‌ (లాహోర్‌ దర్బార్‌ అని ప్రసిద్ధి)ను మోసగించిన వారిలో ప్రసిద్ధుడు గులాబ్‌ సింగ్‌. ఎప్పుడైతే రంజిత్‌ సింగ్‌ 1839లో చనిపోయాడో అప్పటినుంచీ సిక్కు రాజ్యం బదాబదలవుతూ వచ్చింది. ఈ అదను చూసుకుని బ్రిటిష్‌ సామ్రాజ్య పాలకులు పంజాబ్‌ను మింగేయాలనుకున్నారు. దీని పర్యవసానమే నాటి బ్రిటిష్‌ గవర్నర్‌ జనరల్‌ సర్‌ హెన్రీ హార్డింజ్, సిక్కులపై యుద్ధం ప్రకటించడం. విద్రోహానికి మారు పేరైన గులాబ్‌ సింగ్‌ బ్రిటిష్‌ పాలకులతో లోపాయికారీగా సంధి సంప్రదింపులు నడిపాడు. ఫలి తంగా తొలి ఆంగ్లో–సిక్కు యుద్ధంలో (1845–46) సిక్కు రాజ్యం ఓడిపోయింది. సిక్కుల పతనం గులాబ్‌ సింగ్‌ విద్రోహ ఫలితం. దీని పర్యవసానంగా బ్రిటిష్‌ వాళ్లతో లాహోర్‌ సంధికి (1846 మార్చి 9) సిక్కులు దిగివచ్చారు. ఈ సంధి ఫలితం దేనికి దారి తీసింది? మొత్తం సట్లెజ్‌ భూభాగాలు, బియాస్‌ సట్లెజ్‌ ఉమ్మడి ప్రాంతాలు, వాజారా, యావత్తు కశ్మీర్‌ రాష్ట్రమూ బ్రిటిష్‌ సామ్రాజ్య ప్రతినిధిగా వ్యవహరిస్తున్న ఈస్టిండియా కంపెనీకి బలవంతంగా ధారాదత్తం కావలసి వచ్చింది. ఇందుకు ముదరాగా విద్రోహి రాజా గులాబ్‌ సింగ్‌ ‘స్వతంత్ర సార్వభౌమాధికారి’గా కంపెనీ గుర్తించి కొన్ని భూభాగాలను, జిల్లాలనూ అతనికి ‘అత్త సొమ్ము అల్లుడి’కి మాదిరిగా ధారాదత్తం చేసింది. ఇది ప్రత్యేక ఒప్పందం ద్వారా కుదిరింది. కనుకనే మహాత్మాగాంధీ 1947లోనే ‘అమృత్‌సర్‌ సంధి’ని విక్రయ దస్తావేజు (డీడ్‌ ఆఫ్‌ సేల్‌)గా నిరసిం చారు. ఇంతకూ రాజా గులాబ్‌ సింగ్‌ని కశ్మీర్‌ను బ్రిటిష్‌ వాళ్లకు కేవలం రూ. 75 లక్షలకు అమ్మేశాడు. కశ్మీర్‌ ప్రజల తీవ్ర నిరసనను బ్రిటిష్‌వాళ్లు ఘోరంగా అణచివేశారు. ఆ సమయంలో కూడా సిక్కు పూర్వ పాలకులు కశ్మీర్‌ గవర్నర్‌గా నియమించుకున్న షేక్‌ ఇమా ముద్దీన్‌ కశ్మీర్‌ లోయను గులాబ్‌ సింగ్‌కు స్వాధీనం చేయడానికి నిరాకరిస్తే గులాబ్‌ సింగ్‌కి సాయంగా బ్రిటిష్‌ సైన్యం వెళ్లి సింహా సనం మీద కూర్చోబెట్టింది. అందుకే ఆ తర్వాత భారత స్వాతంత్య్ర ప్రకటనకు ముందు బ్రిటిష్‌ పాలకులు దేశ విభజన సందర్భంగా రాడ్‌క్లిఫ్‌ అవార్డును ప్రకటించి, వివాదానికి తెరలేపకుండా ఉన్నట్ట యితే భూమార్గంలో కశ్మీర్‌ చేరుకోవడానికి వీలుండేది కాదని సుప్ర సిద్ధ భారత చరిత్రకారుడు, న్యాయవాది కశ్మీర్‌ వివాదంపై సాధికార గ్రంథాలు రచించిన ఎ.జి. నూరానీ (‘కశ్మీర్‌ డిస్ప్యూట్‌’ 1947– 2012) రాశారు. 

నిజానికి భారతదేశ (ఉపఖండం) విభజనకు గాంధీజీ పచ్చి వ్యతిరేకం. బహుశా అందుకే ఆయనను హత్యచేసి ఉంటారు, తిరిగి వారే నేడు గాంధీ జయంతులు జరుపుతూ, విగ్రహావిష్కరణలు చేస్తు న్నారు. గాంధీజీ హత్యా పాపానికి ఉపశమనంగా బహుశా శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ (నాటి జనసంఘ్‌ నేత, ఇప్పటి బీజేపీ నేతలకు ఇష్టుడు) పండిట్‌ నెహ్రూ మంత్రి వర్గ సభ్యుడిగా ఉండి, ‘కశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తిని నికరం చేసిన మంత్రివర్గ తీర్మానానికి మద్దతు పలికి ఉంటారు. కానీ అదే శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ మద్దతు తెలిపిన కశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తికి చెందిన 370వ రాజ్యాంగ నిర్ణయ సభ ఆర్టికల్‌ను బీజేపీ పాలకులు ఎందుకు రద్దు చేయవలసి వచ్చిందో చెప్పరు. 

370వ ఆర్టికల్‌ను రద్దుపర్చడం ద్వారా కశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేశామన్న అల్ప సంతోషం పాలకులకు మిగలవచ్చు గానీ కశ్మీర్‌ ప్రజలను, వారి ప్రజా ప్రతినిధులను సంప్రదించకుండా నిరంకుశ ధోరణిలో ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయడాన్ని వారం రోజుల తర్వాత కూడా కశ్మీరీలు సమ్మతించగల స్థితిలో లేరని చక్కబడని పరిస్థితులు తెల్పుతున్నాయి. కానీ కశ్మీర్‌ పరిస్థితులకు, భారతదేశ విభజనకు కాంగ్రెస్‌–జన్‌సంఘ్‌ ఉభయపక్షాలే కారణమంటే అతిశయోక్తి కాదు. కశ్మీర్‌ విషయంలో రాజ్యాంగ నిర్ణయసభ, 370 ఆర్టికల్‌ ద్వారా ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తూ చేసిన నిర్ణయానికి, దేశీయ స్వతంత్ర సంస్థానాలను రద్దు చేస్తూ 16 సంస్థానాలతో కుదుర్చుకున్న విలీనీ కరణ ఒప్పందాలకు ఉన్న తేడాను విస్మరించడం సమర్థనీయం కాదు. ఎందుకంటే, ముస్లిం మెజారిటీ ప్రజలున్న కశ్మీర్‌కు పాలకుడైన హిందూ మహారాజా హరి సింగ్‌ ఇండియాలో కశ్మీర్‌ విలీనీకరణ పత్రంపై సంతకం చేయకుండా, ఆయన తరఫున మరొకరు సంతకం చేశారన్న తీవ్ర అభియోగాలున్నాయి. ఇందుకు సాక్ష్యంగా చరిత్ర పరిశోధకులు ప్రొఫెసర్‌ లాంబ్, ఆండ్రూ వైట్‌హెడ్, విక్టోరియా స్కో ఫీల్డ్‌ల పరిశోధనలున్నాయి. అంతేగాదు, కొన్ని యథాతథ ఒడంబడి కల (స్టాండ్‌ స్టిల్‌ అగ్రిమెంట్స్‌)పైన, విలీనీకరణ పత్రాలపైన సంత కాలు చేసినవారు సంస్థానాధీశులు కారని, వారి తరఫున వారికి లోబడి పనిచేసే వ్యక్తులనీ, ఒకచోట ఆంతరంగిక కార్యదర్శి, ఇంకో చోట ప్రధాన కార్యదర్శి లేదా తాత్కాలిక ప్రధానమంత్రి అనీ పరిశోధ కుల భావన. జమ్మూ కశ్మీర్‌ విలీనీకరణ పత్రాలలో కొన్నింటిపైన దిద్దులు, తుడిచి ఉన్నట్టు కూడా కొందరు పరిశోధకుల అభిప్రాయం. 

అలాగే జమ్మూలో ప్రవేశించిన డోగ్రాలు బడా భూస్వాములు. వీరు బ్రిటిష్‌ పాలకుల కనుసన్నల్లో మెçసులుతూ తూర్పు ఇండియా కంపెనీకి గులాములుగా మారారు. వీరు ఎంతవరకు పాకారంటే జమ్మూలో శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ నెలకొల్పిన ‘ప్రజా పరిషత్‌’ (ఆరె స్సెస్‌ శాఖ)కు ప్రేమ్‌నాథ్‌ డోగ్రా అధ్యక్షుడయ్యారు, ఆరెస్సెస్‌ జమ్మూ యూనిట్‌ మాజీ అధ్యక్షుడుగా పనిచేశారు. కశ్మీర్‌ ఇటు ఇండియాలో గానీ, అటు పాకిస్తాన్‌లోగానీ విలీనం కాకుండా స్వతంత్ర కశ్మీర్‌గా ప్రత్యేక ప్రతిపత్తితోనే కొనసాగుతుందని షేక్‌ అబ్దుల్లా ప్రకటించడం కాంగ్రెస్‌–జన్‌సంఘ్‌లకు కన్నెర్రయింది. కారణం? అబ్దుల్లా కశ్మీర్‌ అధినేతగా భూములపై కొద్దిమంది గుత్తాధిపత్యాన్ని రద్దుచేసే ‘ఎస్టేట్స్‌ రద్దు చట్టాన్ని’ 1951లో ప్రవేశపెట్టడంతో డోగ్రాల ఆర్థిక గుత్తాధిపత్యానికి గండిపడింది, అదీ నష్టపరిహారం చెల్లించనవసరం లేదని చట్టం నిర్దేశించడంవల్ల. 

ఇండియన్‌ యూనియన్‌లో భాగంగానే జమ్మూ–కశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తికి చట్టరీత్యా బలమైన పునాది వేయడానికి కశ్మీర్‌ అధినేత అబ్దుల్లా కశ్మీర్‌ రాజ్యాంగాన్ని రూపొందించడానికి సిద్ధం కావటం తోనే కాంగ్రెస్‌–జన్‌సంఘ్‌ వర్గాలు అప్రమత్తమై ప్రతివ్యూహాలు పన్నాయి. తాను సమ్మతించిన అబ్దుల్లానే నెహ్రూ పదకొండేళ్లు జైలు పాలు చేయగా, బీజేపీ నాయకులు ఇప్పుడు రాజ్యాంగ నిర్ణయ సభ కశ్మీర్‌కు ప్రకటించిన ప్రత్యేక ప్రతిపత్తినే రద్దు చేయడానికి సాహ సించి, సరికొత్త అశాంతికి తెరలేపారు. రూ. 75 లక్షల విక్రయ (అమ్మ కపు) దస్తావేజుపై రాజా గులాబ్‌ సింగ్‌ సంతకంతో ప్రారంభమైన కశ్మీర్‌ ఇప్పటికీ కన్నీళ్లోడుతున్న సందర్భంగా ఆనాటి ప్రసిద్ధ ఉర్దూ కవి హపీజ్‌ జలంధారి ఆవేదనలోంచి జాలువారిన విషాద గీతికను (‘పచాత్తర్‌ లాక్‌ కా సౌదాం’) ఒక్కసారి గుర్తుచేసుకుందాం:

‘‘దేశం మాది కానీ 75 లక్షలకు అమ్ముకున్నాం. అవును, ఇతర్లు కొల్లగొట్టిన మా సంపదకు లక్షలు చెల్లించింది. 75 లక్షలు. ఆ మా సంపద–గొడ్డు గోదా, మనుషులే కావొచ్చు.. కొడుకులు, కూతుళ్లు, వారి వంశపారంపర్యమే కావొచ్చూ/
మా స్వేచ్ఛను, ఆస్తిపాస్తుల్ని దోచుకున్నవారు ఎన్నడూ స్వేచ్ఛగా ఉండలేరు/
ఎందుకో తెలుసా– కేవలం 75 లక్షలకే మానవుల భవిత      వ్యాన్ని స్వర్గతుల్యమైన మా కశ్మీర్‌ను 75 లక్షలకే ధారాదత్తం చేశారు/
శీలవంతమైన మా మానవతులను 75 లక్షలకే కుదువబెట్టే శారు/ ఒక్కమాటలో– మా దేశాన్ని, మా జాతిని, మా కశ్మీరీల సర్వస్వాన్నీ/ 75 లక్షలకే అమ్మేశారు. ఇంగ్లిష్‌వాడి కశ్మీరీ గులాములు’’.


ఈ శాపనార్థాలు రేపు మనల్ని చుట్టబెట్టకుండా ఉండాలంటే దేశ పాలకులు ‘మంచి బాలుర’న్న కనీస కితాబు దేశ ప్రజాబాహుళ్యం నుంచి పొందగలగాలి.

ఏబీకే ప్రసాద్‌, సీనియర్‌ సంపాదకులు 
abkprasad2006@yahoo.co.in

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement