అంతర్జాతీయ విద్యకు అతిపెద్ద దెబ్బ.. కరోనా! | Students Face Problems With Corona Virus In China | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ విద్యకు అతిపెద్ద దెబ్బ.. కరోనా!

Published Sun, Feb 9 2020 3:52 AM | Last Updated on Sun, Feb 9 2020 3:52 AM

Students Face Problems With Corona Virus In China - Sakshi

అంతర్జాతీయ విద్యకు సంబంధించి మానవచరిత్రలో అతిపెద్ద అంతరాయానికి కరోనా వైరస్‌ వ్యాప్తి కారణం కావచ్చు. విద్యకోసం వివిధ దేశాలకు వెళుతున్న విద్యార్థుల అంతర్జాతీయ పర్యటనలకు కరోనా వైరస్‌ భారీస్థాయిలో అడ్డుకట్ట వేయవచ్చని అంచనా. ఈ ఏడాది ఆస్ట్రేలియాలో చదువుకోవాలని తలపెట్టిన దాదాపు లక్షమంది చైనా విద్యార్థులు.. విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే సమయానికి ఆస్ట్రేలియా చేరుకునే అవకాశాలు రోజులు గడుస్తున్న కొద్దీ సన్నగిల్లిపోతుండటం అనుభవంలోకి వస్తోంది. తమ మాతృదేశాన్ని వదలి విదేశాల్లో చదువుతున్న 50 లక్షల 30 వేలమంది చైనా విద్యార్థుల వ్యవహారాలను చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పట్టించుకుంటోందనుకోండి.

2001 సెప్టెంబర్‌ 11 దాడుల తర్వాత అమెరికా ప్రత్యేకించి మధ్యప్రాచ్య దేశాలకు చెందిన విద్యార్థుల వీసా నిబంధనలను కఠినతరం చేయడమే కాకుండా తాత్కాలికంగా తన సరిహద్దులను మూసివేసింది. దీంతో వేలాదిమంది విద్యార్థులు వివిధ విదేశీ విద్యా కేంద్రాలను ఎంచుకోవల్సి వచ్చింది. 2018లో సౌదీ అరేబియా ప్రభుత్వం.. కెనడాలో చదువుతున్న తన పౌరులను వెనక్కు తిరిగి రావలసిందిగా ఆదేశించింది. కారణం సౌదీ జైళ్లలోని మహిళా హక్కుల కార్యకర్తలను విడుదల చేయాలని కెనడా విదేశాంగ మంత్రి పిలుపునివ్వడమే. తర్వాత సౌదీ ప్రభుత్వం తన వైఖరిని కాస్త సడలించుకున్నా, కెనడాలో చదువుకుంటున్న 12 వేలమంది సౌదీ విద్యార్థుల్లో చాలామంది తమ చదువుల కోసం కెనడా వదిలిపెట్టి ఇతర దేశాల విద్యాసంస్థలకు తరలిపోయారు. కాబట్టి ఇంతకు ముందు ఎన్నో ఉపద్రవాలను మనం చూసి ఉన్నాం. కానీ చైనాలో తలెత్తుతున్న ఇలాంటి స్థాయి ఉపద్రవాన్ని చరిత్రలో ఎన్నడూ చూడలేదు.

చైనా నుంచి ఆస్ట్రేలియాకు ప్రస్తుతం తాత్కాలి కంగా వలస వెళుతున్న విద్యార్థుల భారీ సంఖ్య ప్రపంచం ఇంతవరకు చూసి ఉండలేదు. 2019 చివరినాటికి 2,12,000 మందికిపైగా చైనా విద్యార్థులు ఆస్ట్రేలియాలో చదువుకుంటున్నారని ఫెడరల్‌ విద్యాశాఖ డేటా సూచిస్తోంది. అంటే ఆస్ట్రేలి యాలో చదువుతున్న మొత్తం అంతర్జాతీయ విద్యార్థుల్లో చైనా విద్యార్థుల సంఖ్య 28 శాతంగా ఉంటున్నట్లు లెక్క. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో చైనా నుంచి విద్యార్థులు అమెరికాకు వెళ్లి చదువుతుం డగా, రెండో స్థానంలో భారతీయ విద్యార్థులు అమెరికాలో చదువుకుంటున్నారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో కంటే వేసవి సెలవుల తర్వాత అమెరికాకు వెళ్లే విద్యార్థులపై ఈ కరోనా వైరస్‌ వ్యాప్తి ఏ ప్రభావాన్ని కలిగించనుందో ఊహించడం కూడా కష్టమే. వేసవి సెలవుల కోసం చైనా విద్యార్థులు అనేకమంది ఇప్పటికే అమెరికా తదితర దేశాల నుంచి మాతృదేశానికి చేరుకున్నారు. మిగిలినవారు ఫిబ్రవరి చివరిలో  విదేశాలకు వెళ్లనున్నారు.

పోల్చి చూస్తే 2003లో చైనాలో చెలరేగిన సార్స్‌ అంటువ్యాధి.. ఆస్ట్రేలియాలో చదువుకోసం వెళ్లిన చైనా విద్యార్థులపై పెద్దగా ప్రభావం వేయలేదు. ఎందుకంటే విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత 2003 ఏప్రిల్‌–మే నెలల్లో సార్స్‌ వ్యాపించింది. కానీ తాజాగా కరోనా వైరస్‌ సంక్షోభం విదేశాల్లో చదువుకుంటున్న చైనా విద్యార్థులపై ఊహించడానికి వీల్లేనంత తీవ్రస్థాయిలో తాకింది. ఈ సంక్షోభం వారి విద్యకు అంతరాయం కలిగించడమే కాకుండా, వారికి దక్కాల్సిన వసతి, తాత్కాలిక ఉద్యోగం, భవిష్యత్తు ప్రణాళికలపై కూడా తీవ్ర ప్రభావం వేయనుంది. వివిధ ఆస్ట్రేలియా యూని వర్సిటీల్లో చదువుతున్న ఇతర విద్యార్థులు చైనా విద్యార్థుల పట్ల మానవీయ స్పందన, సహాయతత్వం, బాధ్యతాయుతంగా వ్యవహరించడం ఈ దశలో చాలా కీలకమైన విషయం. చైనా నుంచి భారీగా విద్యార్థుల సంఖ్య పడిపోయిన కారణంగా తరగతి గది పరిమాణం, ఉపాధ్యాయుల సంఖ్యపై తీవ్ర ప్రభావం పడుతోంది. తరగతి గదులు మరీ చిన్నవైతే వర్సిటీలు వాటిని రద్దు చేయాలి.

పైగా కరోనా వైరస్‌ ప్రభావాలు ఇంతటితో ఆగిపోలేదు. అంతర్జాతీయ విద్యార్థులకు సేవలం దించే పర్యాటక పరిశ్రమ, వసతి కల్పించేవారు, రెస్టారెంట్లు, రిటైలర్లు కూడా తీవ్రంగా దెబ్బతిననున్నారు. 2019లో చైనా విద్యార్థులు ఆస్ట్రేలియా ఆర్థిక వ్యవస్థకు 12 బిలియన్ల ఆస్ట్రేలియన్‌ డాలర్లను జోడించారు. అందుకే ఈ దశలో కరోనా వైరస్‌ ఎలా పరిణమించినప్పటికీ, దాని ఆర్థిక ప్రభావం గణనీయంగానే ఉండబోతోంది. ఉదాహరణకు విద్యాసంవత్సరంలో ప్రారంభమయ్యే మొదటి సెమిస్టర్‌లోనే చైనా విద్యార్థుల సంఖ్య పడిపోతే ఆస్ట్రేలియాకు అనేక బిలియన్ల కొద్ది డాలర్ల మేరకు నష్టం వాటిల్లుతుంది. కరోనా వైరస్‌ని వేగంగా నిరోధించినట్లయితే, చైనాలో ఉండిపోయిన విద్యార్థుల్లో లక్షమంది వరకు ఈ సెమిస్టర్‌లోనే అంతరాయం లేకుండా ఆస్ట్రేలియాలో తమ విద్యను కొనసాగించవచ్చు. ప్రత్యేకించి విదేశాల్లో విద్యకోసం ఎదురుచూస్తున్న చైనా విద్యార్థులు ఆస్ట్రేలియా ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఎలా స్పందిస్తుందనే అంశంపై దృష్టి సారిస్తున్నారు.

కరోనా వైరస్‌ ప్రభావం కారణంగా ఆస్ట్రేలి యాలో ప్రవేశించలేకపోతున్న వేలాదిమంది చైనా విద్యార్థులతో సంభాషించడానికి ప్రయత్నిస్తున్న యూనివర్సిటీలు, కళాశాలలు (ఇంగ్లిష్‌ భాషాబోధనా కళాశాలలు) వంటివాటికి వేగంగా వ్యాపిస్తున్న ఈ సంక్షోభం పలు సవాళ్లను విసురుతోంది. ఈ తరుణంలో కొన్ని ప్రత్యామ్నాయ విధానాలను కూడా ఇవి చేపట్టాలని చూస్తున్నాయి. వాటిలో కొన్ని. ఆన్‌లైన్‌లో కోర్సులు ప్రారంభించడం. ఇంటెన్సివ్‌ కోర్సులు, వేసవి లేదా శీతాకాలం కోర్సులను అందించడం, సెమిస్టర్‌ ప్రారంభానికి తగిన ఏర్పాట్లు చేయడం, ఇప్పటికే వసూలు చేసిన ఫీజు లను వెనక్కు ఇవ్వడం, అకడమిక్, సంక్షేమ మద్దతు, కౌన్సెలింగ్, ప్రత్యేక సహాయ లైన్లు కల్పించడం. కరోనా నేపథ్యంలో చైనా విద్యార్థులకు ప్రథమ ప్రాధాన్యతను ఇస్తున్న వివిధ సంస్థలు, వ్యక్తుల మధ్య పూర్తి సమన్వయం ఏర్పడాలి. అంతకుమించి, కరోనా వైరస్‌ మానవులపై కలిగించబోతున్న దుష్ఫలితాల పట్ల సమాజం నిత్యం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అంతర్జాతీయ విద్యార్థులు, అంతర్జాతీయ విద్యా సంస్థలతో ముడిపడిన వారి సంక్షేమాన్ని పట్టించుకోకుండా కరోనా వైరస్‌ వల్ల నష్టపోనున్న రాబడుల గురించి పతాక శీర్షికల్లో రాయడం అతిపెద్ద నేరం అవుతుంది.

క్రిస్టొఫర్‌ జిగురాస్, ప్రొఫెసర్, గ్లోబల్‌ స్టడీస్, ఆర్‌ఎమ్‌ఐటీ యూనివర్సిటీ,
లి ట్రాన్, ఏఆర్‌సీ ఫ్యూచర్‌ ఫెలో,
డీకిన్‌ యూనివర్సిటీ

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement