ఘాటెక్కిన హవానా చుట్ట! | Vardhelli Murali Article On Cuba And America | Sakshi
Sakshi News home page

ఘాటెక్కిన హవానా చుట్ట!

Published Sun, Apr 12 2020 12:56 AM | Last Updated on Sun, Apr 12 2020 7:47 AM

Vardhelli Murali Article On Cuba And America - Sakshi

ప్రపంచం ఇంకా చిన్నదైంది. ఆర్థిక విధానాల గ్లోబలైజేషన్‌తో తొలిసారి కుచించుకుపోయిన భూగోళం, దాని వెన్నంటే వచ్చిన కమ్యూనికేషన్‌ విప్లవంతో అరచేతిలోకి చేరిపోయింది. ఇప్పుడు మనం మహమ్మారిగా పిలుచుకుంటున్న కోవిడైజేషన్‌ ఆ గ్లోబ్‌ ధరించిన రకరకాల రంగురంగుల వస్త్రాలను విప్పేసింది. నగ్నంగా నిలబెట్టింది. గొప్పదేశాల గోత్రాలు తెలిసిపోతున్నాయి. చిన్న దేశాల సందేశాలు చెవిసోకుతున్నాయి. రెండొందల పై చిలుకు దేశాల పేర్లు వార్తల్ని బ్రేక్‌ చేస్తున్నాయి. అంతా అనుకున్న ట్టుగానే జరిగి వుంటే ఈ జూలైలో ఒలింపిక్స్‌ ప్రారంభమై ఉండేవి. నెలరోజులపాటు ప్రపంచం దృష్టి అటు మళ్లి వుండేది. మెడల్స్‌ గెలిచిన దేశాల పట్టిక మీడియా హైలైట్‌గా వుండేది. కాని ఆ పట్టికలో చాలా దేశాలకు చోటు దొరికి ఉండేది కాదు. ఈ కరోనా పట్టిక అలా కాదు. రెండొందల పైచిలుకు దేశాలకు చోటు కల్పించింది. వీటిలో కొన్ని దేశాల మీదే ప్రజల దృష్టి ఎక్కువగా లగ్నమైంది. వైరస్‌ ప్రారంభమైన చైనా, అల్లాడుతున్న ఇటలీ, స్పెయిన్‌లతో పాటు ఇంకో రెండు పేర్లు, రెండు వేర్వేరు కారణాల రీత్యా టాక్‌ ఆఫ్‌ ది గ్లోబ్‌గా నర్తిస్తున్నాయి.

అవి అమెరికా, క్యూబా. పక్కపక్కనే ఉంటాయి. ఇరుగూ పొరుగే కానీ, ఈడూ జోడూ అస్సలు కుదరదు. రెంటి మధ్యన హస్తిమశకాంతరం. అమెరికా ఏనుగైతే క్యూబా దోమ. సైజులోనే కాదు సంపదలో కూడా. మన దేశంలో నిరక్షరాస్యులక్కూడా  పరిచయం అవసరం లేని పేరు అమెరికా. అది కూడా మనదే, బలిసినవాళ్లుండే బంజారా హిల్స్‌ లాగా... కాకపోతే ఇంకాస్త పెద్దది అనుకునేవాళ్లు కోకొల్లలు. ‘మావాడు అమెరికాలో తాసిల్దారయితే చూడాలని ఉందండీ’ అంటాడు కోట శ్రీనివాసరావు అదేదో సినిమాలో. మధ్యతరగతి వాళ్లకయితే అమెరికా అంటే ఒక జీవితాశయం. పిల్లల్ని బాగా చదివిస్తే అమెరికాకు వెళ్తారు. డాలర్లు సంపాది స్తారు. అవి ఇండియాకు వచ్చి రూపాయలుగా మారుతాయి. వాటితో పొలం పుట్రా కొనేసి పెట్టొచ్చు పిల్లల కోసం... ఆ డాలర్‌ డ్రీమ్స్‌తోనే కొవ్వొత్తులుగా మారుతారు తల్లిదండ్రులు. చాలా మంది సాధిస్తారు. చివరకు తమకు మాత్రమే కనిపించే లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ మెమెంటోను చూసుకుంటూ శేష జీవితం గడుపు తున్న తల్లిదండ్రులు లేని ఊరులేదు మన దేశంలో.

ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో. ఇక క్యూబా సంగతి. మన దేశంలో ఆ పేరు చాలా కొద్దిమందికే తెలుసు. ఫిడెల్‌ కాస్ట్రో కాల్చిపారేసిన కొహిబా బ్రాండ్‌ హవానా చుట్టలకూ, చేగువేరా బొమ్మలు వుండే టీ–షర్టు లకు ప్రపంచమంతటా ఉన్నట్టే మన దగ్గర కూడా అంతో ఇంతో క్రేజ్‌ ఉంది. మన నవతరంలో ఎక్కువమందికి క్యూబా గురించి అంతకుమించిన ఆసక్తి వుండే అవకాశం లేదు. అమెరికాకు ఆగ్నే యంగా వున్న ఫ్లొరిడా తీరానికి 90 మైళ్ల దూరంలో వుంది క్యూబా. ఈ తొంబై మైళ్ల దూరానికి ఒక అరవై ఏళ్ల స్టోరీ కూడా వుంది. అమెరికా–రష్యాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం తీవ్రంగా వున్న రోజుల్లో కాస్ట్రో కమ్యూనిస్టు కనుక క్యూబా రష్యా అనుకూల వైఖరితో ఉండేది. ఇది అమెరికాకు కంట్లో నలుసులాంటి సమస్య. చివరకు కెనెడీ క్యూబాను బెదిరిస్తాడు. ‘అమెరికాకు కేవలం 90 మైళ్ల దూరంలోనే క్యూబా వుంది జాగ్రత్త’. కాస్ట్రో కూడా అందుకు దీటుగా సమాధానం చెబుతాడు. ‘అవును, అమెరికాకు క్యూబా 90 మైళ్ల దూరంలోనే ఉంది. అంతేకాదు, క్యూబాకు కూడా అమె రికా 90 మైళ్ల దూరంలోనే ఉంది గుర్తు పెట్టుకోండి’. ‘దీవార్‌’ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌తో ‘మేరే పాస్‌ మా హై’ అని శశికపూర్‌ చెప్పినంత నిబ్బరంగా కాస్ట్రో కూడా అమెరికాకు చెబుతాడు.

మహామేరువు లాంటి అమెరికాకు పిపీలికమంత క్యూబా సవాలు విసరడమా? ఆ ధైర్యం వెనుక రహస్యమేమిటి? ఇంకేముంటుంది రష్యా తప్ప అన్నారంతా. కానేకాదు, ఆ ధైర్యం క్యూబా సామాజిక వ్యవస్థ సమకూర్చిన ఆత్మబలం అని తదనం తర పరిణామాలు నిరూపించాయి. కాస్ట్రో తర్వాత క్యూబా విప్లవంలో ప్రముఖపాత్ర పోషించిన చేగువేరా నిజానికి క్యూబా దేశస్తుడు కాదు. అమెరికాలాంటి సామ్రాజ్యవాద దేశానికి ముగు తాడు వేయాలంటే ఒక్క క్యూబాలోనే కాదు అమెరికా ఖండం లోని అన్ని దేశాల్లోనూ విప్లవ ప్రభుత్వాలు ఏర్పడాలని కాంక్షిస్తూ, ఒక విశ్వమానవుడిగా ఆ పోరాటాల్లో పాల్గొంటూ చివరకు బొలీవియా అడవుల్లో హత్యకు గురవుతాడు. భారత్‌కు భగత్‌ సింగ్‌లాగా చేగువేరా ప్రపంచాబ్జపు తెల్లరేకై పల్లవించాడు. ఒక నాడు అమెరికా ఆంక్షల కారణంగా ఔషధాలు లభించక, కనీస వైద్యసేవలు అందుబాటులో లేక అవస్థలు పడిన క్యూబా అనతి కాలంలోనే అత్యుత్తమమైన ప్రజారోగ్య విధానాన్ని అమలు చేయ గలిగింది.

ఈ రోజున క్యూబాలో ప్రతి వెయ్యిమంది జనాభాకు ఒక డాక్టర్‌ అందుబాటులో ఉన్నాడు. ప్రాథమిక రోగ నివారణ పద్ధతులు, ప్రజారోగ్యంపై సామాజిక, కుటుంబ, ఆర్థిక, మానసిక కారణాల ప్రభావం ఎలా ఉంటుందనే అంశాలు కూడా అక్కడి వైద్యవిద్యలో పాఠ్యాంశాలుగా ఉంటాయి. వైద్యరంగం మొత్తం ప్రభుత్వ అధీనంలోనే ఉంటుంది. కొన్ని కుటుంబాలకు కలిపి ఒక డాక్టర్‌ను, నర్సును కేటాయిస్తారు. ఆ కుటుంబాల్లోని సభ్యులం దరి ఆరోగ్య జాతకాలు సంబంధిత ఫ్యామిలీ డాక్టర్, నర్సుల దగ్గర ఉంటాయి. వారి పరిధిలో కుటుంబాలను తరచుగా వారిం టికే వెళ్లి డాక్టర్, నర్సు పలకరిస్తుంటారు. అందువల్ల సహజంగానే ఆరోగ్యపరమైన అవగాహన, చైతన్యం సమాజంలో ఎక్కువ. పెద్దగా వనరుల్లేని చిన్న దేశం, పేదదేశమైన క్యూబాలో సగటు ఆయుర్దాయం 79.74 Sఏళ్లుగా ఉంది. ఇది అమెరికా కంటే ఒక సంవత్సరం, భారత్‌కంటే పదేళ్లు ఎక్కువ. వైద్య రంగాన్ని ప్రైవే ట్‌కు వదిలేసిన సూపర్‌ పవర్‌ అమెరికా వైరస్‌ దాడికి చిగురు టాకులా వణికిపోతుంటే పక్కనే ఉన్న క్యూబా తన దేశంలో నిలు వరించగలిగింది. పైగా తన వైద్యులను ఇటలీ, స్పెయిన్, ఇరాన్‌ తదితర అనేక దేశాలకు పంపించి సమస్త మానవాళి తరఫున క్యూబా పోరాటం చేస్తున్నది. అమెరికా మాత్రం చేతులెత్తేసింది. మందుల కోసం భారత్‌ను దేబిరిస్తున్నది. మిస్టర్‌ జాన్‌ఎఫ్‌ కెనెడీ... మిమ్మల్ని క్యూబా ఓడించింది. రష్యా అండతో కాదు. ఆత్మబలం అండతో, ఆశయబలం అండతో.

అమెరికా, క్యూబా రెండూ విభిన్నమైన సామాజిక– రాజ కీయ–ఆర్థిక వ్యవస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. రెండు విరుద్ధ భావాలకు ఇవి ప్రతీకలు. అమెరికా, యూరప్, ఇతర పెట్టుబడిదారీ దేశాల మౌలిక సిద్ధాంతం పెట్టుబడి చుట్టూ తిరుగుతుంది. దానిపై వచ్చే లాభాల చుట్టూ తిరుగుతుంది. అందువల్ల విద్య, వైద్యం సహా సమస్త రంగాలను ప్రైవేట్‌పరం చేశాయి. కమ్యూనిస్టులు, సోషలిస్టులు, సోషల్‌ డెమోక్రాట్లు తర తమ భేదాలతో ఈ విధానాన్ని వ్యతిరేకిస్తారు. పెట్టుబడి కేంద్రక అభివృద్ధికి బదులు మానవకేంద్రక అభివృద్ధిని ప్రతిపాదిస్తారు. అందువల్ల ఈ వ్యవస్థలో మౌలిక రంగాలన్నీ ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మిగిలిన ఇరవయ్యో శతాబ్దపు చరిత్ర అంతా ఈ రెండు వ్యవస్థల మధ్య జరిగిన ప్రచ్ఛన్న యుద్ధ చరిత్రే. ఈ యుద్ధం ఫలితంగా పెట్టుబడిదారీ వ్యవస్థ ఉదారవాదం ముసుగు వేసుకొని శ్రామికులను, సాధారణ ప్రజలను ఆకర్షించగలిగింది. కమ్యూనిస్టు ఆర్థికాభివృద్దికి ఉన్న పరిమితుల కారణంగా ఈ యుద్ధంలో సోవియట్‌ రష్యా శిబిరం ఓడిపోయింది.

ఇప్పటికీ కమ్యూనిస్టు రాజ్యాలుగా చెప్పుకుం టున్న చైనా, క్యూబా, వియత్నాం దేశాలు వైరస్‌ వ్యాప్తిని విజయ వంతంగా కట్టడి చేశాయి. రష్యాతోపాటు కమ్యూనిస్టు పాలనను వదిలించుకొని పెట్టుబడిదారీ వ్యవస్థలోకి జారిపోయిన సుమారు 25 తూర్పు యూరప్, సెంట్రల్‌ ఆసియా దేశాలు కూడా ఈ విషయంలో మెరుగ్గానే వున్నాయి. యూరప్‌లో సగభాగమైన తూర్పు యూరప్‌లోని మొత్తం కరోనా మరణాల సంఖ్య ఒక్క బ్రిటన్‌ మృతుల సంఖ్య కంటే కూడా తక్కువ. ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్‌ల తర్వాత మరణాల సంఖ్యలో యూరప్‌లో నాలుగో స్థానం బ్రిటన్‌ది. తూర్పు యూరప్‌ దేశాల విద్య, ఆరోగ్య వ్యవస్థల్లో ఉన్న సోషలిస్టు పునాదుల కారణంగానే ఈ తేడా ఉన్నదనే వాదాన్ని గట్టిగా ఖండించలేము. కరోనా ఎపిసోడ్‌ నుంచి భారత ప్రజాస్వామ్య వ్యవస్థ నేర్చుకోవాల్సిన పాఠం ఉన్నది. వేలంవెర్రిగా ప్రైవేటీకరణవైపు పరుగులు తీయకుండా కనీసం ప్రాథమిక వైద్యం, ప్రాథమిక విద్యలనైనా పూర్తిగా ప్రభుత్వ అజమాయిషీలోకి తెచ్చుకోవాలి. ఇప్పుడు దేశంలో జరుగుతున్న కరోనా వ్యతిరేక పోరాటంలో ప్రైవేట్, కార్పొరేట్‌ ఆస్పత్రుల పాత్ర దాదాపు పూజ్యం. ప్రభుత్వ వైద్యులు ప్రాణా లకు తెగించి పని చేస్తుంటే కార్పొరేట్‌ వైద్యులు మీడియా ఇంటర్వూ్యల్లో ఉచిత సలహాలు పారేసే పనిలో బిజీగా గడుపు తున్నారు.

హైదరాబాద్‌లో నిరంతరం పేషెంట్లతో కిటకిటలాడే రెండు మూడు కార్పొరేట్‌ ఆస్పత్రులను లాక్‌ డౌన్‌ పీరియడ్‌లో పరిశీలించడం జరిగింది. పేషెంట్ల సంఖ్య 30 శాతానికి పడిపో యింది. ఆశ్చర్యకరమైన విషయం ఎమర్జెన్సీ కేసులు కూడా ఇరవై శాతానికి పడిపోవడం. కరోనాను చూసి గుండెపోట్లు, కిడ్నీ ఫెయి ల్యూర్స్‌లాంటివి కూడా జడుసుకున్నాయా? ఎమ్‌ఆర్‌ఐ స్కానర్లు, సీటీ స్కానర్లు కూడా మూలనపడ్డాయి. వాటి అవసరమే కలగడం లేదు. వైద్యసేవలు అందక రోగాలతో చనిపోయే (నాన్‌–కరోనా) వారి సంఖ్య కూడా పెరగలేదు. పైపెచ్చు తగ్గింది. కార్పొరేట్‌ ఆస్పత్రులు పేషెంట్లను భయపెట్టి కృత్రిమ ఎమర్జెన్సీ కేసులను సృష్టిస్తున్నాయని బోధపడటం లేదా? కరోనా అనంతరం జరగబోయే పరిణామాలపై ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. కరోనా ముగింపు ఏ రకంగా ఉండబోతున్నదో ఎవరికీ ఊహకందడం లేదు. జరగ బోయే విధ్వంసం ఎంతో ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. భారతదేశంలో తొలి కరోనా మరణం సంభవించిన నెలరోజుల తర్వాత నేటికి ఆ సంఖ్య 250కి చేరింది.

నెల రోజుల వ్యవధిలో టీబీ వ్యాధితో చనిపోతున్న వారి సంఖ్య ఇంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువ. డెంగీతో, విషజ్వరాలతో ఇంతకంటే ఎన్నోరెట్లు ఎక్కు వమంది చనిపోయారు. కాకపోతే వాళ్లంతా పేదవర్గాల ప్రజలు. మనదేశంలో కరోనా లాక్‌డౌన్‌ ఫలితంగా ముందు ముందు సంభవించబోయే జీవన విధ్వంసం మరింత భయంకరంగా ఉండబోతున్నది. లక్షలాది చిన్న, మధ్యతరహా పరిశ్రమలు మూత పడబోతున్నాయి. కోట్లాదిమంది ఉపాధి కోల్పోబోతున్నారు. అమెరికాలోనే లక్షలాదిమంది ఉద్యోగాలు కోల్పోతారన్న అంచ నాలు వస్తున్నవి. ఈ ఫలితాలు రాజకీయ వ్యవస్థల మీద ఎటు వంటి ప్రభావం చూపబోతున్నాయో స్పష్టతరాలేదు. అమెరి కాలో ఈ ఏడాది చివర్లో అధ్యక్ష ఎన్నికలు జరగాలి. డెమోక్రటిక్‌ అభ్యర్థిగా పోటీపడిన బెర్నీ శాండర్స్‌ మధ్యలో తప్పుకోవడం ఆ దేశంలోని ఉద్యోగులకు, శ్రామికులకు, పేదలకు అశనిపాతం లాంటిది. మళ్లీ ట్రంప్‌ గెలిస్తే ఉద్యోగాల ఊచకోత తప్పక పోవచ్చు. కానీ, అంతర్జాతీయంగా అమెరికా ప్రతిష్ట ఒక మెట్టు కిందకు దిగుతుంది. చైనా ఒక మెట్టు పైకి ఎక్కవచ్చు. అంత మాత్రాన అది తక్షణం అగ్రరాజ్యం కాజాలదు. ఎక్కాల్సిన మెట్లు ఇంకా ఉన్నాయి. మూడవ ఆర్థిక శక్తిగా ఎదగాలన్న భారత ఆకాం క్షలను లాక్‌డౌన్‌ పుణ్యమా అని మరో ఐదేళ్లో పదేళ్లో వాయిదా వేసుకోవలసి రావచ్చు. ఆ స్థానం జర్మనీ కైవసం కావచ్చు. భారత రాజకీయాల్లో ప్రస్తుతానికి నరేంద్ర మోదీకి పోటీ లేదు. ఆర్థిక వ్యవస్థను ఆయన గాడిలో పెట్టే తీరుపై వచ్చే ఎన్నికలు నాటి పరిస్థితి ఆధారపడి ఉంటుంది.

చివరగా లాక్‌డౌన్‌లో గడుపుతున్నవారి కోసం ఒక చిన్న పొడుపు కథ: ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు. అయినా స్కూల్‌ పిల్లలు మోడల్‌ అసెంబ్లీని ప్రదర్శించిన పద్ధతిలో వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తున్నారు. పార్టీ కార్యకర్తలనే కలెక్టర్లుగా భావించి ముఖ్యమంత్రి వేషంలో ఆదేశాలు జారీ చేస్తున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రపంచంలోని అన్ని దేశాలు రాజకీయ విభేదాలు పక్కనపెట్టాయి. ట్రంప్‌ వైఫల్యం కనిపి స్తున్నా ఆయన ప్రత్యర్థి కాబోతున్న జో బిడెన్‌ కూడా ఏమీ అనడంలేదు. కానీ ఆయన మాత్రం ప్రతిరోజూ విమర్శలనే పనిగా పెట్టుకున్నారు. ఎవరాయన? క్లూ: అడిగినవారికీ అడగని వారికీ తన ఆటోబయోగ్రఫీ వినిపించే అలవాటు ఆయనకు బాగా ఎక్కువ. మహాత్మాగాంధీ, లియోటాల్‌స్టాయ్, అబ్రహాం లింకన్, కులీకుతుబ్‌షా తదితరుల బయోగ్రఫీల్లోని కొన్ని భాగాలను పొరపాటున తన బయోగ్రఫీలో కలిపి చెప్పుకోవడం కూడా కద్దు. వీరివీరి గుమ్మడి పండు వీరి పేరేమి?

- వర్ధెల్లి మురళి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement