ఐసిస్‌లో చేరేందుకు వెళ్లిన యువకుల పట్టివేత
టర్కీలో అదుపులోకి తీసుకున్న అక్కడి అధికారులు.. ఆలస్యంగా వెలుగులోకి
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్)లో చేరేందుకు సిరియా వెళ్తున్న ప్రయత్నాల్లో ఉన్న ఇద్దరు రాష్ట్ర యువకులు టర్కీలో చిక్కారు. వీరిని పట్టుకున్న అక్కడి అధికారులు బలవంతంగా తిప్పి పంపడం ద్వారా (డిపోర్టేషన్) హైదరాబాద్‌కు పంపించారు. ఈ ఏడాది అక్టోబర్‌లో జరిగిన ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఐసిస్‌లో చేరేందుకు వెళ్లిన వీరిద్దరూ ఇంజనీర్లే కావడం గమనార్హం. హైదరాబాద్‌లోని ఫస్ట్‌లాన్సర్‌కు చెందిన ఓ యువకుడు, వరంగల్‌కు చెందిన మరొకరు ఆన్‌లైన్ ద్వారా ఉగ్రవాద సంస్థ ఐసిస్‌లో చేరేలా స్ఫూర్తి పొందారు.
ఆ ప్రయత్నాల్లో భాగంగా హైదరాబాదీ అమెరికా వెళ్లి, అక్కడ నుంచి సౌదీ అరేబియా మీదుగా టర్కీ చేరుకున్నాడు. వరంగల్ వాసి హైదరాబాద్ నుంచి సౌదీ అరేబియా వెళ్లి అక్కడ నుంచి టర్కీ చేరుకున్నాడు. టర్కీ నుంచి సిరియాలోకి ప్రవేశించే ప్రయత్నాలు చేసిన ఇద్దరినీ అక్కడి అధికారులు పట్టుకున్నారు. ఆపై ఇరువురినీ బలవంతంగా హైదరాబాద్‌కు తిప్పిపంపారు. వీరిని అదుపులోకి తీసుకున్న నిఘా వర్గాలు వివిధ కోణాల్లో ప్రశ్నిస్తున్నాయి.