
17 అంశాలను అమలు చేయాలి
హైదరాబాద్: పునర్విభజన చట్టంలో పేర్కొన్న అన్ని హామీలను అమలు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీర్మానం ప్రవేశపెట్టారు. బుధవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. విభజన సందర్భంగా పార్లమెంట్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మొత్తం 17 అంశాలను అమలు చేయాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం పెట్టారు.
పునర్విభజన చట్టంలోని హామీలన్నింటినీ త్వరితగతిన పూర్తి చేయాలని చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. హేతుబద్ధత లేకుండా, సంప్రదింపులు లేకుండా అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించారని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కాగా ప్రత్యేక హోదా అంశం బిల్లులో చేర్చలేదని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా అవసరమని అన్నారు.
పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని విభజన చట్టంలో ఉందన్నారు. కాగా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు 645 కోట్లు ఇవ్వగా, రాష్ట్ర ప్రభుత్వం 1449 కోట్లు ఖర్చు చేసిందని చంద్రబాబు చెప్పారు. కేంద్రం నిధులిస్తే 2018 కల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారు. అసెంబ్లీ సీట్లను 175 నుంచి 225కు పెంచాలని కోరామన్నారు. సగటున ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గానికి 2 చొప్పున సీట్లు పెరుగుతాయని చెప్పారు.