ఈ నెల 19న జరగనున్న సమగ్ర కుటుంబ సర్వేలో ఏయే వివరాలందించాలో ప్రజలు తెలుసుకునేందుకు వీలుగా సర్వే ఫారాన్ని జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.
సాక్షి, సిటీబ్యూరో: ఈ నెల 19న జరగనున్న సమగ్ర కుటుంబ సర్వేలో ఏయే వివరాలందించాలో ప్రజలు తెలుసుకునేందుకు వీలుగా సర్వే ఫారాన్ని జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్ (http://www. ghmc.gov.in/) ద్వారా ప్రజలు ఈ ఫారంలోని వివరాలు తెలుసుకోవచ్చు. ఇంగ్లీషు, తెలుగు భాషల్లో దీన్ని అందుబాటులో ఉం చారు. సర్వే ఫారాలతో పాటు సర్వే సం దర్భంగా ప్రజలు తమ వద్ద అందుబాటులో ఉంచుకోవాల్సిన వివరాలు, సంబంధిత పత్రాల సమాచారమూ పొందుపరిచారు. సందేహాలున్న వారు జీహెచ్‌ఎంఎసీ కాల్‌సెంటర్ నంబర్ 040-21 11 11 11కు ఫోన్ చేయవచ్చు.
సర్వేకు విద్యార్థుల సాయం... సమగ్ర సర్వే కోసం ఆయా కళాశాలల విద్యార్థుల సేవల్ని జీహెచ్‌ఎంసీ వినియోగించుకోనుంది. దాదాపు 15 వేల మంది ఎన్యూమరేటర్లుగా విధుల్లో ఉండగా, మరో 25 వేల నుంచి 30 వేల మంది విద్యార్థులను వారికి సహాయకులుగా వినియోగించుకునేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఒకే కళాశాలకు చెందిన విద్యార్థుల్ని సర్వే నిర్వహించాల్సిన వార్డుల్లో దింపేందుకు కళాశాల బస్సుల్ని కూడా ఇచ్చేందుకు పలు విద్యాసంస్థలు అంగీకరించాయని సంబంధిత అధికారి చెప్పారు. 17, 18 తేదీల్లో ప్రీసర్వేలో, 19న సర్వేలో ఈ విద్యార్థులు సేవలందించనున్నారు. ఇందుకు గాను ఒక్కో విద్యార్థికి రూ.500 గౌరవ పారితోషికంగా చెల్లించాలని భావిస్తున్నారు. కాగా, సర్వే నిర్వహణపై హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో స్వచ్ఛందంగా వివరాలందించేందుకు ఎంతమంది ముందుకు వస్తారనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది.