రైల్వే ప్రాజెక్టుల్లో ఇక రాష్ట్రాలే సుప్రీం!
- కొత్త పనుల ఖర్చు సగం భరించాల్సి రావడమే కారణం
- రాష్ట్రం ముందుకొచ్చే ప్రాజెక్టులకే కేంద్రం పచ్చజెండా
- బడ్జెట్ ముందు ప్రతిపాదనలిచ్చే విధానానికి స్వస్తి
సాక్షి, హైదరాబాద్: ‘‘ఫలానా రైల్వే లైన్ మాకు చాలా అవసరం. దయచేసి ఈ బడ్జెట్‌లో దాన్ని పొందుపరచండి. ఈ ఏడాదే పనులు మొదలయ్యేలా నిధులివ్వండి..’’ అంటూ ఏటా రైల్వే శాఖను రాష్ట్ర ప్రభుత్వం అడుగుతూ వచ్చేది. ఇకపై ఈ తీరు మారనుంది. ఏ ప్రాజెక్టు చేపట్టాలి, దేన్ని వదిలేయా లన్నది ఇక పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఇష్టమే. ఏ రైల్వే ప్రాజెక్టు చేపట్టినా అందులో సగం ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం కూడా భరించాల్సి ఉండటమే ఇందుకు కారణం. ప్రాజెక్టు వ్యయంలో 50 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తే.. మిగతా మొత్తాన్ని ప్రకటించేందుకు రైల్వే కూడా సిద్ధపడనుంది.
అంటే... ప్రాజెక్టుల ఎంపిక ఇక దాదాపు రాష్ట్ర ప్రభుత్వ ఇష్టం ప్రకారమే జరగ నుంది. రైల్వే ప్రాజెక్టుల భారాన్ని కేవలం కేంద్ర ప్రభుత్వమే మోయటం సాధ్యం కాదని గతంలోనే ప్రధాని మోదీ తేల్చారు. రాష్ట్ర ప్రభుత్వాలతో ప్రత్యేకంగా ఒప్పందాలు చేసుకోనున్నట్టు ప్రకటించారు. ఇందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం కూడా రైల్వేతో ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం ఇక రైల్వే ప్రాజెక్టుల వ్యయంలో 50 శాతం రాష్ట్ర సర్కారు భరించాల్సి ఉంటుంది. సగానికి సగం భారం తగ్గటంతో ఇక పనుల్లో కూడా రైల్వే వేగాన్ని పెంచే అవకాశం ఉంది. ప్రస్తుతం ఒక్క తెలంగాణకు సంబంధించే దాదాపు రూ.25 వేల కోట్ల విలువైన పెండింగు ప్రాజెక్టులు ఎదురుచూస్తున్నాయి.
బడ్జెట్‌తో సంబంధం లేకుండా నిధులు
గతంలో కేవలం బడ్జెట్‌లో ప్రకటించిన పనులనే నిర్వహించేవారు. ఇప్పుడు దాన్ని సమూలంగా మార్చేశారు. బడ్జెట్‌లో నామమాత్రంగానే రైల్వే ప్రాజెక్టులను ప్రకటించి, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాల సంప్రదింపుల ఆధారంగా సంవత్సరం మధ్యలో ఎప్పుడైనా కొత్త ప్రాజెక్టులను చేపట్టే అవకాశం ఉంది. ఫలితంగా బడ్జెట్ ముందు ప్రతిపాదనలను రైల్వేకు సమర్పించే విధానం కూడా లేకుండా పోయింది. ఇక నుంచి ఏ ప్రతిపాదన ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వమే ఆచితూచి వ్యవరించాల్సి ఉంది. ప్రాజెక్టు వ్యయంలో సగం భరించాల్సి ఉన్నందున తోచినన్ని ప్రతిపాదనలు ఇచ్చే అవకాశం ఉండదు. ఖర్చుకు సిద్ధమయ్యే ప్రతిపాదనలు పంపాల్సి ఉంటుంది.
డబ్లింగ్ పనులకు ప్రాధాన్యం..
ప్రస్తుతం సరుకు రవాణాను పెంచేందుకు తీవ్ర కసరత్తు చేస్తున్న రైల్వేశాఖ డబ్లింగ్ పనులపై దృష్టి సారించింది. ఈ మేరకు ప్రణాళికలు రూపొందిస్తూనే సాధారణ మార్గాల్లో రెండు, మూడో లైన్ నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తోంది. గతంలోనే ప్రారంభమై ముందుకు సాగని పనులను పరుగుపెట్టించేందుకు నిధులు కేటాయించే అవకాశం ఉంది. ఇందులో భాగంగా సికింద్రాబాద్–విజయవాడ–బల్లార్షాకు నిధులు కేటాయించే అవకాశం ఉంది. అలాగే సికింద్రాబాద్–నాగ్‌పూర్ ప్రత్యేక కారిడార్‌పై దష్టి సారించే అవకాశం ఉంది.