
తెలంగాణ తమ్ముళ్లకు చంద్రబాబు క్లాస్ !
స్థాయిని మరిచి ఒకరిపై ఒకరు తిట్లదండకం అందుకుంటున్న తెలంగాణ తెలుగుదేశం నాయకులను పార్టీ అధినేత చంద్రబాబు తీవ్రంగా మందలించారని తెలిసింది.
సమన్వయంతో కలసి పనిచేయండి
పరస్పరం గౌరవించుకోకుంటే కేడర్ ఎలా గౌరవిస్తుంది
విజయవాడ భేటీలో టీటీడీపీ నేతలతో బాబు
సాక్షి, హైదరాబాద్: స్థాయిని మరిచి ఒకరిపై ఒకరు తిట్లదండకం అందుకుంటున్న తెలంగాణ తెలుగుదేశం నాయకులను పార్టీ అధినేత చంద్రబాబు తీవ్రంగా మందలించారని తెలిసింది. మంగళవారం విజయవాడలో చంద్రబాబుతో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, టీటీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి భేటీ అయ్యారు. విశ్వసనీయవర్గాలు చెబుతున్న వివరాల మేరకు... ‘రాష్ట్రస్థాయి నాయకుల మధ్య ‘ కమ్యూనికేషన్ గ్యాప్ ’ ఉంటే ఎలా..? అంతా కలసి ఉం డండి. తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్నామన్న సం గతి మరిచిపోవద్దు. నాయకులు పరస్పరం గౌరవించుకోవాలి. మిమ్ముల్ని మీరు గౌరవించుకోకుంటే పార్టీ కేడర్ ఎలా మిమ్ముల్ని గౌరవిస్తుంది..’ అని రమణ, ఎర్రబెల్లి, రేవంత్‌కు చంద్రబాబు క్లాస్ తీసుకున్నట్టు తెలిసింది.
తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడానికి జరగాల్సిన కృషిపైనా వీరికి హితబోధ చేశారు. వరంగల్ ఉప ఎన్నికల్లో టీడీపీకి టికెట్ ఇవ్వమని మిత్రపక్షమైన బీజేపీని అడుగుతానని, అయితే ఏ పార్టీ పోటీచేసినా విజయం కోసం శ్రమించాలని టీటీడీపీ నాయకులకు బాబు సూచించారు. మరోవైపు రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి టీఆర్‌ఎస్‌లోకి వెళుతున్న అం శాన్నీ చంద్రబాబు ఆరా తీశారు. వచ్చే నెల 7న తెలంగాణ రాష్ట్ర కమిటీ జనరల్ బాడీ సమావేశం హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్టు తెలిసింది.
బాబుతో రేవంత్ భేటీ
టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి మంగళవారం ఉదయం ఏపీ సీఎం, పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబుతో భేటీ అయ్యారు. గుంటూరు జిల్లా ఉండవల్లి సమీపంలోని సీఎం విశ్రాంతి గృహంలో చంద్రబాబును కలిసిన ఆయన 15 నిమిషాలపాటు సమావేశమయ్యారు. శనివారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో పార్టీ నాయకుల మధ్య గొడవ నేపథ్యంలో రేవంత్ పార్టీ అధినేతతో ఒంటరిగా భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదిలాఉండగా, సోమవారమే విజయవాడ వెళ్లిన ఆయన చంద్రబాబును కలిసేందుకు అపాయింట్‌మెంట్ కోరితే నిరాకరించినట్టు సమాచారం.