బీఈడీకి స్పందన అంతంతే..!
► బోధనావృత్తిపై తగ్గుతున్న ఆసక్తి
► ఎడ్‌సెట్‌కు తగ్గిన దరఖాస్తుల సంఖ్య
► గతేడాది 64 వేలు.. ఈ ఏడాది 45 వేలే..
సాక్షి, సిటీబ్యూరో: ఉపాధ్యాయ వృత్తి చేపట్టేందుకు ఉద్దేశించిన ఎడ్‌సెట్ కు స్పందన అంతంత మాత్రంగానే ఉంది. గతంలో లక్షల్లో వచ్చే దరఖాస్తుల సంఖ్య.. ఇప్పుడు 50 వేలు దాటడమే గగనమైపోయింది. ఏడాదికేడాది గణనీయంగా ఆసక్తి క్షీణిస్తుండడంతో విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భావితరాలను మహోన్నతులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయ వృత్తి.. ఒడిదుడుకులు ఎదుర్కొంటోందని ఆవేదన చెందుతున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు శనివారంతో గడువు ముగిసింది. ఈ ఏడాది మొత్తం 45,313 ద రఖాస్తులు మాత్రమే అందాయి. గతేడాది 64 వేలకు పైగా అభ్యర్థులు పోటీపడగా.. చివరకు 13 వేల మంది మాత్రమే బీఈడీలో చేరారు. రాష్ట్రవ్యాప్తంగా 220 కళాశాలల్లో 20,200 సీట్లు అందుబాటులో ఉండగా.. అందులో 7 వేలకు పైగా సీట్లు మిగిలిపోవడాన్ని, గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 19 వేలకు పైగా దరఖాస్తుల సంఖ్య తగ్గడం బోధనా వృత్తిపై తగ్గుతున్న ఆసక్తికి ఉదాహ రణ.
క్రేజీ తగ్గడానికి కారణాలు
బీఈడీ చేసేందుకు గతేడాది నుంచి ఇంజినీరింగ్ విద్యార్థులకు అవకాశం ఇవ్వగా.. ఈ ఏడాది నుంచి బీబీఎం, బీసీఏ, బీఎస్సీ (హోం సైన్స్) పట్టభద్రులకూ అవకాశం కల్పిస్తూ ఎన్‌సీటీఈ (నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్) నిర్ణయం తీసుకుంది. అలాగే బీఈడీలో చేరడానికి ఉన్న గరిష్ట వయోపరిమితిని ఎత్తివేశారు. ఫలితంగా ఈ కోర్సుకు మరింత క్రేజ్ పెరగనుందన్న విద్యావేత్తల అభిప్రాయానికి భిన్నంగా దరఖాస్తుల సంఖ్య గణనీయంగా తగ్గింది. 2015-16 విద్యా సంవత్సరం నుంచి బీఈడీని రెండేళ్ల కోర్సుగా ఎన్‌సీటీఈ అమలు చేస్తోంది. బోధనలో నాణ్యత పెంచాలన్న సదుద్దేశంతో తీసుకున్న ఈ నిర్ణయం వల్ల కోర్సు పట్ల విద్యార్థులు పెద్దగా ఆసక్తి కనబర్చలేదు. రెగ్యులర్ ఉపాధ్యాయ పోస్టుల ఖాళీల భర్తీ చేయకపోవడం, బీఈడీ చేసిన వారికి ఎస్‌జీటీకి అనర్హులుగా తేల్చడం, కోర్సులో చేరితే కచ్చితంగా తరగతులకు హాజరుకావాల్సి ఉండడం తదితర ఘటనలు.. ఈ వృత్తిపై ఆసక్తి క్షీణించడానికి కారణాలని విద్యావేత్తలు విశ్లేషిస్తున్నారు.
ఈ సారి బయోమెట్రిక్..
ఎడ్‌సెట్ పరీక్షలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా చర్యలు చేపట్టామని కన్వీనర్ పి. ప్రసాద్ తెలిపారు. గతంలో ఒకరిబదులు మరొకరు పరీక్షకు హాజరైన ఘటనల నేపథ్యంలో ఈ ఏడాది నుంచి బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు వివరించారు. ఈనెల 27న జరిగే ఎడ్‌సెట్‌కు హాజరయ్యే విద్యార్థుల ఫింగర్ ప్రింట్స్‌ని సేకరిస్తామన్నారు. పరీక్షకు గంట ముందు నుంచే ఈ ప్రక్రియ జరుగుతుందని చెప్పారు. రాష్ర్టవ్యాప్తంగా 11 నగరాలు, పట్టణాల్లో మొత్తం 110 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.