బయట తినాలంటే..భయం
Published Mon, Oct 7 2013 2:05 AM | Last Updated on Fri, Sep 1 2017 11:24 PM
సాక్షి, సిటీబ్యూరో :‘గ్రేటర్’లో కల్తీ నిత్యకృత్యమై పోయింది. పసిపిల్లల పాల నుంచి మొదలు పెడితే.. ప్రాణాధారమైన నీటి నుంచి తినే తిండి దాకా అన్నింటా కల్తీయే. ఈ విషాహారం తింటే జరిగే అనర్థం వేల రూపాయల ఆస్పత్రి బిల్లు నుంచి ప్రాణాలు పోయేంతదాకా! అయినప్పటికీ ప్రజలకు ప్రాణాం తకంగా పరిణమించిన ఈ ఆహార కల్తీపై జీహెచ్‌ఎంసీ చోద్యం చూస్తోంది. కేవలం వంద రూపాయల జరిమానా విధించి, ఓ హెచ్చరిక ముఖాన పారేసి చేతులు దులుపుకొంటోంది. దీంతో కర్రీపాయింట్ల నుంచి స్టార్‌హోటళ్ల వరకూ యథేచ్ఛగా కల్తీలకు పాల్పడుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. సిబ్బంది లేమి.. ఇతరత్రా లోపాలు.. లొసుగులు.. ఆమ్యామ్యాలు.. కారణాలేవైతేనేం కల్తీ రక్కసి సిటీజనుల జీవితాలను కకావికలం చేస్తోంది.
గ్రేటర్ పరిధిలోని హోటళ్లు, ఇతరత్రా ఆహార కేంద్రాల్లోని వంటకాలు తింటూ నిత్యం వందల సంఖ్యలో జనం ఆస్పత్రుల పాలవుతున్నారు. సాక్షాత్తూ జీహెచ్‌ఎంసీయే పాలల్లోనూ యథేచ్ఛగా కల్తీ జరుగుతున్నట్లు గుర్తించింది. అయినా ఇటు ఆహార కల్తీని అరికట్టలేక, అటు పాల కల్తీని నిరోధించలేక చేష్టలుడిగి చూస్తోంది. గత నాలుగు సంవత్సరాల్లో జీహెచ్‌ంఎసీ అధికారులు ఆహార కల్తీకి సంబంధించి నమోదు చేసిన కేసుల సంఖ్య 223. దీన్ని చూస్తే చాలు వారి పనితీరు ఏ విధంగా ఉందో అంచనా వేసుకోవచ్చు. నాలుగు లక్షల జనాభా ఉన్నప్పుడు ఉన్న నలుగురు ఫుడ్ ఇన్‌స్పెక్టర్లనే ప్రస్తుతం 70 లక్షల జనాభాకు వినియోగిస్తూ ప్రజలేమైపోతే తన కేంటన్నట్లు వ్యవహరిస్తోంది.
నిర్మాణ లోపాలతో భవనాలు కూలినప్పుడు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేవారిని క్షమించే ప్రసక్తే లేదని డాంబికాలు పలుకుతున్న అధికారులు.. విషాహారంతో ప్రజల్ని అనారోగ్యం పాలు చేస్తున్న వారిని మాత్రం ఏమీ చేయకపోవడం విశేషం. లోకాయుక్త ఆదేశాల మేరకు వివిధ సంస్థల పాల ఉత్పత్తులను పరీక్షలు చేయించగా లోపాలు వెల్లడవడం తెలిసిందే. దాన్ని దృష్టిలో ఉంచుకొనైనా ఆహార కల్తీకి పకడ్బందీ చర్యలు చేపట్టిందా అంటే అదీలేదు. వివిధ రకాల పన్నులు, ఫీజుల వసూళ్లపై జీహెచ్‌ఎంసీ చూపుతున్న శ్రద్ధ ప్రజారోగ్యంపై చూపకపోవడంపై పలు స్వచ్ఛంద సంస్థలు విమర్శల వర్షం కురిపిస్తున్నాయి.
తనిఖీల్లేవు.. చర్యల్లేవు..
ఆహార కల్తీ జరగకుండా, ప్రజలకు నాణ్యమైన ఆహారం అందాలంటే క్రమం తప్పని తనిఖీలు.. కల్తీలకు పాల్పడినవారిపై తక్షణ కఠిన చర్యలు అవసరం. కానీ.. గ్రేటర్‌లోని ఫుడ్ ఇన్‌స్పెక్టర్ల కొరత దృష్ట్యా అది సాధ్యం కావడం లేదు. ఇతర ప్రాంతాల్లోని హోటళ్ల సంగతటుంచి సాక్షాత్తూ జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలోని క్యాంటీన్‌లోనే పరిశుభ్రత లోపించింది. ఈ క్యాంటీన్‌లో ప్రజలు తినడానికి పనికిరాని ఆహారం వడ్డిస్తున్నట్లు గుర్తించిన ఆరోగ్యం, పారిశుధ్యం విభాగం అధికారులు ఇటీవల దాన్ని సీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఉన్నతాధికారులెందరో కొలువై ఉన్న చోటే పరిస్థితి ఇంత దారుణంగా ఉందంటే మిగతా ప్రాంతాల్లో ఎలా ఉంటుందో తేలిగ్గానే అంచనా వేసుకోవచ్చు.
సిబ్బంది లేమితో ఇబ్బంది
జీహెచ్‌ఎంసీ పరిధి, జనాభా కనుగుణంగా 30 మంది ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు అవసరం కాగా, ప్రస్తుతం నలుగురే ఉన్నారు. గ్రేటర్ పరిధిలోని దాదాపు 30 వేల హోటళ్లు, ఆహార పదార్థాల విక్రయ కేంద్రాలు, ఉత్పత్తి సంస్థల తనిఖీల బాధ్యత వీరిదే. నలుగురే అన్నింటినీ తనిఖీ చేయడం సాధ్యం కావడం లేదు. చేస్తున్న తనిఖీలు సైతం మొక్కుబడిగా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. రికార్డుల్లో చూపేందుకన్నట్లుగా కొన్ని కేసులు మాత్రం నమోదు చేసి, తమ పని అయిపోయిందన్నట్లు వ్యవహరిస్తున్నారు. నిర్ణీత వ్యవధుల్లో తనిఖీలు.. అక్రమాలకు పాల్పడేవారిపై కఠినచర్యలు లేకపోవడంతో హోటళ్ల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. చిరు హోటళ్ల నుంచి స్టార్ హోటళ్లదాకా, ఇరానీ టీకొట్ల నుంచి బిర్యానీ సెంటర్ల దాకా ఇదే పరిస్థితి. గ్రేటర్‌కు 26 మంది ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు, ఐదుగురు గెజిటెడ్ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ల పోస్టులైతే మంజూరైనప్పటికీ ఇప్పటికీ భర్తీ కాలేదు. ప్రసాదరావు కమిటీ సిఫార్సుల కనుగుణంగా సర్కిళ్ల పునర్వ్యవస్థీకరణతోనే సర్కిల్‌కొకరు చొప్పున 30 మంది ఫుడ్ ఇన్‌స్పెక్టర్ల పోస్టుల్ని త్వరలో భర్తీ చేయనున్నట్లు సంబంధిత ఉన్నతాధికారి తెలిపారు.
నిబంధనలివీ..
ఆహార కల్తీ వల్ల చనిపోతే, బాధిత కుటుంబానికి హోటల్ యజమాని రూ.5 లక్షలు చెల్లించాలి.
హోటల్‌ను సీజ్ చేయడంతో పాటు యజమానికి ఆర్నెల్ల జైలుశిక్ష వేయాలి.
లెసైన్సు లేకుండా ఆహారపదార్థాల ఉత్పత్తి, సరఫరా చేస్తే రూ.25 వేల జరిమానా.
కానీ.. ‘గ్రేటర్’లో సామాన్య శిక్షలే అమలవడం లేదు.
ఫుడ్ ఇన్‌స్పెక్టర్ల బాధ్యతలివీ..
ఆహారం విక్రయించే మాల్స్, దుకాణాలు, హోటళ్లలో తరచూ తనిఖీలు.
కల్తీ ఆహారం సరఫరా చేస్తే సీజ్ చేయడం.. లెసైన్సు రద్దు చేయడం.
అనుమానిత పదార్థాల శాంపిల్స్‌ను ల్యాబ్‌లో పరీక్షలు చేయించాలి.
కలుషిత, నిల్వ ఉంచిన ఆహారం ధ్వంసం చేయాలి.
{పజల నుంచి అందే ఫిర్యాదులకు తక్షణం స్పందించాలి.
తనిఖీలు, ల్యాబ్‌ల నివేదికలతో రికార్డు నిర్వహణ.
నలుగురే ఉండటంతో ఇవేవీ సక్రమంగా జరగడం లేదు.
జరిమానాల తీరిదీ...
సంవత్సరం జరిమానాలు సంవత్సరం జరిమానాలు
2010 రూ. 4500 2011 రూ. 5400
2012 రూ.13500 2013 .......
బిజీలైఫ్‌తో ముప్పు
బిజీ లైఫ్‌తో నగరంలో చాలామంది హోటళ్లను ఆశ్రయిస్తున్నారు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేయడం, వేళకు కార్యాలయాలకు వెళ్లాల్సి రావడం, వండుకునే తీరిక లేకపోవడం వంటి కారణాలతో అధికసంఖ్యాకులు హోటళ్లు, రెస్టారెంట్లు, కర్రీపాయింట్స్‌పై ఆధారపడుతున్నారు. వీటిలో శుచి, శుభ్రతల గురించి పట్టించుకుంటున్న వారు లేరు. కర్రీ పాయింట్ల నుంచి మొదలు పెడితే స్టార్‌హోటళ్ల దాకా జరుగుతున్న కల్తీ, శుభ్రత పాటించకపోవడం తదితర కారణాలతో గ్రేటర్‌లో రోజుకు 50-100 మంది వరకు కల్తీ సంబంధిత సమస్యలతో ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు.
Advertisement
Advertisement