వాత..మోత
పెరిగిన ఆర్టీసీ,విద్యుత్ చార్జీలు
{పయాణికులపై రూ.93 కోట్ల భారం
సిటీ బస్సులపై 10 శాతం పెంపు
27 నుంచి బస్ చార్జీలు..
జూలై ఒకటి నుంచి విద్యుత్ చార్జీల అమలు
గ్రేటర్ వాసులపై ప్రభుత్వం పెనుభారం మోపింది. ఒకేసారి ఆర్టీసీ, విద్యుత్ చార్జీలు పెంచి వినియోగదారుడి నడ్డి విరిచింది. ఇప్పటికే పెరిగిన నిత్యావసర సరుకులు, కూరగాయలు, పెట్రోలు, డీజిల్ ధరలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సామాన్యుడి జీవనంపై పెరిగిన చార్జీలు పెను ప్రభావం చూపనున్నాయి.
సిటీబ్యూరో: సగటు ప్రయాణికుడిపై ఆర్టీసీ భారం మోపింది. సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా ప్రయాణించే ఆర్డినరీ బస్సులను సైతం వదిలి పెట్టకుండా చార్జీల మోత మోగించింది. ఇప్పటికే వివిధ ధరల భారంతో విలవిల్లాడుతున్న నగరవాసులపై చార్జీల పెంపు పిడుగుపాటుగా మారింది. గ్రేటర్‌లోని అన్ని కేటగిరీల బస్సుల పైన, బస్‌పాసుల పైన 10 శాతం మేర చార్జీలు పెంచేశారు. ఈనెల 27 నుంచి కొత్త చార్జీలు అమల్లోకి రానున్నాయి. పెరిగిన చార్జీల వల్ల ప్రయాణికులపై ఏటా సుమారు రూ.93.60 కోట్ల భారం పడనుంది. ప్రతి రోజు నగరంలోని 3,550 బస్సుల్లో రాకపోకలు సాగించే సుమారు 33 లక్షల మంది ఈ భారం భరించాల్సిందే. అప్పట్లో భారీగా పెరిగిన డీజిల్ ధరల దృష్ట్యా 2013 నవంబర్‌లో బస్సు చార్జీలు పెంచారు. తెలంగాణ రాష్ర్టం ఏర్పడ్డాక చార్జీలు పంచడం ఇదే మొదటిసారి. మరోవైపు రూ.335 కోట్లకు పైగా నష్టాల్లో ఉన్న గ్రేటర్ ఆర్టీసీకి ‘పెంపు’ ఊరటనిస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఇటీవల జీహెచ్‌ఎంసీ నుంచి అందిన రూ.198 కోట్లతో పాటు చార్జీల పెంపు ద్వారా వచ్చే ఆదాయంతో రానున్న రోజుల్లో నష్టాలను అధిగమించి లాభాల బాట పట్టగలమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
అన్ని బస్సులపైనా 10 శాతం వడ్డన
ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, మెట్రో డీలక్స్, ఏసీ బస్సుల చార్జీలు, బస్‌పాసుల ధరలు ప్రస్తుతం కంటే 10 శాతం చొప్పున పెరగనున్నాయి. ఆర్డినరీ కనీస చార్జీ రూ.6 నుంచి రూ.7కు, మెట్రో ఎక్స్‌ప్రెస్ చార్జీ రూ.7 నుంచి రూ.8కి, మెట్రో డీలక్స్ చార్జీ రూ.8 నుంచి రూ.9కి పెరగనుంది. ఏసీ బస్సుల కనీస చార్జీ రూ.15 నుంచి రూ.16కు పెరుగుతుంది. నగరంలోని వివిధ రూట్లలో తిరిగే కిలోమీటర్లు, పెరగనున్న చార్జీలపై ఒకటి, రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. చార్జీల పెంపు వల్ల ప్రతిరోజు ప్రయాణికులపై రూ.26 లక్షలు, నెలకు రూ.7.8 కోట్ల అదనపు భారం పడనుంది. ఇందులో ఒక్క బస్‌పాస్‌ల పైనే ప్రతినెలా రూ.కోటి 50 లక్షలకు పైగా భారం పడుతుంది. ప్రస్తుతం గ్రేటర్ ఆర్టీసీ ప్రతి రోజు రూ.2.60 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తుండగా పెంపు వల్ల ఇది రూ.2.86 కోట్లకు పెరగనుంది. డీజిల్ ధరల పెంపు, విడిభాగాల ధరలు పెరగడం, బస్సుల నిర్వహణ భారం వంటి కారణాలతో ఆర్టీసీ 2010 నుంచి ఏటా ప్రయాణికులపై భారం వేస్తునే ఉంది. ఇటీవల పెరిగిన డీజిల్ ధరలు, ఉద్యోగుల వేతనాల పెంపు, భారీగా నమోదైన నష్టాల భారాన్ని ప్రయాణికులపై మోపారు.
నష్టాలను అధిగమిస్తాం..
గత రెండు, మూడేళ్లుగా వస్తున్న నష్టాల నుంచి గట్టెక్కేందుకు అవకాశం లభించింది. ఇటీవల జీహెచ్‌ఎంసీ నుంచి అందిన ఆర్థిక సాయంతో గ్రేటర్ ఆర్టీసీకి ఊరట లభించింది. తాజాగా చార్జీలతో రానున్న రోజుల్లో నష్టాలను పూర్తిగా అధిగమించి లాభాల బాట పట్టగలమనే నమ్మకం ఏర్పడింది. చార్జీల పెంపు ప్రజలపై అదనపు భారమే అయినా ఆర్టీసీని కాపాడుకోవడం కోసం భరించక తప్పదు. - పురుషోత్తమ్, ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఈడీ
పేదోళ్లు బతికేదెట్టా..
ఒక్కటా,రెండా అన్ని వస్తువుల ధరలు పెరుగుతూనే ఉండె. కూరగాయలు, పప్పులు,నూనెలు కొనుక్కొనే పరిస్థితి లేదు. ఇప్పుడు ఆర్టీసీ చార్జీలు పెంచుతున్నారు. ఇట్టా అన్ని ధరలు పెంచుకుంటా పోతే పేదోళ్లు బతికేదెట్టా! బస్సెక్కితే చాలు రూ.వందలకు వందలు చార్జీలు తీసుకుంటున్నారు. ఇట్లయితే ఇక జనం బాగుపడ్డట్టే. - మాధవి, నిజామాబాద్
సౌకర్యాలు నిల్
చార్జీలు పెంచడంపై ఉండే శ్రద్ధ బస్సులు నడపడంపై మాత్రం కనిపించడం లేదు. రాత్రి 8 దాటితే సిటీలో చాలా రూట్లలో బస్సులు కనిపించవు. ఉదయం పూట కూడా అదే పరిస్థితి. బస్సుల నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ పరిస్థితి మారాలి. ప్రయాణికులకు సిటీ బస్సు సదుపాయాలు బాగా మెరుగుపడాలి. - నర్సింహ, సికింద్రాబాద్