'పోయే కాలం వచ్చింది'
హైదరాబాద్: 'నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్లు ప్రభుత్వం వ్యవహరిస్తోంది' అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీదర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే ఆర్కే రోజాను అసెంబ్లీలోకి అనుమతించక పోవడంపై ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ ప్రభుత్వానికి పోయేకాలం వచ్చింది కనుక వారిని ఎవరూ కాపాడలేరంటూ తీవ్రంగా విమర్శించారు. నవ్యాంధ్ర నూతన రాజధాని భూదందాలో లక్షలకోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు.
ఏపీ అసెంబ్లీ సభా నియమనిబంధనలు ఉల్లంఘించడంతో పాటు ఇందుకు పరాకాష్టగా హైకోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేశారని మండిపడ్డారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేల పట్ల ఈ ప్రభుత్వ తీరును అందరూ నిరసిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఆర్కే రోజాకు అంశంలో జరిగింది, ఒక్క వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేకి జరిగిన అన్యాయం కాదిది.. న్యాయవ్యవస్థ ఆదేశాలను శాసన వ్యవస్థ బేఖాతరు చేస్తే ఇలాగే ఉంటుందన్నారు. ప్రభుత్వం, ప్రతిపక్షం అంటూ తేడా లేకుండా ఎవరైనా సరే రాజ్యాంగానికి లోబడి ఉండాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీదర్రెడ్డి అన్నారు.