సికింద్రాబాద్, న్యూస్‌లైన్: సికింద్రాబాద్ ప్రాంతంలోని పలుమురికివాడల పిల్లలకు ఉచిత విద్యాబోధన అందించి ఉన్నత ఉద్యోగాల్లో నిలిపిన అమరావతి విద్యాసంస్థల అధినేత వట్టిపల్లి కోటేశ్వర్‌రెడ్డి(కోటిరెడ్డి సారు) (56) ఆదివారం సాయంత్రం కన్నుమూశారు. ఆరురోజుల క్రితం గుండెపోటు రావడంతో ఆయన్ను స్థానిక సన్‌షైన్ ఆస్పత్రికి తరలించారు. మాస్టారు మరణవార్త వినగానే పలు మురికివాడలకు చెందిన ప్రజలు ఆస్పత్రికి తరలివచ్చారు. కోటేశ్వరరెడ్డికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
విద్యాభ్యాసం కోసం వచ్చి..
మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి మండలం రామాపురానికి చెందిన వట్టిపల్లి కోటేశ్వరరావు ఉన్నత విద్యకోసం నగరానికి వచ్చారు. ఓయూ హాస్టల్ నుంచి కాలినడక చిలకలగూడలోని శ్రీదేవి, నామాలగుండులోని సురేష్ థియేటర్ ప్రాంతానికి వచ్చేవారు. అక్కడి మురికివాడలు ఆయన్ను కదిలించాయి. అక్కడివారి కుటుంబాల్లో వెలుగు నింపాలన్న సంకల్పంతో 1984లో ఇక్కడ పాఠశాల నెలకొల్పి మురికివాడల పిల్లలకు అక్షరాలు నేర్పిచారు. కేవలం 30 మందితో చిన్న గదిలో ప్రారంభమైన అమరావతి పాఠశాల పలు శాఖల విద్యా సంస్థగా ఎదిగింది.
ఇక్కడి మురికివాడల్లో ఉన్న ఏడు పాఠశాలల్లో 8 వేల మంది విద్యార్థులుండగా, వారిలో 2,500 మందికి ఉచితంగానే విద్యాబోధన అందిస్తున్నారు. మిగతావారు నెలకు రూ.10 మొదలు ఎంతతోస్తే అంతే ఫీజు చెల్లిస్తారు. ఇక్కడ విద్యాభ్యాసం చేసినవారిలో 800 మంది ఇంజినీర్లు, 600 మంది డాక్టర్లుగా స్థిరపడ్డారు. మరో 1500 మంది ఎంబీఏ, ఎంసీఏ చదివి దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. కోటేశ్వరరెడ్డి కూతుర్లు, అల్లుళ్లు సైతం అమరావతి విద్యా సంస్థల్లో ఉపాధ్యాయులే కావడం గమనార్హం.
ఎక్కడకు వెళ్లిన లూనాపైనే..
పలు పాఠశాలల కరస్పాండెంట్ హోదా ఉన్నా కోటేశ్వరరెడ్డి సాధారణ జీవితమే గడిపారు. ఆయనకు ఏ పాఠశాలలోనూ ఛాంబర్ లేదు. మిత్రులు, పేరెంట్లు ఎవరోచ్చినా సరే సదరు పాఠశాలపై టైలో రెండు కుర్చీలు వేసుకుని మాట్లాడేవారు. ఆయన ఎక్కడికైనా ఓ పాత లూనాపైనే వెళ్లేవారు. కోటేశ్వర్‌రెడ్డి మాస్టారు తుదిశ్వాస విడిచేవరకు అద్దె ఇంటిలోనే జీవించడం ఆయన నిరాడంబరతకు నిదర్శనం.
నేడు పాఠశాలల బంద్
కోటేశ్వరరెడ్డి మృతికి సంతాపంగా సోమవారం సికింద్రాబాద్ ప్రాంత ప్రై వేటు పాఠశాలల యాజమాన్యలు సెలవు ప్రకటించాయి. సీతాఫల్‌మండి మేడిబావిలోని గల నివాసంలో కోటేశ్వరెడ్డి భౌతికకాయాన్ని ప్రజల సందర్శన కోసం ఉంచారు. మంగళవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
కోటిరెడ్డి సారు ఇకలేరు
Published Mon, Nov 18 2013 1:22 AM | Last Updated on Sat, Sep 2 2017 12:42 AM
Advertisement