మరణించినా.. జీవించు! | Many member rebirth | Sakshi
Sakshi News home page

మరణించినా.. జీవించు!

Published Tue, Aug 6 2013 1:26 AM | Last Updated on Fri, Sep 1 2017 9:40 PM

మరణించినా.. జీవించు!

మరణించినా.. జీవించు!

ఆరోగ్య రంగంలో పెను మార్పు చోటు చేసుకుంటోంది. అవయవ దాతల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. అవగాహన పెరగడం, దాతలు ముందుకు రావడంతో నగరంలో అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు విరివిగా జరుగుతున్నాయి. గత పదేళ్లలో 155 బ్రెయిన్ డెడ్ కేసుల నుంచి వెయ్యి అవయవాలను సేకరించి 854 మందికి అమర్చగా.. ఒక్క ఈ ఏడాది జూలై నాటికి నిమ్స్ జీవన్‌దాన్ ద్వారా 23 మంది బాధితుల నుంచి అవయవాలు సేకరించి, 150 మందికి పునర్జన్మను ప్రసాదించారు. కేవలం బ్రెయిన్ డెడ్ బాధితులే కాదు, ఆరోగ్యంగా ఉన్న వారు (లైవ్ డోనర్స్) సైతం ముందుకు వస్తుండడంతో.. ఆరోగ్య రాజధాని హైదరాబాద్ తాజాగా అవయవ మార్పిడి శస్త్రచికిత్సలకు కేంద్ర బిందువుగా మారుతోంది. నేడు (మంగళవారం) జాతీయ అవయవదాన దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం
 
 సాక్షి, సిటీబ్యూరో: మనం మరణించినా మన కళ్లు ఈ లోకాన్ని చూస్తూనే ఉంటాయి. మనం ఏ లోకంలో ఉన్నా మూత్రపిండాలు రక్తాన్ని శుద్ధి చేస్తూనే ఉంటాయి. మన శ్వాస ఆగిపోయినా గుండె ఁలబ్‌డబ్‌రూ.మంటూ కొట్టుకుంటూనే ఉంటుంది. కేవలం అవయవ దానం వల్ల మరణించినా బతికి ఉండే అవకాశం లభిస్తోంది! మృత్యువును జయించిన వారంతా దేవతలైతే.. ఆ జాబితాలో అవయవాలను దానం చేసిన వారు కూడా చేరుతారు. కేవలం బ్రెయిన్‌డెడ్ బాధితుల నుంచే కాదు, లైవ్‌డోనర్స్ కూడా అవయవాలను దానం చేసేందుకు ముందుకు వస్తుండటంతో నగరంలో ఇటీవల అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు ఊపందుకున్నాయి. నిమ్స్‌లో ఇప్పటివరకు 650 కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్లు జరిగితే, గ్లోబల్ ఆస్పత్రిలో 250 కాలేయ మార్పిడి, 110 మూత్ర పిండాలు, ఐదు గుండె మార్పిడి శస్త్రచికిత్సలు జరిగాయి. రాష్ట్రంలో తొలిసారిగా యశోద ఆస్పత్రిలో రెండు ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్సలు జరిగాయి.
 
 ఒక్కరితో పలువురికి పునర్జన్మ

 మనిషి జీవించి ఉండగా రక్తదానంతో పాటు కిడ్నీ (రెండింట్లో ఒకటి), కాలేయం (మూడింట ఒక భాగం) మాత్రమే దానం చేసే అవకాశం ఉంది. రక్తదానం ఎవరికైనా చేయవచ్చు కానీ.. కిడ్నీ, కాలేయ దానాలపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. రక్త సంబంధీకుల నుంచి మినహా ఇతరుల నుంచి వీటిని సేకరించకూడదు. అదే బ్రెయిన్‌డెడ్‌గా నిర్ధారించిన వ్యక్తి నుంచి గుండె తో పాటు రెండు జతల కవాటాలు, కిడ్నీలు, నేత్రాలు, చర్మం, ఎముకలు, కండరాలు, ఎముకల్లోని మజ్జ, కాలేయం, ఊపిరితిత్తులు, క్లోమం సేకరించ వచ్చు. ఇలా ఒక వ్యక్తి నుంచి సేకరించిన అవయవాలతో ఏడు నుంచి తొమ్మిది మందికి పునర్జన్మను ప్రసాదించే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
 
 బ్రెయిన్‌డెడ్ నిర్ధారిస్తారిలా..

 ప్రమాదం వల్ల, నివారణ సాధ్యం కాని వ్యాధుల వల్ల కోమాలోకి చేరుకుని, మళ్లీ స్పృహలోకి రాలేని పరిస్థితిలో ఉన్న బాధితుడిని వైద్యులు ‘బ్రెయిన్‌డెడ్’గా నిర్ధారిస్తారు. ఈ సమయంలో వీరి మెదడు నుంచి ఇతర భాగాలకు సంకేతాలు అందవు. వైద్యులు దీన్ని గుర్తించి, వెంటిలేటర్ సహాయంతో ఆక్సిజన్‌ను ఎక్కువ ఒత్తిడితో శరీరంలోకి పంపిస్తారు. ఆ వ్యక్తి మరణించినా అవయవాలు మాత్రం కొన్ని గంటల పాటు పనిచేస్తూనే ఉంటాయి. వీటిని సాధ్యమైనంత త్వరగా సేకరించి బ్లడ్‌గ్రూప్ తదితర అంశాలు సరిపోలిన వారికి నిర్ధేశిత సమయంలో అమర్చుతారు.
 
 ఎన్ని గంటల్లో అమర్చాలంటే..
 అవయవాల మార్పిడి శస్త్రచికిత్సలు దుర్వినియోగం కాకుండా చూసేందుకు ప్రభుత్వం 1994లో ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్‌ను తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం అవయవాల అమ్మకాలు నిషేధం. బ్రెయిన్ డెడ్‌గా నిర్ధారించిన వ్యక్తి నుంచి మాత్రం కుటుంబ సభ్యుల అంగీకారంతో అవయవాలు సేకరించొచ్చు. సేకరించిన అవయవాలను నిర్దేశిత సమయాల్లో అవసరమైన వారికి అమర్చాలి. ఆలస్యమైతే అవి పాడైపోయే ప్రమాదముంది. కాలేయాన్ని 10-12 గంటల లోపు, మూత్రపిండాలను 24 గంటల్లోపు, గుండెను 4 గంటల్లోపు, కళ్లను 6-8 గంటల్లోపు అమర్చాలి.
 
 జీవన్‌దాన్ నెట్‌వర్క్‌లో ఉన్న ఆస్పత్రులు ఇవే
 అవయవాల మార్పిడి శస్త్రచికిత్సలు చేయాలంటే ముందస్తుగా ఆయా ఆస్పత్రులు, వైద్యులు తమ పేర్లను జీవన్‌దాన్ కార్యాలయంలో నమోదు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ కానీ ఆసుపత్రుల్లో అవయవ మార్పిడి చేయడం చట్టారీత్యా నేరం. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 23 ఆస్పత్రులు జీవన్‌ధాన్‌లో పేర్లు నమోదు చేసుకున్నాయి. వీటిలో నగరంలోని నిమ్స్, గ్లోబల్, కేర్, అపోలో, కిమ్స్, యశోదా, స్టార్, గాంధీ, ఉస్మానియా, కామినేని, డెక్కన్ ఆస్పత్రులున్నాయి. ఆసక్తి గలవారు ఫోన్ నెం. 2348 9494లో సంప్రదించవచ్చు.
 
 ఇది పునర్జన్మే
 చాలా కాలంగా గుండె నొప్పితో బాధపడ్డా. నాలుగేళ్ల క్రితం డాక్టర్ గోఖలేను సంప్రదించగా, గుండె పూర్తిగా దెబ్బతింది.. గుండె మార్పిడి ఒక్కటే దీనికి పరిష్కారమన్నారు. అప్పుడే బ్రెయిన్‌డెడ్ అయిన ఓ మహిళ గుండెను దానం చేసేందుకు ఆమె బంధువులు అంగీకరించడంతో గోఖలే నేతృత్వంలోని వైద్య బృందం వెంటనే ఆ అవ యవాన్ని సేకరించి నాకు అమర్చారు. నిజంగా ఇది నాకు పునర్జన్మే.    
 - వాణి, నిజాంపేట్
 
 ప్రాధాన్యతను బట్టి అవయవాల సరఫరా..
 అవయవాలు కావాలనుకునే వారు జీవన్‌దాన్ అర్హత ఉన్న ఆస్పత్రుల్లో వివరాలు నమోదు చేసుకోవాలి. ఇందుకు సభ్యత్వ రుసుం కింద రూ.5 వేలు చెల్లించాలి. అవయవాల మార్పిడి శస్త్రచికిత్సల కోసం ఎదురు చూస్తున్న బాధితుల బాబితాలోని పేర్ల ప్రకారం అవయవాలను సమకూర్చుతాం. అయితే ఈ అంశంలో యువతకు మొదటి ప్రాధాన్యత ఇస్తాం.
 - డాక్టర్ స్వర్ణలత, జీవన్‌దాన్ ఇన్‌చార్జి, నిమ్స్
 
 లైవ్‌డోనర్స్ ముందుకు వస్తున్నారు
 నిమ్స్‌లో పదేళ్ల కాలంలో 650 మందికి కిడ్నీల మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించగా, వీరిలో సుమారు 610 మందికి లైవ్‌డోనర్స్ నుంచి సేకరించినవే. మిగిలిన 40 మందికి మాత్రమే బ్రెయిన్‌డెడ్ బాధితుల కిడ్నీలను అమర్చాం.
 - ప్రొ.శ్రీభూషణ్‌రాజు, కిడ్నీ విభాగాధిపతి, నిమ్స్
 
 బాధితులు ముందుకు రావట్లేదు
 అవయవాలను దానం చేసేందుకు దాతలు ముందుకు వస్తున్నా.. వాటిని అమర్చుకునేందుకు బాధితులు ఆసక్తి చూపడం లేదు. దీంతో బ్రెయిన్‌డెడ్ కేసుల నుంచి సేకరించిన అవయవాలు పాడైపోతున్నాయి.
 - డాక్టర్ ఏజీకే గోఖలే, గుండె, ఊపిరితిత్తుల మార్పిడి నిపుణుడు, యశోద ఆస్పత్రి
 
 సక్సెస్ రేటు 90 శాతం
 రాష్ట్రంలోనే తొలిసారిగా గ్లోబల్ ఆస్పత్రిలో లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీలు చేశాం. ఇలా ఇప్పటివరకు 250కి పైగా శస్త్రచికిత్సలు చేసి, 90 శాతం సక్సెస్ రేట్ సాధించాం. నగరంలో తక్కువ ధరకే ఖరీదైన వైద్యం అందుతుండటంతో విదేశీయులు సైతం ఇక్కడికే వస్తున్నారు.
 - డాక్టర్ రవీంద్రనాథ్, సీఎండీ, గ్రూప్ ఆఫ్ గ్లోబల్ హాస్పిటల్స్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement