
ఆలె నరేంద్ర - విలక్షణం, వివాదాస్పదం
బుధవారం నాంపల్లి కేర్ ఆస్పత్రిలో మరణించిన ఆలె నరేంద్ర రాజకీయం విలక్షణమే కాదు. వివాదాస్పదం కూడా. ఆయన తెలంగాణలో బిజెపి ఎదుగుదలలో ప్రధాన పాత్ర వహించారు. కానీ బిజెపి కార్యకర్తలు ఆయన వేరే పార్టీలో చేరినప్పుడు ఆయన ఇంటిపై దాడి చేశారు. ఆయన జీవితమంతా కాంగ్రెస్ ను వ్యతిరేకించారు. కానీ చివరికి కాంగ్రెస్ హయాంలోనే ఆయన కేంద్ర మంత్రి అయ్యారు.
ఆలె నరేంద్ర 1980 వ దశకపు రాజకీయాలకు ప్రతినిధి. అప్పట్లో పాత బస్తీ మత కల్లోలాలతో కుతకుతలాడుతూండేది. ఆ రోజుల్లో ఒక వర్గానికి సుల్తాన్ సలాహుద్దీన్ ఒవైసీ నాయకత్వం వహిస్తే, ప్రత్యర్థి వర్గానికి టైగర్ నరేంద్ర నాయకుడిగా నిలిచారు. అటు ఒవైసీకి, ఇటు నరేంద్రకు రాబిన్ హుడ్ ఇమేజీ ఉండేది.
పాతబస్తీలోనే ఇల్లు ఉండి, అక్కడే నివసించిన చాలా తక్కువ మంది నాయకుల్లో నరేంద్ర ఒకరు. కానీ నరేంద్ర ఏ నాడూ పాత బస్తీ నుంచి గెలుపొందలేదు. 1983 ఎన్నికల్లో ఆయన చంద్రాయణ గుట్ట నుంచి పోటీకి దిగారు. ఆయనకి ప్రత్యర్థిగా మజ్లిస్ నేత అమానుల్లా ఖాన్ బరిలో ఉన్నారు. ఇద్దరి మధ్యా హోరాహోరీ జరిగింది. ఒకానొక సందర్భంలో ఇరువురు నేతలు పరస్పరం కాల్పులు కూడా జరుపుకున్నారు. హైదరాబాద్ లో గణేశ్ నిమజ్జనాన్ని సామూహికంగా నిర్వహించే పద్ధతిని పాపులర్ చేయడంలోనూ ఆయన పాత్ర ఉంది. కొన్ని దశాబ్దాల పాటు ఆయన ట్రేడ్ యూనియన్ లీడర్ గా కూడా పనిచేశారు.
ఈ సంఘటన తరువాత నరేంద్ర రాజకీయం పాతబస్తీ కేంద్రంగా సాగినా, ఆయన ఎన్నికల్లో గెలిచింది మాత్రం కొత్త బస్తీనుంచే. నరేంద్ర రాజకీయంగా జెయింట్ కిల్లరే. ఆయన టీడీపీ సీనియర్ నేత ఉపేంద్రను ఒక సారి ఓడించారు. మెదక్ ఎంపీగా పోటీ చేసి తలపండిన కాంగ్రెస్ నేత బాగారెడ్డిని ఓడించారు.
బిజెపి, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల తరఫు నుంచి చట్ట సభలకు ఎన్నికయ్యారు. కానీ మనసు మాత్రం ఆరెస్సెస్ తో నే ఉండేది. ఇతర పార్టీల్లో ఉంటున్నప్పటికీ ఆయన ఆరెస్సెస్ కార్యక్రమాలకు యూనిఫారం ధరించి మరీ హాజరయ్యేవారు.
తిరిగి ఆయన బిజెపిలో చేరేనాటికే ఆరోగ్యం బాగా క్షీణించింది. గత దశబ్దంగా ఆయన నిశ్శబ్దంగానే ఉన్నారు. ఆయన కుమారుడు జితేందర్ గౌలీపురా కార్పొరేటర్. ఇంకో కుమారుడు ఆలె భాస్కర రాజ్ హుజూరాబాద్ నుంచి పోటీ చేయాలని ప్రయత్నించారు. ఆయన సోదరుడు శ్యామ్ కుమార్ ఆరెస్సెస్ తెలంగాణ ప్రాంతానికి ప్రధాన ప్రచారక్ గా ఉంటున్నారు.
నరేంద్ర మృతితో ఎనభైయవ దశకంలోని పాతబస్తీ రాజకీయాల ప్రధాన పాత్రధారులు సాలార్ సలాహుద్దీన్ ఒవైసీ, అమానుల్లా ఖాన్, నరేంద్రలు ఇప్పుడు చరిత్ర పేజీల్లోకి వెళ్లిపోయినట్టయింది.