నాన్‌వెజ్ మిల్క్! | non veg milk making with hotel wastage | Sakshi
Sakshi News home page

నాన్‌వెజ్ మిల్క్!

Published Wed, Jan 13 2016 2:44 AM | Last Updated on Sun, Sep 3 2017 3:33 PM

నాన్‌వెజ్ మిల్క్!

నాన్‌వెజ్ మిల్క్!

మాంస వ్యర్థాలు, కుళ్లిన కూరగాయలే గ్రాసం..
 నగర శివారు ప్రాంతాల్లో గేదెలకు హోటల్ వ్యర్థాలు
* పాడైన, మిగిలిపోయిన పదార్థాలన్నీ డ్రమ్ముల కొద్దీ చేరవేత
* గడ్డి, తవుడుకు బదులు నానా చెత్తనంతా పెడుతున్న రైతులు
* ‘డస్ట్‌బిన్’లుగా మారిపోతున్న గేదెల పొట్టలు
* అనారోగ్యం పాలవుతున్న మూగజీవాలు
* వాటి పాలు తాగిన పిల్లలకూ అనారోగ్య సమస్యలు
* గడ్డి దొరక్కే హోటల్ వ్యర్థాలు పెడుతున్నామంటున్న రైతులు
* మార్కెట్‌లోకి వచ్చి చేరుతున్న లక్షల లీటర్ల పాలు

 
సాక్షి ప్రతినిధి:
 గేదెలకు మేతగా ఏమిస్తారు?
 ఏముంది..? పచ్చిగడ్డి, ఎండుగడ్డి, దాణా, తవుడు.. వగైరా అంటారా?
 అయితే మీరు సాంబారులో కాలేసినట్టే!
 పాడైపోయిన కూరలు, కుళ్లిపోయిన కూరగాయలు, కంపుకొట్టే మాంస వ్యర్థాలు, సాంబారు.. ఒక్కటేమిటీ హోటళ్లలో మిగిలిపోయే నానా చెత్తాచెదారమంతా గేదెలకు పెడుతున్నారు!! హోటళ్లలో మిగిలిపోయే ఈ వ్యర్థాలన్నీ నేరుగా మూగజీవాల పొట్టలోకి వెళ్తున్నాయి. డ్రమ్ముల కొద్దీ నిల్వ చేసిన ఈ పాడైపోయిన ఆహార పదార్థాలను ఏజెంట్లు హోటళ్ల నుంచి కొనుగోలు చేసి రైతులకు అమ్ముతున్నారు. ఆకలితో ఉన్న గేదెలకు ఈ మురిగిపోయిన వంటకాలే మహాప్రసాదమవుతున్నాయి. దీంతో తవుడు, పచ్చిగడ్డి, ఎండుగడ్డితో నిండాల్సిన గేదెల పొట్టలు కాస్త ‘డస్ట్‌బిన్’ లుగా మారిపోతున్నాయి! హైదరాబాద్ శివారుల్లోని వందల సంఖ్యలో రైతులు కొన్ని వేల గేదెలకు ఇలాంటి తిండే ఇస్తూ లక్షల లీటర్ల పాలు విక్రయిస్తున్నారు.

 లక్షలు ఏజెంట్లకు.. శిక్షలు పశువులకి
 హైదరాబాద్ నగరంలోని దాదాపు వందకు పైగా హోటళ్లలోని చెత్తాచెదారం రోజూ నగరం, నగరం చుట్టపక్కల పాడి రైతులకు చేరుతోంది. మల్కాజిగిరి, కూకట్‌పల్లి, బోయిన్‌పల్లి, కీసర, తూప్రాన్, యాప్రాల్ ప్రాంతాల్లోని రైతులకు ప్రతి రోజు క్రమం తప్పకుండా తరలిపోతుంది. హోటళ్లలో మిగిలిపోయిన ఆహారంతోపాటు పాడైపోయిన కూరగాయలు, మాంసం శుభ్రం చేసే సమయంలో వచ్చే చెత్త, భోజనాల తర్వాత పళ్లాల్లో మిగిలిపోయిన వాటిని డ్రమ్ముల్లో నిల్వ చేస్తున్నారు. ఈ చెత్తనంతా ఏజెంట్లకు అమ్ముతున్నారు. హోటళ్ల నుంచి ఈ చెత్తతో వ్యాపారం చేస్తున్న దళారీలు నెలకు రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకూ సంపాదిస్తున్నట్లు సమాచారం. మల్కాజ్‌గిరి పరిసరాల్లోని హోటల్ వేస్ట్‌ని తరలించే శివ అనే దళారీ రోజూ పది డ్రమ్ముల వ్యర్థాలను రైతులకు అమ్ముతున్నాడు. ఒక్కో డ్రమ్ము ధర రూ.500. ఈ లెక్కన నెలకు లక్షన్నర సంపాదిస్తున్నాడు. యాప్రాల్ ప్రాంతంలో అంజిరెడ్డి అనే దళారీ రోజుకు 25 డ్రమ్ముల వ్యర్థాలను అమ్ముతున్నాడు. ఇతడికి సొంతంగా రెండు వ్యాన్లు, ఇద్దరు కూలీలు ఉన్నారు. ఆ ప్రాంతంలోని 14 మంది రైతులకు హోటల్ వ్యర్థాలను అమ్ముతున్నాడు. వారి నుంచి నెలకోసారి బిల్లు తీసుకుంటున్నాడు.

 కడుపు నిండా జబ్బులే...
 తొలుత ఈ వ్యర్థాల వాసన గిట్టని గేదెలకు వాటిని అలవాటు చేసేందుకు మొదట్లో కొద్దిగా కొబ్బరి పిండి, తవుడు కలిపి ఇస్తున్నారు. పాడైపోయిన పదార్థాలు, మురిగిపోయిన మాంసాహారం తినడం వల్ల గేదెలకు కడుపు ఉబ్బరంతోపాటు పలు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఈ నిల్వ ఆహారం ఏజెంట్ తీసుకొచ్చిన రోజే కాకుండా.. రెండో రోజు కూడా అందిస్తున్నారు. దీంతో ఆ ఆహారం మరింత కుళ్లి దుర్వాసన వస్తుంది. వాటిని తిని గేదె అస్వస్థతకు గురైతే రైతుల దగ్గర మందులు కూడా ఎప్పుడూ నిల్వ ఉండడం గమనార్హం. యాప్రాల్ సమీపంలో ఒక గ్రామానికి చెందిన పాడి రైతు మాట్లాడుతూ.. ‘‘నెలొచ్చేసరికి డాక్టరుకు రూ.15 వేలు అవుతోంది. ఎనకటి లెక్క పశువులకు రెండు పూటలా గడ్డి ఏసే పరిస్థితి లేదు. ఎండుగడ్డి కట్ట రూ.100 అయింది. అగో చూస్తున్నరు కదా ఆ గడ్డి కుప్ప ఎంతుంది..? ట్రాక్టరు కూడా లేదు. కానీ రూ.30 వేలు. ఆ గడ్డి మా బర్రెలకు పది రోజులు కూడా రాదు. ఇగో ఈ హోటల్ ఫుడ్డే మాకు దిక్కు. రోజూ రెండు డ్రమ్ములు కొంటం. దాంతోనే వాటి కడుపు నింపుతున్నం. బాగానే ఉంది కానీ.. వాటికి రోగాలు ఎక్కువైతున్నయి. ఈ ఫుడ్‌ల కారం, మసాలా, కక్క, ముక్క.. అన్నీ ఉంటయి కదా! వాటికి తొందరగ అరగవు. అందుకే ఊకే కడుపు ఉబ్బడం, గ్యాస్ పట్టడం వంటివి వస్తాయి. వారం వారం డాక్టర్‌ని తోల్కొచ్చి సూదులిప్పిస్తం. వచ్చినప్పుడల్లా మందులకు కాకుండా అన్ని బర్రెలను చూసినందుకు ఫీజే వెయ్యి రూపాయలు తీసుకుంటడు’’ అని వివరించారు.

 గడ్డి లేకే పెడుతున్నం
 ఈ హోటల్ ఫుడ్డు లేకపోతే ఎప్పుడో పాడి వ్యాపారానికి దణ్ణం పెట్టేవాళ్లం అని తూప్రాన్ పరిసరాల్లోని పాడి రైతులు పేర్కొన్నారు. పచ్చిగడ్డి చూడ్డానికి కూడా కనిపించడం లేదు.. ఎండుగడ్డి కొనే స్థోమత లేదు అని వారు చెబుతున్నారు. ‘‘అరె బర్రెలకు తాపనీకి నీళ్లే దొరకతలేవు. వెయ్యి, పదిహేనొందలు పెట్టి ట్యాంకరు కొనుక్కుంటున్నం. ఇక మా బర్రెలకు పచ్చిగడ్డి ఎట్లుంటదో కూడా తెల్వదు. వానాకాలం ధర తగ్గినప్పుడు ఒక ట్రాక్టర్ ఎండుగడ్డి కొంటం. చానా వరకు మేం బర్రెలను ఆంధ్రాకు వెళ్లి తెచ్చుకుంటం. వాటికి రాగానే ఈ ఫుడ్ పెడితే ముట్టవు. కొన్ని రోజులు ఒక పూట గడ్డి, ఒక పూట ఈ సాంబారు పెడతం. అలవాటు కావడానికి ఇందులో కొంత కొబ్బరిపిండి వంటివి కలుపుతం. తర్వాత మెల్లగా గడ్డి బంజేసి మొత్తానికి ఇదే పెడ్తం’’ అని వారి ఆయన వివరించాడు.

 వ్యర్థాలను ఎలా తీసుకెళ్తున్నారు?
 ఈ హోటల్ వ్యర్థాలను తరలించడానికి ఏజెంట్లకు అనుమతి ఎలా వచ్చిందనే ప్రశ్నకు సమాధానం వింటే అవాక్కవ్వాల్సిందే. పందులకు మేతగా వేసేందుకని అనుమతి తీసుకున్న ప్రబుద్ధులు.. వాటిని పాడి రైతులకు చేరవేస్తున్నారు. పదేళ్ల క్రితమే ఈ ఆహారాన్ని పాడి పశువులకు రుచి చూపించారు. మొదట్లో సాంబారు, ఇడ్లీలు మాత్రమే తెచ్చేవారు. క్రమంగా మిగిలిన పదార్థాలన్నీ కలపడం మొదలుపెట్టారు. అప్పటికే గడ్డిని పక్కన పెట్టడంతో రైతులు ఈ ఆహారాన్ని వద్దనలేకపోయారు. దీనికి తోడు పశుగ్రాసం కరువవడం.. తక్కువ ధరకు దొరకడంతో కుళ్లిన ఆహారాన్నే పశువులకు అలవాటు చేశారు.

ముక్కు మూసుకొని పెడతాం..
 ‘‘ఈ ఫుడ్ మస్తు కంపులేస్తది. ఆ పది నిమిషాలు ముక్కు మూసుకుని నీళ్లు కలిపి బర్రెలకు పెడతాం. రోజూ రెండు పూటలా అవి బాగా ఆకలిగా  న్నప్పుడు పెడతం. ఏం జేస్తయి సచ్చినట్టు తాగుతయి. మాకు 10 నిమిషాలళ్ల పనైపోతుంది. గడ్డి కోసుడు, ఏసుడు ఏముండదు’’
 - కీసర ప్రాంతంలో ఓ పాడిరైతు వద్ద పనిచేసే కూలీ.
 
 లేత గోధుమ రంగులో పాలు
 హోటల్ వ్యర్థాలు తిన్న పశువులు ఇచ్చే పాలు తాగిన పసి పిల్లలు నరకం అనుభవిస్తున్నారు. ఈ పాలు తెల్లగా కాకుండా లేత గోధుమ రంగులో ఉంటాయి. వాటిని మరిగించినపుడు మీగడపై నూనె వంటి పదార్థం తెట్టులా పేరుకుటుంది. పాల వాసన కూడా మామూలువాటిలా ఉండదు. శివారులోని నాగారంలో ఒక కాలనీవాసులు ఈ పాలనే కొనుక్కుంటున్నారు. అక్కడ ఓ మహిళ మాట్లాడుతూ.. ‘‘ఈ పాలు పిల్లలకు అరగవు. నెలల పిల్లలైతే ముట్టను కూడ ముట్టరు. అదే గడ్డి తినే బర్రెల పాలు మంచిగ తాగుతరు. అందుకే మా బాబు కోసం పావు లీటరు ప్యాకెట్ పాలు కొంటం. మా కోసం ఈ సాంబారు పాలే తీసుకుంటం’’ అని వివరించింది.
 
 ఇది క్షమించరాని నేరం..
 పులి గడ్డి తినదన్నది ఎంత సత్యమో.. గేదెలు మాంసం తినవన్నదీ అంతే వాస్తవం. డబ్బుల కోసం మిగిలిపోయిన చికెన్ బిర్యానీలను సైతం పశువుల నోట్లో కూరడం క్షమించరాని నేరం. మొదట్లో సాంబారు అనేవారు. ఇప్పుడంతా డ్రై ఫుడ్డే సరఫరా చేస్తున్నారు. పశువులకు పొద్దున్నుంచి గడ్డి, నీరు పెట్టకుండా ఈ ఫుడ్‌లో నీళ్లు కలిపి వాటి ముందు పెడతారు. ఇది తిన్నప్పుడు గేదెలు నరకం అనుభవిస్తాయి. కడుపు మంట, ఉబ్బరం వంటి జబ్బులతో ఇబ్బంది పడతాయి. వాటి ఆయుఃప్రమాణం కూడా తగ్గిపోతుంది’’
 - మురళీధర్‌రెడ్డి, వెటర్నరీ డాక్టర్

 ఆ పాలు పిల్లలకు, గర్భిణిలకు ప్రమాదం..
 ఈ మధ్య కాలంలో ‘మా బాబుకి పాలు పడడం లేదు’ అంటూ చాలామంది తల్లిదండ్రులు మా వద్దకు వస్తున్నారు. పాలు అరగడం లేదని, తాగగానే వాంతులు చేసుకుంటున్నారని, విరేచనాలు పట్టుకున్నాయని చెబుతున్నారు. కారణం.. పిల్లల ఆరోగ్యం కాదు.. పాలు స్వచ్ఛంగా లేకపోవడం. ఆహారంలో పాలది ముఖ్య పాత్ర. పసి పిల్లలకు కాల్షియం కేవలం పాల ద్వారానే వస్తుంది. గేదెలకు కుళ్లిపోయిన ఆహారం పెట్టడంతో దాని ప్రభావం పాలపైనా ఉంటుంది. గేదెల జీర్ణశక్తి దెబ్బడనంతోపాటు ఆ పాలు తాగిన పిల్లల జీర్ణక్రియపైనా ప్రభావం ఉంటుంది. తల్లిదండ్రులు ఇలాంటి పాలను పిల్లలకు వాడకపోవడం ఉత్తమం. ముఖ్యంగా పసిపిల్లలు, గర్భిణిలు తీసుకోకూడదు.
 - సుజాత స్టీఫెన్, న్యూట్రీషియనిస్ట్, హైదరాబాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement