
'ప్రత్యూషకు మరోవారం విశ్రాంతి అవసరం'
ప్రత్యూష కోలుకోవడానికి మరో వారం రోజులు పడుతుందని అవేర్ గ్లోబల్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు.
హైదరాబాద్ : ప్రత్యూష కోర్టుకు హజరయ్యే స్థితిలో లేదని, మరో వారం రోజుల పాటు విశ్రాంతి అవసరమంటూ ఆమెకు చికిత్స చేస్తున్న అవేర్ గ్లోబల్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. వైద్యులు ఈ మేరకు ఆమె ఆరోగ్యంపై సోమవారం ఎల్బీనగర్ పోలీసులకు నివేదిక ఇచ్చారు. వైద్యుల నివేదికను పోలీసులు ఇవాళ హైకోర్టుకు సమర్పించనున్నారు. కాగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాతే హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎదుట ప్రత్యూషను హాజరు పరచనున్నారు.
మరోవైపు నేడు హైకోర్టులో ప్రత్యూష కేసు విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రత్యూష తండ్రి రమేష్తో పాటు ఆమెను కూడా న్యాయస్థానం ఎదుట హాజరు పరచాలని కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే ప్రత్యూష ఆరోగ్యం కుదుటపడాల్సి ఉందని, ఆమెకు మరింత విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు. దీంతో హైకోర్టు ఆదేశాల తర్వాత ప్రత్యూష విషయంలో తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఇక రమేష్ ను ఇవాళ కోర్టులో హాజరుపరచనున్నారు.