సహకార సంఘాల్లో అవినీతి నిజమే
ఏపీ సహకార శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 39 సహకార పరపతి సంఘాలలో రైతులకు, వారి కుటుంబాలకు తెలియకుండా సిబ్బంది రుణాలు తీసుకున్న మాట నిజమేనని సహకార శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అంగీకరించారు. శనివారం శాసనసభలో టీడీపీ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
ఈ అంశంపై చర్చ సందర్భంలో మాట్లాడిన అప్పలనాయుడు, శ్రావణ్‌కుమార్‌లు పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, కడప జిల్లాకు చెందిన గంగిరెడ్డి పేర్లను ప్రస్తావించారు. గంగిరెడ్డితో సంబంధాలున్నాయంటూ తమ నాయకులపై పదేపదే ఆరోపణలు చేయడం పట్ల వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే శ్రీనివాసులు తీవ్ర అభ్యంతరం తెలిపారు.
ఒక్క విశాఖ సిటీయే కాదు మా ఊళ్లూ దెబ్బతిన్నాయి..
హుద్‌హూద్ తుపానుపై మాట్లాడే వారందరూ ఒక్క విశాఖ సిటీనే ప్రస్తావిస్తున్నారని, అరకు, పాడేరు నియోజకవర్గాలలో కూడా మరణించిన వారున్నారని, వారినీ ఆదుకోవాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కోరారు. తుపాను సాయం చాలా చేశామని చెప్పుకుంటున్న ప్రభుత్వం ఈ గిరిజన ప్రాంతాలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. తుపాను పీడిత ప్రాంతాల్లో సహాయ పునరావాస కార్యక్రమాలకు తమ ప్రభుత్వం ఏమేం చర్యలు చేపట్టిందీ, కేంద్రానికి ఎటువంటి ప్రతిపాదనలు పంపిందీ మంత్రి చినరాజప్ప సుదీర్ఘంగా వివరించారు.
మురుగునీళ్లే విజయవాడ ప్రజలతో తాగిస్తున్నాం..
విజయవాడ ప్రజలతో కలుషిత నీరే తాగిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. భూగర్భ మురుగు కాలువల నుంచి వచ్చే నీరు కృష్ణా, ఇతర ప్రధాన కాలువలలోకి విడుదలై, వాటినే దిగువ ప్రాంతాల ప్రజలు తాగుతున్నారని మున్సిపల్ మంత్రి నారాయణ చెప్పారు. ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అడిగిన లిఖిత పూర్వక ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు.
ఐదు జిల్లాల్లో సౌరవిద్యుత్ ఉత్పత్తి: అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో సంప్రదాయేతర ఇంధన వనరులను ప్రోత్సహించనున్నట్టు మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక జవాబిస్తూ.. అనంతపురం జిల్లా ఎస్‌పీ కుంట, కడప జిల్లా గాలివీడు, కర్నూలు జిల్లా పిన్నాపురంలో 2500 మెగావాట్ల సామర్థ్యం ఉన్న విద్యుత్ పార్కులను అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. సౌరవిద్యుత్ విధానాన్ని ప్రకటించనున్నామన్నారు. చర్చలో కదిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా మాట్లాడుతూ.. ఈ పార్కుల కోసం పంట భూముల్ని తీసుకుంటున్నారని ఆరోపించారు.
ఏపీ శాసనసభలో ప్రశ్నోత్తరాలు...
Published Sun, Dec 21 2014 1:33 AM | Last Updated on Sat, Aug 18 2018 5:15 PM
Advertisement