కొలువులపై అసెంబ్లీలో రగడ
అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం
♦ పోస్టుల భర్తీపై మాటతప్పుతున్నారన్న విపక్షాలు
♦ సంఖ్య తగ్గించాల్సిన అవసరం లేదు: ఈటల
♦ స్వల్పకాలిక చర్చకు సిద్ధమని మంత్రి హరీశ్ ప్రకటన
సాక్షి,హైదరాబాద్: ఉద్యోగ ఖాళీల భర్తీ అంశం శనివారం శాసనసభలో వాడివేడి చర్చకు దారితీసింది. విపక్షాలన్నీ ఏకమై ప్రభుత్వ తీరును తప్పుపడుతూ మూకుమ్మడిగా దాడికి దిగాయి. దీన్ని సమర్థంగా తిప్పికొడుతూ ఆర్థికమంత్రి.. ప్రతి విమర్శలకు దిగటంతో ప్రశ్నోత్తరాల సమయం కాస్తా ఆరోపణలు ప్రత్యారోపణలకు వేదికగా మారింది. పరిస్థితి చేయిదాటిపోయేలా కనిపించడంతో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి హరీశ్‌రావు జోక్యం చేసుకుని ఈ అంశంపై స్వల్ప వ్యవధి చర్చకు సిద్ధమని ప్రకటించటంతో గొడవ సద్దుమణిగింది. ఫలితంగా పది ప్రశ్నలతో సాగాల్సిన ప్రశ్నోత్తరాల సమయం మూడు ప్రశ్నలతోనే ముగిసిపోయింది.
ఇది మాట తప్పటమే..
రాష్ట్రంలో లక్ష కంటే ఎక్కువ పోస్టులు ఖాళీగా ఉన్నా వాటి భ ర్తీ ఎందుకు జరగటం లేదంటూ కాంగ్రెస్ సభ్యులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, చిన్నారెడ్డి, సంపత్‌కుమార్, రామ్మోహన్‌రెడ్డి, టీడీపీ సభ్యులు ఆర్.కృష్ణయ్య, సండ్ర వెంకట వీరయ్య ఉదయం ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నించారు. మొత్తం 56,150 ఖాళీలను భర్తీ చేయాల్సిందిగా ప్రభుత్వానికి నివేదికలు అందాయని, అందులో 18,423 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ చేసినట్టు ఆర్థికమంత్రి బదులిచ్చారు. అవసరాన్ని బట్టి ఖజానాపై పడే భారాన్ని దృష్టిలో ఉంచుకుని ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పారు. దీన్ని విపక్షాలు తీవ్రంగా తప్పు పట్టాయి.
ఖాళీ పోస్టుల భర్తీ విషయంలో ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవటం లేదని మండిపడ్డాయి. తెలంగాణ వస్తే ఖాళీలు ఏర్పడతాయని, వాటిని స్థానికులతో భర్తీ చేస్తారని అంతా ఆశించారని, కానీ ఇప్పుడు ఆ నమ్మకం సడలుతోందని ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. లక్షకుపైగా ఖాళీలుంటే 18 వేల పోస్టుల భర్తీ మాత్రమే ఎలా కుదురుతుందని ప్రశ్నించారు. డీఎస్సీ కోసం 5 లక్షల మంది ఎదురుచూస్తున్నా... ప్రభుత్వం ఇదుగోఅదుగో అంటూ కాలయాపన చేస్తోందని, అందులో ఏమైనా ఇబ్బంది ఉంటే యూపీ తరహాలో టెట్ లేకుండా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. మరో సభ్యుడు సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ... రెండు లక్షలకుపైగా ఖాళీలు ఉన్నట్టు అధికారులు చెబుతుంటే 18 వేల పోస్టుల భర్తీ అనటం సరికాదన్నారు. నిరుద్యోగుల ఆవేదన ఆవేశంగా మారి కట్టలు తెంచుకుంటే ప్రభుత్వానికి మంచిది కాదని సంపత్ హెచ్చరించారు. రెండో విడత సమావేశాల్లో మంత్రి ఈటల చెప్పిన లెక్కలకు ఇప్పుడు చెప్పే లెక్కల్లో భారీ తేడా ఉందని, ఖాళీల సంఖ్యను తగ్గించి ఎలా చూపుతారని, ఇది సిగ్గుచేటని కాంగ్రెస్ సభ్యుడు చిన్నారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
లెక్కలు సరిగ్గా చూసుకోండి..
ఖాళీలను తగ్గించి చూపే అవసరం తమకు లేదని, విపక్ష సభ్యులే లెక్కలు సరిగ్గా చూసుకోవాలంటూ మంత్రి ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తాను చెప్పిన సంఖ్యనే ఇప్పుడు సభలో ఉంచానని, తెలంగాణ వచ్చిన తర్వాత 16 వేల పైచిలుకు పోస్టులు సృష్టించిన విషయాన్ని మరవొద్దన్నారు. ప్రభుత్వ, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, ఎన్‌ఎంఆర్, హోమ్‌గార్డులు, అంగన్‌వాడీ వర్కర్లు.. ఇలా అన్నీ కలుపుకొని 4,35,948 మంది ఉద్యోగులున్నారని, 1,07,744 ఖాళీలున్నట్టు తేలిందని చెప్పారు. 56,150 ఖాళీల భర్తీ అవసరమని ఆయా విభాగాల నుంచి ప్రతిపాదనలు అందాయని, వాటిని భర్తీ చేసే క్రమంలో 18,423 పోస్టులకు నోటిఫికేషన్‌లు ఇచ్చినట్టు పేర్కొన్నారు. కమల్‌నాథన్ కమిటీ అధీనంలో ఉన్న గ్రూప్-1 పోస్టుల భర్తీ సమస్య మార్చినెలాఖరుతో పరిష్కారమవుతుందని ఆశిస్తున్నట్టు వివరించారు. మంత్రి సమాధానంతో సంతృప్తి చెందని కాంగ్రెస్, టీడీపీ సభ్యులు.. పోడియం వద్దకు వెళ్లి స్పీకర్‌తో వాదనకు దిగారు. దీంతో మంత్రి హరీశ్ జోక్యం చేసుకుని.. మిగతా ప్రశ్నలకు అవకాశం లేకుండా ఒకే ప్రశ్నపై ఇంత సమయం వృథా చేయటం మిగతా సభ్యుల హక్కులను హరించడమేనన్నారు. సంపూర్ణ సమాధానం ఇవ్వకుండా ప్రశ్నను వదిలేయటం సరికాదని విపక్షాలు పేర్కొనటంతో స్వల్పకాలిక వ్యవధి చర్చకు సిద్ధమని హరీశ్ ప్రకటించడంతో సభ్యులు శాంతించారు.
ఎమ్మెల్యే సీటు ఖాళీ అయితే ఆరు నెలల్లోపు మళ్లీ ఎన్నికలునిర్వహి స్తున్నాం. అదే ఉద్యోగాల ఖాళీలుంటే ఏళ్లుగా ఎందుకు భర్తీ చేయటం లేదు? వాటినీ ఎమ్మెల్యే సీటు తరహాలో నిర్ణీత కాలపరిమితితో భర్తీ చేయాలి. ఆ దిశగా చట్టం రావాలి. మన ఉద్యోగాలు మనకే అన్న నినాదంతోనే యువత ఉద్యమంలో పాల్గొన్నది. ఉద్యోగాలిస్తామని ఎన్నికల్లో టీఆర్‌ఎస్ చెప్పింది. నామమాత్రపు భర్తీతో సరిపెట్టాలని చూడడం వారిని మోసం చేయటమే. - అసెంబ్లీలో విపక్షాల నిలదీత
మోసం చేసిందెవరు? మేం అధికారంలోకి రావటానికి ముందు పాలన వెలగబెట్టింది మీరు కాదా? అప్పుడెందుకు ఖాళీలు భర్తీ చేయలేదు. నిద్రపోతున్న వారిని లేపొచ్చు.. కానీ నటిస్తున్న వారిని లేపలేం. మీ ప్రేమ నిరుద్యోగ యువత సంక్షేమంపై కాదు. రాజకీయం, సీట్లు పెంచుకోవాలనే తాపత్రయం మాత్రమే. మేం చెప్పిందే చేస్తున్నాం.. ఎట్టి పరిస్థితిలోనూ ఖాళీలు భర్తీ చేస్తాం
- ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ జవాబు