ఆప్తురాలిగా వచ్చి.. శిశువు కిడ్నాప్ | Relationship come .. Kidnapped baby | Sakshi
Sakshi News home page

ఆప్తురాలిగా వచ్చి.. శిశువు కిడ్నాప్

Published Mon, Aug 19 2013 1:24 AM | Last Updated on Fri, Sep 1 2017 9:54 PM

ఆప్తురాలిగా వచ్చి.. శిశువు కిడ్నాప్

ఆప్తురాలిగా వచ్చి.. శిశువు కిడ్నాప్

గాంధీ ఆస్పత్రి/తెనాలి రూరల్, న్యూస్‌లైన్: గాంధీ ఆస్పత్రిలో ఒక రోజు వయస్సు న్న శిశువు అపహరణకు గురయ్యాడు. రంగంలోకి దిగిన నార్త్‌జోన్ పోలీసులు సమయస్ఫూర్తి తో వ్యవహరించి ఏడు గంటల్లోనే కేసును ఛేదిం చారు. తెనాలి పోలీసుల సహకారంతో శిశువును రక్షించడంతో పాటు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. చిలకలగూడ ఇన్‌స్పెక్టర్ బి.అంజయ్య కథనం ప్రకారం.. కడప జిల్లాకు చెందిన మనోహర్(37), చిత్తూరు జిల్లా పీలేరుకు చెంది న సుమిత్ర (28) ఐదేళ్ల క్రితం ప్రేమవివాహం చేసుకొని, బోరబండ శ్రీరాంనగర్‌లో ఉంటున్నా రు. గర్భవతి అయిన సుమిత్రను ప్రసవం కోసం శనివారం ఆస్పత్రిలో చేర్చగా, ఉదయం 11.36 గంటలకు మగబిడ్డకు జన్మనిచ్చిం ది. కొద్దిసేపటికి వైద్యు లు తల్లీబిడ్డల్ని పోస్ట్ ఆపరేటివ్ వార్డు యూనిట్-5కు తరలించారు.
 
ఆప్తురాలిగా వచ్చి.. అదును చూసి కిడ్నాప్
 బాలింతైన సుమిత్రకు సపర్యలు చేసేందుకు మహిళలు లేకపోవడం, మనోహర్‌ను వార్డులోకి రానీయక పోవడంతో అనేక ఇబ్బందులు పడ్డారు. ఆ స్థితిలో భార్యను చూసిన మనోహర్ లేబర్‌వార్డు వద్ద రోదిస్తూ కూర్చున్నారు. అటుగా వచ్చిన ఓ మహిళ ‘అన్నా ఎందుకు ఏడుస్తున్నావు’ అంటూ ప్రశ్నించింది. విషయం చెప్పడంతో ‘నేనున్నాను’ అంటూ ఓదార్చి అతని చేతిలోని మందులు తీసుకుని సుమిత్ర వద్దకు వెళ్లిన ఆ మహిళ.. తనపేరు మరియమ్మ అలియాస్ కీర్తి (30) అని, మనోహర్ పంపించాడని పరిచయం చేసుకుంది. పూర్తి నమ్మకం కలిగేందుకు కొన్ని సపర్యలు కూడా చేసింది. వార్డులో కలియతిరుగుతూ హడావుడి చేసింది. శనివారం రాత్రంతా సుమిత్ర, శిశువులతో కలిసి ఉన్న ఆమె.. ఆదివారం తెల్లవారుజామున శిశువును తీసుకుని వైద్యుడికి చూపించి తీసుకువస్తానంటూ వెళ్లింది. ఎంతకీ తిరిగి రాకపోవడంతో సుమిత్ర విషయం భర్తకు చెప్పింది. ఆస్పత్రి మొత్తం గాలించినా ఫలితం లేకపోవడంతో మనోహర్ అక్కడి పోలీసు ఔట్‌పోస్టు సిబ్బందికి ఫిర్యాదు చేశాడు. వారి సాయంతో 8.30 గంటలకు చిలకలగూడ ఠాణాకు చేరుకుని ఇన్‌స్పెక్టర్ అంజయ్యను కలిశారు.

 సమయస్ఫూర్తితో..
 మనోహర్ నుంచి నిందితురాలి వివరాలను సేకరించిన పోలీసులు.. ఇది కచ్చితంగా బయటి వారి పనేనని నిర్ధారణకు వచ్చారు. కిడ్నాప్ తర్వాత నగరం నుంచి పారిపోతారని అంచనాకు వచ్చిన పోలీసులు నార్త్‌జోన్ డీసీపీ జయలక్ష్మికి విషయం తెలిపారు. ఆమె ఆదేశాలతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అన్ని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లకు పంపారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకున్న ఇన్‌స్పెక్టర్ అంజయ్య, ఎస్సై వీరబాబు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫుటేజ్‌ను పరిశీలించగా, కీలక ఆధారాలు లభించాయి. ఉదయం 6.19 గంటలకు ఓ మహిళ శిశువును ఎత్తుకొని స్టేషన్‌లోకి ప్రవేశించగా, వెనుక మరో వ్యక్తి టికెట్లతో వచ్చాడు. శిశువుతో ఉన్న మహిళను మనోహర్ గుర్తించాడు. వారిద్దరు 6.27కు రెండో నెంబర్ ప్లాట్‌ఫాం పైకి వచ్చినట్లు రికార్డు అయింది. అ ప్లాట్‌ఫామ్ నుంచి 7.10 గంటలకు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ వెళ్లడంతో నిందితులు అదే ఎక్కి ఉంటారని అనుమానించారు.
 
తక్షణమే స్పందించిన తెనాలి డీఎస్పీ..
 రైలు తెనాలి మీదుగా వెళ్తోందని గుర్తించిన చిల కలగూడ పోలీసులు తెనాలి డీఎస్పీ వై.తులసీరామ్‌ప్రసాద్‌ను సంప్రదించి, విషయం వివరిం చారు. గతంలో నగరంలో సుదీర్ఘ కాలం పని చేసిన ప్రసాద్ తక్షణమే స్పందించి, తెనాలి త్రీ టౌన్‌తో పాటు ఆర్పీఎఫ్, జీఆర్పీలను అప్రమత్తం చేసి మొత్తం 30 మందిని ప్లాట్‌ఫాంకు ఇరువైపులా మోహరించారు. మధ్యాహ్నం 1.30కు రైలు తెనాలికి చేరుకోగానే అనువణువూ తనిఖీ చేశారు. డీ-1 బోగీలో ఉన్న నిందితులను గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని శిశువును రెస్క్యూ చేశారు. నిందితులైన కత్తిమండ్ల మేరీ (23), పంబా నవీన్ (18)లను త్రీ టౌన్ ఠాణాకు, శిశువును ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. నిందితులది పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుగా తేలింది. నవీన్... మేరీ అక్క కుమారుడు. వీరు గతంలోనూ ఇలాంటి నేరాలు చేసినట్లు సమాచారం.

అస్వస్థతకు గురైన శిశువును మెరుగైన వైద్యమందించేందుకు గుంటూ రు జిల్లా ఆస్పత్రికి తరలించాలని వైద్యశాఖ ముఖ్యకార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదేశించా రు. 1.9 కిలోల బరువున్న శిశువును అంబులెన్స్‌లో తేవడం ప్రమాదకరమని, తల్లినే గుంటూ రు తరలించాలని భావించారు. అయితే బాలిం తకు రక్తస్రావం ఎక్కువ కావడంతో సోమవా రం గుంటూరు తీసుకువెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నిందితుల కోసం ప్రత్యేక బృందం బయల్దేరి వెళ్లింది. కాగా, మేరీ రెండ్రోజులుగా ఆస్పత్రి పరిసరాల్లో తిరుగుతూ శిశువును విక్రయిస్తారా? అంటూ సెక్యూరిటీ సిబ్బందిని వాకబు చేసినట్లు తెలిసింది. వారు అక్కడి నుంచి వెళ్లగొట్టగా, ఆప్తురాలిగా నటించి  బాబుతో ఉడాయించినట్లు సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement