‘రెవెన్యూ’ సమస్యలు పరిష్కరించండి
ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్
సాక్షి, హైదరాబాద్: రెవెన్యూశాఖ ఉద్యోగుల సమస్యలను పరిష్కారించాలని కోరుతూ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంజీ గోపాల్‌కు ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ నేతృత్వంలో తెలంగాణ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ అసోసియేషన్ బృందం గురువారం వినతి పత్రం సమర్పిం చింది. అనంతరం సచివాలయం మీడియా పాయింట్‌లో ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. రెవెన్యూ ఉద్యోగులు 67 రకాల విధులు నిర్వహిస్తున్నా సంక్షేమ పథ కాల అమలులో స్వార్థ రాజకీయాలకు, అసాంఘిక శక్తుల దాడులకు బలైపోతూ ఆర్థికంగా, మానసికంగా అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
గత 8 ఏళ్లుగా పని చేస్తున్న వీఆర్‌వోలకు పదోన్నతి, ప్రభుత్వ ఖర్చుతో ద్విచక్ర వాహనాలు మంజూరు చేయాలని కోరారు. కొత్త జిల్లా కలెక్టర్‌కు కార్యాలయాలను నిర్మించి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు గోల్కొండ సతీశ్, ప్రధాన కార్యదర్శి పి.రాజేశ్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు కాందారి బిక్షపతి, ఉపాధ్యక్షుడు ఎస్‌కే మౌలానా, కోశాధికారి రమేశ్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు, వీఆర్‌ఏల అధ్యక్షుడు రమేశ్ తదితరులు పాల్గొన్నారు.