
అక్టోబర్ 6 నుంచి బడ్జెట్ సమావేశాలు!
వచ్చే నెల 6 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. బడ్జెట్ సమావేశాల నిర్వహణపై మంగళవారం ఆర్థిక శాఖ అధికారులతో సీఎం కేసీఆర్ సమావేశమై చర్చించారు.
* ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సీఎం చర్చ
* దసరా తర్వాతే అసెంబ్లీ సమావేశాలకు నిర్ణయం
* అక్టోబర్‌లోనే క్షేత్ర స్థాయిలో సంక్షేమ పథకాల అమలు
* మరో రెండు నెలల బడ్జెట్ కోసం రూ. 13,257 కోట్లు
* కేబినెట్ ఆమోదం తర్వాత గవర్నర్‌కు ఫైలు
* విభజన చట్టంలోని వెసులుబాటును వినియోగించుకుంటున్న సర్కారు
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల 6 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. బడ్జెట్ సమావేశాల నిర్వహణపై మంగళవారం ఆర్థిక శాఖ అధికారులతో సీఎం కేసీఆర్ సమావేశమై చర్చించారు. అనంతరం ఈ మేరకు నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. నిజానికి ఈ నెల 10వ తేదీ నుంచే సమావేశాలు నిర్వహించాలని గతంలో భావించినప్పటికీ.. మెదక్ లోక్‌సభకు ఉప ఎన్నిక, బడ్జెట్ రూపకల్పనలో టాస్క్‌ఫోర్స్ కమిటీల సిఫారసులను పరిగణనలోకి తీసుకోవాలన్న నిర్ణయంతో అసెంబ్లీ భేటీని వాయిదా వేయాల్సి వచ్చింది.
ఇదే విషయాన్ని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌కు సీఎం వివరించిన సంగతి తెలిసిందే. ఈ నెల చివరి వారంలో లేదా అక్టోబర్ మొదటి వారంలో సమావేశాలు నిర్వహించేందుకు ఇప్పటికే గవర్నర్ అనుమతి తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే సచివాలయంలో ఆర్థిక శాఖతో పాటు ఇతర శాఖల ఉన్నతాధికారులతో కేసీఆర్ తాజాగా సమావేశం నిర్వహించారు. అక్టోబర్ రెండున గాంధీ జయంతి, మూడో తేదీన విజయదశమి, తర్వాతి రెండు రోజులు వారాంతం(శని, ఆది) కావడంతో సోమవారం(అక్టోబర్ 6) నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభించాలన్న అభిప్రాయం ఈ సందర్భంగా వ్యక్తమైనట్లు సమాచారం. అక్టోబర్ చివరి వరకు ఈ సమావేశాలు కొనసాగునున్నట్లు తెలిసింది. ఈ సమయంలోనే అన్ని రకాల సంక్షేమ పథకాలను క్షేత్ర స్థాయిలో ప్రజలకు అందించే విధంగా ఇదివరకే ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. దీంతో బడ్జెట్ సమావేశాలనూ అక్టోబర్ తొలివారంలోనే ప్రారంభించాలని సర్కారు భావిస్తోందన్న వాదన కూడా వినిపిస్తోంది.
మరో రెండు నెలలకు బడ్జెట్
రాష్ర్ట విభజన తర్వాత ఈ నెలాఖరు వరకు మాత్రమే బడ్జెట్ వినియోగించుకోవడానికి గవర్నర్ గతంలో ఆమోదం తెలిపారు. అయితే అసెంబ్లీ సమావేశాలతో సంబంధం లేకుండా ఆరు నెలల బడ్జెట్‌కు గవర్నర్ అనుమతించవచ్చని రాష్ట్ర విభజన చట్టంలోనే స్పష్టంగా ఉన్నందున.. అక్టోబర్, నవంబర్ మాసాలకు కావాల్సిన బడ్జెట్‌ను కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. ప్రతి నెలా దాదాపు రూ. 6,500 కోట్ల మేర అవసరమన్న అంచనాతో జూన్-సెప్టెంబర్(4 నెలలు) కాలానికి రూ. 26,514 కోట్ల వ్యయానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ నుంచి గవర్నర్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. దీనిఆధారంగానే తాజాగా అక్టోబర్, నవంబర్ నెలలకు రూ. 13,257 కోట్ల బడ్జెట్‌ను అనుమతించేలా గవర్నర్‌ను రాష్ట్ర మంత్రి మండలి కోరనుంది. ఆర్థిక శాఖ ఇప్పటికే సంబంధిత ఫైలును మంత్రి మండలి అనుమతి కోసం పంపించినట్లు సమాచారం. ఈలోగా సాధారణ బడ్జెట్ ఆమోదం పొందితే ఆ మొత్తాన్ని కూడా అందులోకే మార్చనున్నారు.
ఖరీఫ్ రుణాలు మాత్రమే రీషెడ్యూల్
రిజర్వ్‌బ్యాంక్ అనుమతినిచ్చిన మూడు జిల్లాల్లో కేవలం ఖరీఫ్‌లో తీసుకున్న రుణాలకు మాత్రమే రీషెడ్యూల్ వర్తిస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. దీనివల్ల కనిష్ఠంగా వెయ్యి కోట్లు, గరిష్ఠంగా రూ. 1,500 కోట్లు మాత్రమే రీ షెడ్యూల్ అవుతాయని తాజా సమాచారం. సోమవారం జరిగిన ఉన్నత స్థాయి కమిటీ సమావేశంలో రూ. 4,000 కోట్లుగా బ్యాంకు అధికారులు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే అన్ని రకాల రుణాలను కలిపితే అంత మొత్తం ఉంటుందని తర్వాత స్పష్టమైనట్లు అధికార వర్గాలు వివరించాయి.