యువ హవా
కలిసికట్టుగా అడుగేస్తే పిడుగులు కురవాల్సిందే.. పిలుపునిస్తే దిక్కులైనా పిక్కటిల్లాల్సిందే. వెయ్యి వోల్టుల చైతన్యం.. కొండనైనా ఢీకొట్టే ధైర్యం.. తమ భవితనే కాదు సమాజగతినీ మార్చగల సత్తా.. పంతం పడితే అంతం చూడగల నైజం యువత సొంతం. చదువుల్లో ఫస్ట్.. ఆటపాటల్లో బెస్ట్.. కెరీర్‌లో నంబర్‌వన్.. సంచలనాలు సృష్టించడంలో సూపర్‌స్టార్లు.. అంతటా యువతరంగమే. ఓటు అనే వజ్రాయుధంతో ప్రభంజనం సృష్టించడానికి యువత సిద్ధమవుతోంది. ఎన్నికల వేళ వారి చూపుడు వేలు సూదంటురాయి!.
హైదరాబాద్ జిల్లాలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో యువ ఓటే కీలకం కానుంది. వీరు నొక్కే ‘మీట’.. నే‘తలరాత’ను మార్చనుంది. నిన్నా మొన్నటి వరకు రాజకీయాలంటే నిర్లిప్తత చూపిన యువత నేడు తమ భవిష్యత్తును తామే తీర్చిదిద్దుకుంటామంటోంది. చదువు, కెరీర్ లేదా ఎంచుకున్న రంగంలోనే ప్రతిభ చూపితే సరిపోదని.. అందుకు పట్టం కట్టే వ్యవస్థనూ తానే సృష్టించుకోవడానికి సిద్ధమవుతోంది.హైదరాబాద్ జిల్లాలో యువతరం ఓటు పోటెత్తనుంది. జిల్లా మొత్తంగా 18-39 ఏళ్ల మధ్య వయసు వారు దాదాపు 61 శాతం ఉన్నారు. నియోజకవర్గాల వారీగా చూసినా వీరి హవానే స్పష్టంగా కనిపిస్తోంది. జిల్లాలోని మొత్తం 35,98,152 మంది ఓటర్లలో 40 ఏళ్ల లోపువారే 22,12,573 మంది ఉన్నారు. ఇది 61 శాతం. అంటే జిల్లాలో అభ్యర్థుల గెలుపోటముల నిర్ణాయక శక్తి వీరిదే. వీరిలో తాజా ఎన్నికల్లో ఓటు హక్కు పొందిన 18-19 ఏళ్ల మధ్య వారు 89,441 మంది ఉన్నారు. మొత్తం ఓటర్లలో వీరు 2.48 శాతం. గత ఎన్నికల వరకు 40 ఏళ్లలోపు ఓటర్లు 50 శాతం కూడా ఉండేవారు కాదని ఎన్నికల పరిశీలకులు చెబుతున్నారు.
ఈసారి వీరి సంఖ్య అనూహ్యంగా 61 శాతానికి చేరడం విశేషం. ప్రస్తుత రాజకీయాలు, చోటుచేసుకుంటున్న పరిణామాలు, పతనమవుతున్న విలువలు.. ఈ పరిస్థితుల్లో వ్యవస్థను చక్కదిద్దడానికి ఓటే ఆయుధమని యువ ఓటర్లు భావిస్తుండటం శుభపరిణామమని సామాజికవేత్తలు చెబుతున్నారు. ‘ఓటు’పై ఇటీవల జరిగిన విస్తృత ప్రచారం, ఆన్‌లైన్‌లోనూ ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం రావడంతో కార్యాలయాల దాకా వెళ్లనవసరం లేకుండా ఇంటి నుంచో, ఆఫీసు నుంచో దరఖాస్తు చేసుకునేందుకు ఎక్కువ మంది మొగ్గుచూపారు. మొత్తానికి ఈ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటముల్లో యువత ఓటే కీలకం కానుంది. తన నిర్ణాయక శక్తితో సత్తా చూపనుంది.
వీరి ఓట్లే ‘కీ’లకం: హైదరాబాద్ జిల్లాలో యువ ఓటర్లే నిర్ణాయక శక్తి అనడానికి తిరుగులేని నిదర్శనమిది. ఏ నియోజకవర్గంలో చూసినా 50 శాతానికి పైగా 18-39 ఏళ్ల యువ ఓటర్లే ఉన్నారు. వీరెటు మొగ్గు చూపితే అటే ఫలితం ఉంటుందనడంలో సందేహం లేదు. నియోజకవర్గాల వారీగా మొత్తం ఓటర్లలో అత్యధికంగా యువ ఓటర్లున్న వారిలో చాంద్రాయణగుట్ట ప్రథమ స్థానంలో (66.60 శాతం) ఉండగా, రెండో స్థానంలో బహదూర్‌పురా (66.17శాతం), మూడో స్థానంలో కార్వాన్ (65.41 శాతం) ఉన్నాయి. తరువాత స్థానాల్లో జూబ్లీహిల్స్, గోషామహల్ ఉన్నాయి.