
అధికారం నిలుపుకొనేందుకే ఫిరాయింపులు
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు పిన్నెళ్లి, దాడిశెట్టి, విశ్వేశ్వరరెడ్డి ధ్వజం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అధికారాన్ని నిలబెట్టుకునేం దుకే టీడీపీ ప్రభుత్వం ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విప్ పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. పార్టీ ఫిరాయించిన పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పనపై శుక్రవారం ఎమ్మె ల్యేలు దాడిశెట్టి రాజా, విశ్వేశ్వరరెడ్డిలతో కలిసి అసెంబ్లీ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. కల్పనపై తక్షణమే అనర్హత వేటు వేయాలని కోరారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద పిన్నెళ్లి విలేకరులతో మాట్లాడారు. తమ పార్టీ(వైఎస్సార్‌సీపీ) గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలను టీడీపీ ప్రలోభ పెట్టి, అనధికారంగా చేర్చుకోవడం దారుణమన్నారు.
తెలంగాణలో ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన సీఎం చంద్రబాబు అదే పద్ధతిలో ఏపీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కొంటూ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. అసెంబ్లీ సమావేశా లను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కనీసం అసెంబ్లీ సమావేశాలను కూడా ఏర్పాటు చేయలేని స్థితిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారని ఎమ్మెల్యే దాడిశెట్టి రామలింగేశ్వరరావు(రాజా) ఎద్దేవా చేశారు. ఓటుకు కోట్లు కేసుకు భయపడి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని విమర్శించారు. తెలంగాణలో అనైతికమన్న పార్టీ ఫిరాయింపులను చంద్రబాబు సిగ్గువిడిచి ఏపీలో ప్రోత్సహిస్తున్నారని ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి దుయ్యబట్టారు. చంద్రబాబుకు ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై ఏమాత్రం గౌరవం లేదని విమర్శించారు.