వయసు వంద..పనిగంటలు 11
న్యూయార్క్: ఎక్కువ పని చేసి అలసిపోయామని .. బద్దకంగా ఫీల్ అవుతున్నారా.. వయసు మీద పడుతోందని ఆలోచనలో పడ్డారా....అయితే ఈ బామ్మ స్టోరీ చదవండి....దెబ్బకు బద్దకం పారిపోయి.. ఉత్సాహం ఉరకలేస్తుంది. అవును ..నూరేళ్ల నిండు యవ్వనంతో తొణికిసలాడుతూ , బోసి నవ్వులతో తన చేస్తున్న పని గురించి చెబుతుంటే ఎవరికైనా ఔరా అనిపించకమానదు.
ముదురు, లేత నీలి రంగు దుస్తుల్లో చిరునవ్వులు చిందిస్తూ చలాకీగా కనిపిస్తున్న ఈ బామ్మ పేరు ఫెలిమినా రొటుండో.. వయసు అక్షరాలా 100 ఏళ్లు. బఫాలోని ఓ కళాశాలకు చెందిన లాండ్రీ షాపులో పని చేస్తుంది. పని అంటే అలా ఇలా కాదు..రోజుకు పదకొండు గంటలు నిర్విరామంగా పని చేస్తుంది. వారంలో ఆరు రోజులు అలుపెరగకుండా శ్రమిస్తుంది. బట్టలు ఉతకడం, డ్రై క్లీనింగ్ లాంటి పనులు చకచకా అలవోకంగా చేసేస్తుంది. ఉదయం ఏడు గంటలకు మొదలైన పని సాయంత్రం ఆరుగంటలకు ముగుస్తుంది.
అతి బాధాకరమైన పరిస్థితుల్లో పదిహేనేళ్ల వయసులోనే ఉద్యోగంలో చేరిన ఫెలిమినా అప్పటినుంచీ పని చేస్తూనే ఉందట. తన ఉద్దేశం ప్రకారం రిటైర్ మెంట్ వయసు 75 ఏళ్లని చెబుతోంది. అది కూడా ఏదైనా అనారోగ్య పరిస్థితుల్లో మాత్రమే అంటోంది. అంతేకాదు..చాలా మంది తొందరగా రిటైర్ అయిపోతారు. కానీ నేను అలాకాదు. ఈ వయసులో చేయాల్సింది ఇంకా ఉందని సెంచరీ కొట్టిన ఈ బామ్మ ఉత్సాహంగా చెబుతోంది. అంతేకాకుండా బయటకు రండి ఆరోగ్యం సహకరించినంతకాలం సంతోషంగా పనిచేస్తూనే ఉండండి అంటూ.. వృద్దాప్యంలో ఉన్నతన లాంటి వాళ్లకు సలహా ఇస్తోంది ఈ బామ్మ. తాను అలాగే ఉంటానని ధీమాగా చెబుతోంది.