
రికార్డు సృష్టించిన క్రిస్మస్ ట్రీ
కళాకారుడి సృజనకు, కష్టానికి మరోసారి ఫలితం దక్కింది. క్రిస్మస్ వేడుకల్లో భాగంగా ఏర్పాటుచేసిన ట్రీ ప్రపంచ రికార్డును నెలకొల్పింది. కాన్బెర్రా డౌన్ టౌన్‌లో నక్షత్రాల్లా మెరిసిపోయే లక్షల కొద్దీ లైట్లతో వెలిగిపోతున్న రిచర్డ్స్ రూపకల్పన గిన్నిస్ పుటలకెక్కింది. ఆస్ట్రేలియాకు చెందిన డేవిడ్ రిచర్డ్స్ సంవత్సరాల కృషి.. ప్రత్యేక గుర్తింపు పొందడంతోపాటు.. అతడు మూడోసారి రికార్డును సాధించేలా చేసింది. జపాన్ యూనివర్సల్ స్టూడియో ఐదేళ్లుగా ఒకాసాలో నిర్వహిస్తున్న ప్రదర్శనల్లో అత్యధిక లైట్లను ఏర్పాటుచేసి, ఆకట్టుకున్న కృత్రిమ చెట్టు.. ప్రపంచ రికార్డు నెలకొల్పింది. 118 అడుగుల ఎత్తు, సుమారు 3.75 లక్షల లైట్లతో మిరుమిట్లు గొల్పుతూ కొత్త ప్రమాణాలతో జపనీస్ ట్రీ... గిన్నిస్ పుస్తకంలో స్థానం సంపాదించింది.
కాన్బెర్రా కు చెందిన న్యాయవాది, వ్యాపారవేత్త, రిచర్డ్స్... కొందరు ఇంజనీర్లతోపాటు, కార్పెంటర్, వెల్డర్ల వంటి సహాయక బృందంతో ఏర్పాటుచేసిన మిరుమిట్లు గొలిపే క్ర్మిస్మస్ ట్రీ ప్రదర్శన ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. కాన్బెర్రాకు చెందిన సడన్ ఇన్ఫాంట్ డెత్ సిండ్రోమ్ స్వచ్ఛంద సంస్థకు.. పిల్లలకు సాయం అందించేందుకు విరాళాలను ఆహ్వానిస్తూ ఈ ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. రిచర్డ్స్ 2013 లో మొదటిసారి తన సబర్బన్ హోమ్ ను 5 లక్షలకు పైగా బల్పులు లైట్లతో అలంకరించి గిన్నిస్ వరల్డ్ రికార్డును నెలకొల్పాడు. నాలుగు వారాలకు పైగా ప్రదర్శన నిర్వహించడంతో అప్పట్లో సుమారు 75 వేలమంది పైగా ఈ ప్రదర్శనను తిలకించారు. వచ్చే పోయే వారితో ఇరుగు పొరుగులతో సహా ఇంట్లోని వారూ విసిగిపోయారు. దీంతో ఇంకెప్పుడూ రికార్డు కోసం ఇటువంటి ప్రయత్నం చేయనని రిచర్డ్స్ హామీ ఇచ్చాడు.
ఏడాది క్రితం రిచర్డ్స్ ఓ బహిరంగ ప్రదేశంలో 10 లక్షలకు పైగా ఎల్ఈడీ లైట్లను సెట్ చేసి తన రెండో గిన్నిస్ రికార్డును సాధించాడు. అప్పట్లో 120 కిలోమీటర్ల రంగురంగుల వైర్లను కాన్బెర్రా మాల్ లోని క్రిస్మస్ బహుమతులకు చుట్టి అతిపెద్ద ఎల్ఈడీ లైట్ల చిత్రాన్ని రూపొందించాడు. అయితే పోటీ ప్రపంచంలో రికార్డులు సాధించడం అంత సులభం కాదనేందుకు నిదర్శనంగా 2014 లో రిచర్డ్స్.. మ్యోకో హోటల్ వద్ద ఏర్పాటు చేసిన డ్రాగన్ లైట్ల ప్రదర్శనలో ఫెయిలయ్యాడు. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా తిరిగి ఈసారి అతి పెద్ద కృత్రిమ క్రిస్మస్ ట్రీ కి అత్యధిక లైట్లను అలంకరించి 2012లో న్యూయార్క్ కుటుంబం సాధించిన గిన్నిస్ రికార్డును తిరగరాశాడు.