మేయర్గా పిల్లి!
కనీవినీ ఎరుగని రీతిలో జరిగిన ఎన్నిక.. ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. రష్యా.. బార్నౌల్ నగరంలో జరిగిన మేయర్ ఎన్నికల్లో మార్జాలం పోటీచేయడమే వింతనుకుంటే.. ఏకంగా అత్యధిక మెజారిటీతో విజయం సాధించడం ప్రపంచాన్ని ఆకర్షించిన వార్తయింది.
అసలు పిల్లేంటి? ఎన్నికల్లో పోటీ చేయడం ఏమిటి? అని ఆరాతీస్తే.. ప్రపంచ వ్యాప్తంగా రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న అవినీతిని అరికట్టాలనే ఆలోచనను ప్రాక్టికల్ గా అమలుచేస్తూ స్థానిక ప్రజలు బార్సిక్ అనే పిల్లిని స్థానికులు మేయర్ గా పోటీలోకి దింపారు. సాధారణ ఎన్నికల్లో జంతువులు పోటీచేయకూడదనే నిబంధన ఉంది కాబట్టి ఆన్ లైన్ లో ఎన్నికలు నిర్వహించారు. నిజం ఎన్నికలను మైమరపించేలా ప్రచారకార్యక్రమాన్ని నిర్వహించారు. నిజం ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులకంటే మెరుగైన ప్రజాసేవ చేస్తానన్న పిల్లిగారి వాగ్ధానాన్ని ఓటర్లు నమ్మారు. దీంతో తొంభై శాతం ఓట్టను కైవసం చేసుకుని బార్సిక్ ముందువరుసలో నిలిచింది.
రష్యన్ సోషల్ మీడియా వెబ్సైట్ (Vkontakte) ద్వారా టికెట్ పొందిన తర్వాత సియమీస్ పిల్లి బార్సిక్.. మేయర్ ఎన్నికల్లో అనేకమంది ఓటర్ల హృదయాలను దోచేసింది. కొత్త మేయర్ ను ఎన్నుకునే సందర్భంలో.. ఆన్లైన్లో జరిగిన పోలింగ్ లో అరుగురు అభ్యర్థులపై పోటీ చేసిన పిల్లి విజయపథంలో దూసుకుపోయింది. స్థానిక ఇంటర్నెట్ గ్రూప్ ద్వారా పోస్ట్ చేసిన పిల్లి.. అభ్యర్థుల జాబితాలో స్థానం సంపాదించింది. అంతేకాదు జనం కూడ ఆ నాలుగుకాళ్ళ అభ్యర్థిని ఆనందంగా ఓట్లేసి గెలిపించేయడం అక్కడ ప్రత్యేకత సంతరించుకుంది.
ఓపక్క ఆన్లైన్లో 'గో బార్సిక్'... 'బార్సిక్ రూల్స్' అన్న నినాదాలతో ఓటర్లంతా పలికిన మద్దతుకు రష్యన్ సోషల్ మీడియా నిండిపోయింది. "పోటీ చేసిన అభ్యర్థులకంటే పిల్లే బాగా నిజాయితీగా పనిచేస్తుందని ఓటర్లు నమ్మారు అందుకే దాన్ని గెలిపించారు" అంటూ అలెగ్జాండర్ రెషెత్నికోవ్ పేరున ఓ యూజర్ కూడ ఈ సందర్భాన్ని విమర్శనాత్మకంగా వ్యాఖ్యానించారు. అయితే ఇంతకు ముందు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఇగోర్ సావింట్నేవ్ ను తొలగించిన తర్వాత... ప్రస్తుతం పీటర్ ఫ్రైసన్ ఈ నగర బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే ఇకపై పిల్లి స్థానంలో మేయర్ బాధ్యతలను ఎవరు స్వీకరిస్తారు అన్న విషయంలో మాత్రం క్లారిటీ రాలేదు. పిల్లిని సపోర్ట్ చేసిన ఓటర్లే ఆ విషయం నిర్ణయిస్తారని అంతా ఎదురు చూస్తున్నారు.