మాతో పెట్టుకోవాలంటే అమెరికాకు కూడా భయం!
మాతో పెట్టుకోవాలంటే అమెరికాకు కూడా భయం!
Published Fri, Dec 23 2016 8:29 AM | Last Updated on Sat, Aug 25 2018 7:50 PM
దలైలామా కార్డును ఉపయోగించడం భారతదేశానికి అంత మంచిది కాదని చైనా అధికారిక మీడియా హెచ్చరించింది. చైనాతో పెట్టుకోవాలంటే అమెరికా కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచించిన విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలిపింది. చైనా విధానాలను వ్యతిరేకించిన డోనాల్డ్ ట్రంప్ విషయంలో తాము ఎలా వ్యవహరించామో చూసి పాఠాలు నేర్చుకోవాలని, 'చెడిపోయిన పిల్లవాడి'లా ప్రవర్తించడం మానుకోవాలని తెలిపింది. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అనే కిరీటం చూసుకుని ఒక్కోసారి భారతదేశం చెడిపోయిన పిల్లాడిలా ప్రవర్తిస్తుందని, గొప్ప దేశంగా రూపొందే అవకాశం ఉన్నా.. ఆ దేశానికి దూరదృష్టి కొరవడిందని అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్‌లో రాసిన కథనంలో పేర్కొన్నారు.
తైవాన్ విషయంలో ట్రంప్ -చైనాల మధ్య ఏం జరిగిందో తెలుసుకోవాలన్నారు. తైవాన్ అద్యక్షుడికి ట్రంప్ ఫోన్ చేయడంపై చైనా నిరసన వ్యక్తం చేయడం, ఆయన వన్-చైనా విధానాన్ని ప్రశ్నించడం లాంటి చర్యలన్నింటినీ కూడా ఆ కథనంలో ప్రస్తావించారు. ఇక వివాదాస్పదమైన దక్షిణ చైనా సముద్రంలో ప్రవేశించిన అమెరికన్ అండర్ వాటర్ డ్రోన్‌ను చైనా స్వాధీనం చేసుకుని, దాన్ని పరిశీలించిన తర్వాత తిరిగి ఇవ్వడాన్ని కూడా చెప్పారు.
సున్నితమైన విషయాలలో తమతో పెట్టుకోవాలంటే అమెరికా కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తుందని, అలాంటప్పుడు తాము ఎలాగోలా నెగ్గుకు రాగలమని భారతదేశానికి అంత విశ్వాసం ఎక్కడినుంచి వచ్చిందని ఆ కథనంలో ప్రశ్నించారు. మంగోలియాకు భారతదేశం వంద కోట్ల డాలర్ల సాయం ప్రకటించడాన్ని ప్రస్తావిస్తూ.. ఆ దేశం మీద చైనా ఆంక్షలు విధించిందని తెలిపారు. చైనా వద్దన్నా సరే దలైలామాకు ఆశ్రయం ఇవ్వడంతో ఆ ఆంక్షలు విధించారు. చైనా విధించిన ఆంక్షల నుంచి బయటపడేందుకు వీలుగా తమకు సాయం చేయాలని భారతదేశంలో మంగోలియా రాయబారి కోరారు. దాంతో భారత్ సాయం చేసింది. అయితే, దలైలామాను తాము ఇక మీదట ఎప్పుడూ ఆహ్వానించబోమని మంగోలియా ప్రభుత్వం స్పష్టం చేసింది.
Advertisement