'ఎంత ప్రాధేయ పడినా విడిచిపెట్టలేదు'
బీజింగ్: హోం వర్క్ చేయలేదని తన కుమారుడిని కొట్టిందని చైనాలోని ఓ కోర్టు ఓ తల్లికి జైలు శిక్ష విధించింది. ఆమె ఎంత ప్రాధేయపడినా వినకుండా ఆరు నెలల జైలు శిక్ష విధించింది. నాంజింగ్ పట్టణానికి చెందిన 'లీ' అనే మహిళ అనూయి ప్రావిన్స్లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన బాలుడిని దత్తతకు తీసుకుంది. ఆ పిల్లాడు గ్రామంలో ఉంటే సరిగా విద్య దొరకదని ఆ బాలుడి తల్లిదండ్రులు కూడా అతడిని బంధువైన లీకి దత్తతకు ఇచ్చారు. అయితే, గత ఏప్రిల్ నెలలో ఆమె ఆ తొమ్మిదేళ్ల పిల్లాడు హోం వర్క్ చేయలేదని చావు దెబ్బలు కొట్టింది. తాడుతో కట్టేసి మరి కొట్టింది.
దీంతో అతడి ఒళ్లంత పుండ్లమయం కావడంతోపాటు చర్మమంతా రక్తపు చారికలతో భయంకరంగా మారింది. దీనికి సంబంధించిన ఫొటోలు ఇంటర్నెట్లో హల్ చల్ చేసి స్థానికుల ఆగ్రహానికి కారణమయ్యాయి. ఈ కేసును టేకప్ చేసిన పోలీసులు చాలా రోజులపాటు విచారణ జరిపి కోర్టులో ప్రవేశ పెట్టగా ఆమెకు కోర్టు ఆరు నెలల శిక్ష విధించింది. ఈ శిక్ష వేసే సమయంలో ఆ అబ్బాయి అసలు తల్లిదండ్రులు, లీ, కుమారుడు ఎంత బ్రతిమాలినా కోర్టు వారి మాటలు పట్టించుకోలేదు. తనకు తన కుమారుడు అంటే ఎంతో ఇష్టమని, అతడిని క్రమ శిక్షణ పెట్టేందుకే అలా కొట్టాను తప్ప గాయపరచాలనే ఉద్దేశంతో కాదని లీ వాపోయింది. అయినా ఆమె విన్నపాన్ని తోసిపుచ్చిన కోర్టు శిక్ష ఖరారు చేసింది.