
కొలంబియా వైమానిక దళానికి చెందిన ఇద్దరు సైనికులు అద్భుత విన్యాసం చేస్తూ దురదృష్టవశాత్తు అకాల మరణం పొందారు. సంప్రదాయబద్ధమైన మెడిలిన్ పుష్ప ప్రదర్శన ముగింపు సందర్భంగా ఆదివారం జరిగిన హెలికాప్టర్ ప్రదర్శనలో ఇరువురు సైనికులు ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చింది. ఈ సంఘటనపై దర్యాప్తునకు ఆదేశిస్తున్నామని కొలంబియా రక్షణ శాఖ ప్రకటించింది. పుష్ప ప్రదర్శనను పురస్కరించుకుని హెలికాప్టర్ నుంచి వేలాడుతున్న కేబుల్ చివరన జాతీయ జెండాను కట్టారు. ఆ జెండా రెపరెపలాడే విధంగా పై కొసన ఒక సైనికుడు, కింది కొసన ఓ సైనికుడు జాతీయ జెండాను కలిపి పట్టుకొని వేలాడుతుండగా, హెలికాప్టర్ స్థానిక ఓలయ విమానాశ్రయానికి వచ్చింది. వారు అక్కడ దిగాల్సిన సమయంలో హెలికాప్టర్ నుంచి వేలాడుతున్న కేబుల్ తెగిపోయింది. దాంతో ఇద్దరు సైనికులు నేలను ఢీకొని అక్కడికక్కడే చనిపోయారు. దీంతో బంబేలెత్తిన అధికారులు వెంటనే విమానాశ్రయాన్ని మూసివేశారు.
మెడిలిన్‌లో ప్రతిఏట జరిగే పుష్ప ప్రదర్శనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ ప్రదర్శనకు అదనపు ఆకర్షణను తేవడానికి, అలాగే దేశభక్తిని చాటి చెప్పేందుకు ఈ షోను ఏర్పాటు చేయగా విషాద సంఘటన చోటు చేసుకొంది.