19 నెలలకే పెళ్లి కూతురాయనే! | Dad ‘married’ his daughter after being told she had just two days to live | Sakshi
Sakshi News home page

19 నెలలకే పెళ్లి కూతురాయనే!

Published Fri, Mar 25 2016 7:34 PM | Last Updated on Thu, Aug 16 2018 4:36 PM

19 నెలలకే పెళ్లి కూతురాయనే! - Sakshi

19 నెలలకే పెళ్లి కూతురాయనే!

లండన్: మృత్యువుతో పోరాడుతున్న 19 నెలల కన్నబిడ్డనే పెళ్లి చేసుకున్న ఓ తండ్రి విచిత్ర విషాధ గాథ ఇదీ. ఆ తండ్రి పేరు ఆండీ బర్నార్డ్. 31 ఏళ్లు. భార్య సమ్మీ బర్నార్డ్‌కు 29 ఏళ్లు. ఇద్దరు అన్యోన్య దంపతులు. వారికి ఇద్దరు కుమారుల అనంతరం ముచ్చటగా మూడవ సంతానంగా ఆడబిడ్డ జన్మించింది. ముద్దుగా పప్పీ మాయి అనే పేరు పెట్టుకున్నారు. వారంతా కలసి ఇంగ్లండ్‌లోని థెట్‌ఫోర్డ్‌లో నివసిస్తున్నారు. వారి కుటుంబంలో ఊహించని కల్లోలం రేగింది.

అందరి పిల్లల్లా ఆడుకుంటున్న పప్పీ మాయికి జబ్బు చేసింది. ఆస్పత్రికి తీసుకెళ్లారు. మామూలు ఇన్‌ఫెక్షన్ అనుకున్న  వైద్యులు చికిత్స చేసి ఇంటికి పంపించారు. కానీ జబ్బు నయం కాలేదు. రోజురోజుకు పరిస్థితి దిగజారుతూ వచ్చింది. పలు ఆస్పత్రుల చుట్టూ తిప్పారు. ఓ ఆస్పత్రిలో పప్పీ మాయికి కిడ్నీలో ట్యూమర్ ఉందని గుర్తించారు. అది క్యాన్సర్‌గా పరిణమించిందని గ్రహించారు. చికిత్స చేస్తూ వెళ్లారు. పరిస్థితిలో మార్పులేదు. తదుపరి పరీక్షల్లో, లివర్‌లో ఓ ట్యూమర్, బ్రెయిన్‌లో మరో ట్యూమర్ ఉందని తేలింది.

చికిత్స ద్వారా ఎన్ని రోజులు బతుకుతుందో చెప్పలేమని, చికిత్స మానిస్తే మాత్రం రెండు రోజులకు మించి బతకదని వైద్యులు తేల్చారు. బ్రిటన్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌లో పనిచేస్తున్న తండ్రి తట్టుకోలేక పోయాడు. తుదిశ్వాస విడిచే వరకు పాప ఆనందంగా బతకాలనుకున్నాడు. ఆస్పత్రిలో అది సాధ్యం కాదని భావించాడు. పాపను ఇంటికి తీసుకొచ్చాడు. పాపకు యుక్తవయస్సు వచ్చాక వైభవంగా పెళ్లి చేస్తానంటూ బిడ్డకు ఇచ్చిన హామీ పదే పదే గుర్తుకు రావడం మొదలు పెట్టింది. బతికుండగానే బిడ్డ పెళ్లి చేయాలనుకున్నాడు.

ఇలాంటి పరిస్థితుల్లో పాపను ఎవరు పెళ్లి చేసుకుంటారనుకున్నాడో ఏమో! తన అల్లారు ముద్దు బిడ్డను తానే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ మార్చి 16వ తేదీన బంధుమిత్రులు ఇద్దరికి పెళ్లి ఏర్పాట్లు చేశారు. పెళ్లి పందిరిలా ఇల్లును అలంకరించారు. పాపను పెళ్లి కూతురిలా అలంకరించారు. వెడ్డింగ్ డ్రెస్ తొడిగారు. పెళ్లి ప్రమాణాలు మాత్రం ఎవరూ చదవ లేదు. ఇంటిల్లిపాది ఏడుస్తూ కూర్చున్నారు. బంధు మిత్రులు కూడా పెళ్లి విందులో ముద్ద ముట్టుకోలేదు. పెళ్లి తంతు ముగిసిందనిపించి ఎవరిళ్లకు వారు వెళ్లిపోయారు.

మృత్యువుతో పోరాడుతున్న పప్పీ మాయి ఇంకెంత కాలం బతుకుతుందో తెలియదు. అందుకని ప్రతిక్షణం ఆ పాపకు ఆనందక్షణాలు పంచేందుకు ఇంటిల్లిపాది క్షణం వీడకుండా పాపతోనే గడుపుతున్నారు. తన పాపలా ఏ పాప కూడా అర్ధాంతరంగా వెళ్లిపోకూడదనుకున్న తండ్రి ఆండీ బర్నార్డ్, పిల్లల కేన్సర్ చికిత్సకోసం ‘గోఫండ్‌మీ’ అనే పేజీని ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement