పెంపుడు జంతువులు యజమానుల పట్ల అత్యంత విశ్వాసాన్ని చూపిస్తాయన్నది అందరికీ తెలిసిన విషయమే. అందులోనూ విశ్వాసానికి మారుపేరైన శునకం గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. వాటి విశ్వాసానికి తార్కాణంగా ఇప్పుడు యూట్యూబ్ లో ఓ వీడియో హల్ చల్ చేస్తోంది. తన యజమానిపై దాడి చేయబోయిన వ్యక్తిపై ప్రతాపం చూపించిన ఆ పెంపుడు జంతువు వైనం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.
చాకుతో దాడికి దిగబోయిన వ్యక్తిని అడ్డుకొని.. తన యజమాని ప్రాణాలు నిలబెట్టిన ఓ పెంపుడు జంతువు వీడియో యూట్యూబ్ లో లక్షలమందిని ఆకట్టుకుంటోంది. కెన్యాకు చెందిన ఓ శిక్షణ పొందిన శునకం.. స్నేహానికి, హానికి మధ్య తారతమ్యాన్ని ఇట్టే పసిగట్ట గలిగింది. యజమానితోపాటు కూర్చొని హాయిగా కబుర్లు చెబుతున్న వ్యక్తి ప్రవర్తనలో మార్పును సెకన్లలోనే గమనించగలిగింది. యజమానిపై కత్తి దూయాలనుకున్న అతడ్ని... చాకచక్యంగా అడ్డుకొని యజమాని ప్రాణాలను కాపాడటంతోపాటు, విశ్వాసాన్ని చాటుకుంది.
ఎన్నో ఏళ్లుగా పోలీసులకు తోడ్పడుతూ, ఇళ్లలో కాపలాగా కూడా ఉపయోగపడుతున్న శునకాలు... తమ బాధ్యతను సవ్యంగా నిర్వర్తించడంతోపాటు... శిక్షణ ఇచ్చిన వారిపట్ల, యజమానిపట్ల చూపించే అత్యంత విశ్వాసం ప్రస్తుత వీడియోలో మరోమారు సాక్షాత్కరించింది. కెన్యాలో ఇటువంటి తర్ఫీదు పొందిన శునకాలు 20 వరకూ ఉన్నాయి. ప్రమాదాలను తప్పించుకునేందుకు, దొంగల బాధ నుంచి బయటపడేందుకు ముందు జాగ్రత్తగా ఇటీవల షాపింగ్ మాల్స్, హోటల్స్, చర్చిలు వంటి వాటిలో కాపలా కోసం స్నిఫర్ డాగ్స్ ను పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటువంటి శునకాలను వైట్ కాలర్ జాబ్ డాగ్స్ అని కూడా అంటున్నారు. వీటి బ్రీడ్ ను బట్టి సుమారు వీటి ఖరీదు 20 లక్షల రూపాయలకు పైగా పలుకుతోంది. వీటిలో కేవలం కాపలాకు వినియోగించే డాగ్స్ సుమారు 12 వేల రూపాయలనుంచి, లక్షన్నర వరకూ ఉంటాయి.