ఆరోగ్యంతో ‘దోస్తీ’ చేద్దాం
స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం.. అన్నాడో కవి. నిజమైన మిత్రులకు మించిన ఆస్తి లేదు. మంచి మిత్రుడు తోడుంటే ఆ ధైర్యమే వేరు. జీవితంలో మిత్రులు లేకున్నా .. ధూమపానం చేసినా శరీరానికి ఒకే రకమైన హాని కలుగుతుందని శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. ఒంటరితనం వల్ల ఒత్తిడి పెరిగి రక్తంలో ఫైబ్రోనోజిన్ ప్రోటీన్ స్థాయి పెరుగుతుందని పరిశోధకులు వెల్లడించారు. ఈ ప్రోటీన్ రక్తంలో కొవ్వు పేరుకుపోయేలా చేసి రక్తపోటును పెంచుతుంది.
దీనివల్ల గుండెపోటుతో పాటు తదితర వ్యాధులు వస్తాయి. కుటుంబంలోని వ్యక్తులు, వారికున్న స్నేహితులను బట్టి వారి రక్తంలో ఫైబ్రోనోజిన్ స్థాయిలకు ఉన్న సంబంధాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఐదుగురు స్నేహితులు ఉన్న వారి రక్తంలో ఫైబ్రోనోజిన్ స్థాయి 10 మంది స్నేహితులు ఉండే వారి కన్నా 20 శాతం అధికంగా ఉంది. ఐదుగురి కన్నా తక్కువ మంది స్నేహితులు ఉన్న వారిలో ధూమపానం చేస్తే పెరిగే స్థాయిలో రక్తంలో ఫైబ్రోనోజిన్ పెరుగుతుందని శాస్త్రవేత్తలు అన్నారు. సమాజంతో మనకున్న సంబంధాలు రక్తంలో ఫైబ్రోనోజిన్ స్థాయి పెరుగుదలకు మధ్య సంబంధాలు ఉంటాయని పరిశోధకులు తెలిపారు. హార్వర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ అధ్యయనం ఫలితాలను విడుదల చేశారు.