హైహీల్స్.. యమా డేంజర్!
* కేన్స్‌లో హీల్స్ లొల్లి
* ఎత్తుచెప్పులు ప్రమాదకరమంటున్న నిపుణులు
‘‘ఇక్కడ మహిళలు హైహీల్స్‌ను మాత్రమే ధరించాలి. ఫ్లాట్‌గా ఉండే చెప్పులు, షూస్‌ను నిషేధించడమైనది’’ ప్రఖ్యాత కేన్స్ చిత్రోత్సవాల నిర్వాహకులు చేసిన ఈ ప్రకటన ఇటీవల దుమారం రేపింది. అంతర్జాతీయ సినిమా వేడుకలకు మాత్రమే కాదు.. ప్రముఖ నటీమణుల అందాల ప్రదర్శనకూ వేదికైన కేన్స్‌లో ఈ నిబంధన పట్ల చాలా మంది వివిధ ఇబ్బందుల వల్ల వ్యతిరేకత వ్యక్తం చేశారు.
హాలివుడ్ ప్రముఖల నుంచి విమర్శలూ వెల్లువెత్తడంతో ఆనక నిర్వాహకులు వెనక్కి తగ్గారు. అయితే, ఈ గొడవ నేపథ్యంలో ఇంగ్లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ సాల్‌ఫోర్డ్ నిపుణుడు డాక్టర్ స్టీవ్ ప్రీస్ హై హీల్స్‌పై దృష్టి సారించారు. వీటిని ధరిస్తే కలిగే మోదం కంటే.. ప్రమాదమే ఎక్కువని తేల్చేశారు! హై హీల్స్‌ను రోజూ ధరించడం వల్ల ఇబ్బందులు తప్పవని స్టీవ్ చెప్పారు. దీర్ఘకాలంలో కాలి ఎముకలు, కీళ్లకు సంబంధించిన సమస్యలు వస్తాయని అంటున్నారు.
వీటిలో ముఖ్యమైన సమస్యలు ఏవంటే...
⇒ హైహీల్స్‌తో నడక తీరు మారిపోతుంది. నడుంనొప్పి మొదలవుతుంది. చీలమండలు, కీళ్లు వాచిపోతాయి.
⇒ పాదాలపై పుండ్లు ఏర్పడతాయి.
⇒ శరీర బరువంతా మునివేళ్లపై పడుతుంది. దీనివల్ల అరికాలుపై ముందు వైపు ఒత్తిడి పెరుగుతుంది. పాదం పనితీరుపై ప్రభావం పడుతుంది.
⇒ తూలిపడకుండా ఉండేందుకు భయంగా, అతి జాగ్రత్తగా నడవాల్సి వస్తుంది.
⇒ నడుము దగ్గర నుంచి తొడలు, పిక్కలు, పాదాల వరకూ అన్ని కండరాలూ అతికష్టంగా పనిచేయాల్సి వస్తుంది.