అది కాకులు దూరని కారడవి కాదు గాని.. ఓ చిట్టడివి.. ఏడాదికి చివరి రోజు కావడంతో అడవికి రాజు అయిన సింహం.. న్యూ ఇయర్ పార్టీ ఏర్పాటు చేసింది. రాజుగారు పెట్టిన పార్టీ కదా.. దీంతో చిన్నాచితకా నుంచి భారీ జంతువుల దాకా అన్నీ హాజరయ్యాయి. పార్టీ సాగుతోంది.. నెమళ్లు నాట్యం చేస్తున్నాయి.. కోయిలలు పాడుతున్నాయి.. కోతులు కామెడీ చేస్తున్నాయి.. పార్టీ అన్నాక సాఫీగా సాగితే ఇంక మజా ఏముంది.. అసలే నక్కబావ.. ఫిటింగ్‌లు పెట్టడంలో ఫేమసు.. మృగరాజు మిగతా జంతువులతో ముచ్చట్లాడుతుంటే.. మధ్యలో దూరింది.
టాపిక్‌ను మనుషుల మీదకు మళ్లించింది.. మహరాజా.. మహరాజా.. మనలో ఎవర్ని చూస్తే.. మనుషులు భయపడి చస్తారు అని డౌట్ లేవనెత్తింది.. ఇంకెవరు నేనే.. అంటూ సింహం గర్జించింది. అదేంటి.. ఆ పెద్ద పులి ఏమో తాను అని అంటోంది అని ఫిటింగ్ పెట్టేసింది.. ఇంకేం.. ఈ చర్చ పార్టీ అం తటా మొదలైంది.. సింహం ముందు బయటకి అనకున్నా.. ప్రపం చంలో అత్యంత ప్రమా దకర జంతువు తామంటే తామే అని ఏనుగులు, పాములు, మొసళ్లు ఇలా చాలా జంతువులు తమలో తాము అనుకున్నాయి.
అయితే.. బొద్దింకలు మాత్రం.. తమ భర్తలను సైతం గడగడలాడించే అతివలు మమ్మల్ని చూస్తే.. గడగడలాడుతారు తెలుసా? అని పైకి కాస్త గట్టిగానే అన్నాయి. దీంతో అసలు ప్రపం చంలో అత్యంత ప్రమాదకర జంతువు ఏది? అని తేల్చాలని అవన్నీ అనుకున్నాయి. ఇందుకోసం సర్వే చేయించాలని నిర్ణయించాయి. సర్వేకు ప్రాతిపదికగా వాటి వల్ల ఏటా ఎంతమంది మానవులు మరణించారు అన్నది తీసుకోవాలని తీర్మానం చేశాయి.
సర్వే ఫలితాలు వచ్చేశాయి.. ఇంతకీ ప్రపంచంలో మానవుల ప్రాణాలు తోడేస్తున్న ఆ ప్రమాదకర జంతువు ఏమిటో తెలుసా? సింహమూ కాదూ.. పులీ కాదూ.. పాము కానే కాదు.. దోమ.. అవును దోమే.. మన పక్కనే ఉంటూ.. మనింట్లోనే తిరుగుతూ.. రకరకాల వ్యాధులతో మన ప్రాణాలను హరిస్తున్న దోమే!
దోమ - 8,50,000
పాము - 50,000
కుక్క (రేబిస్ వ్యాధి) - 25,000
సెట్సీ ఫ్లై (ఆఫ్రికాలో ఉంటుంది) - 10,000
నత్త (ఒక రకమైన వ్యాధి వస్తుంది) - 10,000
తేలు - 3,500
బద్దె పురుగు - 2000
మొసలి - 1000
నీటి ఏనుగు - 500
సింహం - 100
ఏనుగు - 100
పులి - 50
షార్క్ - 10
– సాక్షి, తెలంగాణ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment