ఆకట్టుకుంటున్న ఆస్ట్రిచ్ రేస్...
ఒకప్పుడు కార్టూన్లలో చూసి థ్రిల్ గా ఫీల్ అయిన రోడ్ రన్ షో... ఇప్పుడు కళ్ళెదుటే కనిపించింది. తోడేలు నుంచి తప్పించుకునేందుకు కార్టూన్లో పరిగెట్టిన పక్షి... దక్షిణాఫ్రికాలోని సైక్లిస్టుల ముందు నిజంగానే ప్రత్యక్షమైంది. అనుకోని సన్నివేశం ఎదురవ్వడం వారికి ఓ ప్రత్యేక అనుభూతిని కూce కలిగించింది. అందుకే ఆ దృశ్యాన్ని వీడియోలో బంధించిన ఒలేక్సియ్ మిశ్చెంకో అనే ఓ వినియోగదారుడు మార్చి 5న యూట్యూబ్ లో పోస్టు చేశాడు. ఇప్పుడు ఆ వీడియో యూజర్లను అమితంగా ఆకట్టుకుంటోంది.
దక్షిణాఫ్రికాలోని కోప్ ఆఫ్ గుడ్ హోప్ ప్రాంతంలో సైక్లిస్టుల ట్రైనింగ్ జరుగుతున్న సమయంలో ఓ ఆస్ట్రిచ్ వారిని వెంబడించింది. అనుకోని సన్నివేశం ఎదురైనా కాస్త తేరుకున్న సైకిలిస్టు... అతివేగంగా పరిగెట్టే ఆ పక్షితోనే పోటీ పెట్టుకున్నాడు. ఆ వీడియో ఇప్పుడు వీక్షకులను కట్టి పడేస్తోంది. మనుషులైతే నాకేంటి అంటూ ఆ పక్షి.. సైకిలిస్టును ఛేజ్ చేయడం యూట్యూబ్ లో కనువిందు చేస్తోంది. అయితే కాళ్ళు కూడదీసుకొని సైకిల్ పై వెళ్ళే ఇద్దరిని ఎంతోదూరం వెంబడించిన ఆ పక్షిరాజం... ఇక లాభం లేదనుకుందో ఏమో చివరికి కాస్త వెనక్కి తగ్గినట్లుగా వీడియోలో కనిపిస్తోంది. ప్రపంచంలోనే అతి పెద్ద సైకిల్ రేస్ జరుగుతున్న కోప్ ఆర్గస్ టూర్ ప్రాంతంలో ఆస్ట్రిచ్.. మిశ్చెంక్ కళ్ళపడింది. ఇలా పక్షిని గమనించానో లేదో అలా సెకన్లలో రోడ్డుపైకి దూకి వెంటనే సైకిల్ తో స్నేహితుల వెంటపడ్డానని, ఆ తర్వాత ఎంతో నవ్వొచ్చిందని మిశ్చెంక్.. తన యూట్యూబ్ పోస్ట్ లో రాశాడు.
అయితే గంటకు సుమారు 50 కిలోమీటర్ల వేగంతో వెళ్ళే రైడర్స్ కు ఆస్ట్రిచ్ వల్ల పెద్దగా భయం లేదన్నాడు. అదృష్టం కొద్దీ అది పరుగు విరమించుకొని పక్కదారి పట్టిందని, 'కోప్ ఆఫ్ గుడ్ హోప్' దగ్గర మార్గం ముగిసిపోతుందని, నిజంగా ఆ పక్షి తనను వెంబడించి ఉంటే ఏమయ్యుండేదో అంటూ ఒకింత భయాన్ని వ్యక్తం చేశాడు. అయితే ఇటువంటి సందర్భం ఎదురైనప్పుడు చాలామంది నిజంగానే భయపడతారు. కానీ మిశ్చెంక్ మాత్రం దానికి కాస్త హ్యూమరసాన్ని జోడించాడు. కచ్చితంగా ఆ పక్షి.. తన గాల్ ఫ్రెండ్ కు సత్తా చూపించేందుకే తనతో పోటీ పడిందని, ఆమె నిజంగానే ఫ్లాట్ అయిపోయి ఉంటుందంటూ కామెంట్ చేశాడు. అంతేకాదు... అది తన సత్తా చూపించుకుందో లేదోగాని, ప్రపంచంలోనే అతి వేగంగా పరిగెత్తే ఆస్ట్రిచ్ తో పోటీపడి తాను మాత్రం మంచి ట్రైనింగే తీసుకున్నానన్నాడు.