చర్యలా...చర్చలా త్వరగా తేల్చండి..
న్యూఢిల్లీ: పంజాబ్ లో పఠాన్కోట్ భారత వైమానిక దళ స్థావరం వద్ద టెర్రర్ దాడికి బాధ్యులైన ఉగ్రవాదులను అరెస్ట్ చేయాల్సిందిగా కోరుతూ భారత్ పొరుగుదేశం పాకిస్థాన్ పై ఒత్తిడిని తీవ్రం చేసినట్టు తెలుస్తోంది. సకాలంలో చర్యలు తీసుకోండి...లేదంటే ఇరుదేశాల మధ్య శాంతి చర్చలు ఉండవని తేల్చి చెబుతూ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పేరుతో ఒక వివరణ పత్రాన్ని పంపించింది. తక్షణమే చర్యలు తీసుకోకపోతే ఇరుదేశాల మధ్య చర్చలకు ఆస్కారం లేదని తేల్చి చెప్పింది. ఇస్లామాబాద్ లో ఈనెల 14, 15 తేదీల్లో జరగాల్సిన రెండుదేశాల విదేశాంగ కార్యదర్శుల స్థాయిలో జరగాల్సిన శాంతి చర్చలు ఉండవని పేర్కొంది.
ఈ ఉగ్రదాడి వెనుక ఉగ్రవాద సంస్థ జై షే మహమ్మద్ హస్తం ఉందని భారత్ నమ్ముతోంది. దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలను ఆ దేశానికి సమర్పించింది. పంజాబ్ లోని బహావల్పూర్ సహా వివిధ ప్రాంతాల నుండి పాకిస్తాన్ కు వెళ్లిన అనేక ఫోన్ కాల్స్ ను తాము ట్రేస్ చేశామని, వాటిలో కొన్ని సంక్షిప్తంగానూ, కొన్ని దీర్ఘంకానూ సాగాయని భారత్ తెలిపింది. ఉగ్రవాదుల మధ్య జరిగిన ఫోన్ సంభాషణల రికార్డులను పాక్ కు అందించింది. పాకిస్థాన్ నిజంగా భారత్తో సత్సంబంధాలు కోరుకుంటే.. వెంటనే జెషే మహమ్మద్ అధినేత మౌలానా మసూద్ అజార్, తదితర నేతలను అరెస్ట్ చేయాలని భారత్ డిమాండ్ చేసింది.
కాగా పంజాబ్ లోని మోహాలిలో అదుపులోకి తీసుకున్న అష్ఫాక్ అహ్మద్, హఫీజ్ అబ్దుల్ షకుర్, ఖాసింజాన్ నుంచి మారణాయుధాలు, భారీ ఎత్తున మందుగుండు సామగ్రి, ఓ పాకిస్తాన్ సిమ్ కార్డును స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.