
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై మానవాళి చేస్తున్న పోరాటంలో భారత్ మానవతా దృక్పథంతో తనకు చేతనైనంత సాయం చేస్తుందని ప్రధాని మోదీ అన్నారు. క్లోరోక్విన్ కోవిడ్–19 వ్యాధిని నియంత్రిస్తుందని భావిస్తున్న తరుణంలో అమెరికాకు ఈ మాత్రలను ఎగుమతి చేయడానికి భారత్ అంగీకరించిన విషయం తెలిసిందే. ఇందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్‌కు ధన్యవాదాలు తెలుపుతూ భారత్ మేలు మరువలేనిదన్నారు. దీనిపై స్పందిస్తూ ప్రధాని మోదీ గురువారం ట్వీట్ చేశారు. కరోనా మహమ్మారిపై భారత్, అమెరికా కలసి కట్టుగా విజయం సాధిస్తాయన్నారు.
ట్రంప్, డబ్ల్యూహెచ్‌వో మాటల యుద్ధం
జెనీవా/వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రపంచ ఆరోగ్య సంస్థ మధ్య మాటల యుద్ధం తీవ్ర రూపం దాలుస్తోంది. కరోనా ప్రమాదాన్ని పసిగట్టడంలో డబ్ల్యూహెచ్‌వో విఫలమవ్వడమే కాకుండా, చైనాకు కొమ్ముకాస్తోందని ఆరోపించారు. డబ్ల్యూహెచ్‌వోకు నిధులు ఆపేస్తామంటూ అంతకు ముందు ట్రంప్ చేసిన హెచ్చరికల్ని ఆ సంస్థ సీరియస్‌గా తీసుకుంది. కోవిడ్–19 విపత్తుని రాజకీయం చేయొద్దని సలహా ఇచ్చింది. దీని వల్ల మరిన్ని శవపేటికలు అవసరం పడతాయే తప్ప వచ్చే ప్రయోజనం ఏమీ లేదన్నారు.