ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్లపై నిషేధం
ఫేస్ బుక్, యూట్యూబ్, ట్విట్టర్ లతోపాటు శత్రుదేశాలకు చెందిన అన్ని వెబ్ సైట్లపై నిషేధం విధిస్తున్నట్లు ఉత్తరకొరియా ప్రభుత్వం ఉత్తర్వులు జారిచేసింది. కమ్యూనిస్ట్ దేశం చైనాలాగే ఇప్పటికే ఉత్తర కొరియాలోనూ ఇంటర్నెట్ పై సెన్సార్షిప్ కొనసాగుతోంది. నిషేధంపై కొద్ది రోజుల కిందటే యూజర్లకు హెచ్చరికలు పంపారు. అధినేత కిమ్ జాంగ్ ఉన్ ఆదేశాలమేరకు పోస్ట్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ శాఖ శుక్రవారం నిషేధం ఉత్తర్వులను వెల్లడించింది.
దాదాపు రెండున్నర కోట్ల జనాభా కలిగిన ఉత్తర కొరియాలో కేవలం 20 లక్షల మందికి మాత్రమే మొబైల్ ఫోన్లు ఉన్నాయి. ప్రభుత్వంలో ఉన్నత స్థానంలో ఉన్నవ్యక్తులు, ప్రముఖ ఇంజనీర్లు, కొద్ది మంది డాక్టర్లు.. ఇలా అవసరమైనవారికి మాత్రమే మొబైల్ వాడుకునే అవకాశాన్ని కల్పించింది అక్కడి ప్రభుత్వం! విదేశీయిలెవరైనా ఆదేశానికి వెళితే ప్రభుత్వం ఇచ్చే సిమ్ కార్డు ద్వారా మాత్రమే త్రీజీ సేవలను వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఇకపై విదేశీయులకు కూడా ఇంటర్నెట్ సేవలు అందిచబోమని ఉత్తరకోరియా స్పష్టం చేసింది. నిషేధిత వెబ్ సైట్లలో దక్షిణ కోరియాకు చెందిన అన్ని సైట్లు, అమెరికాకు చెందిన ప్రధాన సైట్లు ఉన్నాయి. నిషేధం ఎంతకాలం ఉంటుందనే దానిపై స్పష్టత ఇవ్వని సర్కారు.. 'కొద్దికాలం వరకు నిషేధం కొనసాగుతుంది'అని చెప్పింది.