కరోనా భయం: స్టైల్‌ మార్చిన ఉత్తర కొరియా! | North Korea Secretly Seeking Help For Coronavirus Testing Report Says | Sakshi
Sakshi News home page

కరోనా భయం: సాయం కోరుతున్న ఉత్తర కొరియా!?

Published Fri, Mar 27 2020 9:01 AM | Last Updated on Fri, Mar 27 2020 12:46 PM

North Korea Secretly Seeking Help For Coronavirus Testing Report Says - Sakshi

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌(ఫైల్‌ ఫొటో)

ప్యాంగ్‌యాంగ్‌: ప్రాణాంతక కరోనా వైరస్‌ ధాటికి ప్రపంచమంతా వణికిపోతున్నా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా నింపాదిగా ఉన్నారు. మహమ్మారి వ్యాపిస్తుందన్న విషయం బయటపడగానే సరిహద్దులను మూసివేసి.. అందరినీ ఇంట్లోనే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. బయటకు వస్తే మరణమే శరణ్యం అనే పరిస్థితులు కల్పించారు. తద్వారా తమ దేశంలో అసలు కరోనా ప్రభావం లేదన్నట్లుగా క్షిపణులను ప్రయోగిస్తూ మీడియాకు ఫొటోలు విడుదల చేశారు. అయితే ఇదంతా నిన్నటి మాట. ప్రస్తుతం కరోనా మహమ్మారికి ఉత్తర కొరియా కొరియా కూడా భయపడుతోందట. ఏదేమైనా ముక్కుసూటిగా వెళ్లే కిమ్‌ జోంగ్‌ ఉన్‌ కరోనా వ్యాప్తి నేపథ్యంలో తన స్టైల్‌ మార్చి పొరుగుదేశాల సహాయం కోరుతున్నారట. ముఖ్యంగా కరోనా నిర్ధారణ పరీక్షలు, ఇతరత్రా వైద్య సదుపాయాలు సహా ఫేస్‌ మాస్కుల సరఫరా కోసం దాయాది దేశం దక్షిణ కొరియాను సంప్రదించినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.(కరోనా: ఉత్తర కొరియా దుందుడుకు చర్య!)

కాగా ప్రపంచవ్యాప్తంగా కరోనా కారణంగా ఇప్పటివరకు 24 వేల మందికి పైగా మృత్యువాత పడగా.. 5 లక్షలకు పైగా మంది కరోనా బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో కేవలం ఉత్తర కొరియా మాత్రమే ఇంతవరకు తమ దేశంలో ఒక్క కరోనా మరణం కూడా సంభవించలేదని చెబుతోంది. అయితే మీడియా కథనాలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. కరోనా సోకి ఉత్తర కొరియా సైనికులు కొంతమంది మృతి చెందినట్లు తెలుస్తోంది. కానీ కిమ్ ప్రభుత్వం మాత్రం అలాంటిదేమీ లేదని కొట్టిపారేస్తోంది. ‘‘ అదృష్టవశాత్తూ మా దేశంలో ఒక్కరికి కూడా కోవిడ్‌-19 సోకలేదు’’అని దేశ పారిశుద్ధ్య శాఖ బోర్డు అధికారి పాక్‌ మ్యాంగ్‌ సూ బుధవారం తెలిపారు.

ఇక చైనాలోని వుహాన్‌లో కరోనా లక్షణాలు బయటపడినాటి నుంచి కిమ్‌ సరిహద్దులను మూసివేయడంతో పాటుగా... కరోనా వ్యాప్తి చెందితే కఠిన చర్యలకు ఏమాత్రం వెనుకాడబోనని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. తమ దేశ పౌరులతో పాటు విదేశీయులను కూడా ఎప్పటికప్పుడు నిర్బంధంలోకి తీసుకున్నా.. అధికారులకు సహకరించాలని ఆదేశించారు. అంతేకాదు కరోనా లక్షణాలు బయటపడిన వ్యక్తిని కాల్చి చంపేయాల్సిందిగా ఆయన ఆదేశించినట్లు వార్తలు వెలువడ్డాయి.(కరోనా పేషెంట్‌’ను హతమార్చిన ఉత్తర కొరియా!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement