పాకిస్థాన్ కుటిలత్వం
న్యూఢిల్లీ: భారత్ చేతిలో చావు దెబ్బలు తింటున్నా పాకిస్థాన్‌కు వంకర బుద్ధి మారడంలేదు. అంతర్జాతీయ స్థాయిలో భారత్‌ను దోషిగా చూపాలని కుతంత్రాలు పన్నుతూనే ఉంది. జమ్మూ కశ్మీర్‌లోని జీలం నది బేసిన్‌లో భారత్ నిర్మిస్తున్న కిషన్‌గంగ జలవిద్యుత్ కేంద్రంపై అభ్యంతరాలు ఉన్నాయని, తమ అభ్యంతరాలు వినడానికి మధ్యవర్తిత్వ కోర్టును ఏర్పాటు చేయాలని ప్రాజెక్టు రుణదాత అయిన ప్రపంచ బ్యాంకును ఇటీవల కోరింది. సింధు జలాల ఒప్పందానికి వ్యతిరేకంగా భారత్ ఈ ప్రాజెక్టు నిర్మిస్తోందని ఫిర్యాదు చేసింది.
దీనిపై భారత్ స్పందిస్తూ.. ఒప్పందం ప్రకారమే ఈ 360 మెగావాట్ల సామర్థ్యమున్న ప్రాజెక్టును నిర్మిస్తున్నామని, ప్రాజెక్టు నిర్మాణంలో సాంకేతిక విషయాలు ఉన్నందున వివాదాల పరిష్కారానికి తటస్థ నిపుణుడిని నియమించాలని ప్రపంచ బ్యాంకును కోరింది. ఇరు దేశాలు తమ తమ అభ్యంతరాలను, వివరాలను గతనెల 27న వాషింగ్టన్‌లోని ప్రపంచ బ్యాంకుకు సమర్పించాయని భారత అధికార వర్గాలు తెలిపాయి. న్యాయనిపుణుడి కన్నా ఇంజనీరింగ్ నిపుణుడైతే విషయాలు బాగా అర్థం చేసుకోగలడని ఆ వర్గాలు తెలిపాయి.
నీటి ప్రవాహాన్ని అడ్డుకునేలా ప్రాజెక్టు డిజైన్ ఉందని పాకిస్తాన్ ఫిర్యాదు చేయగా.. భారత్ దానిని పూర్తిగా ఖండించింది. ఈ ప్రాజెక్టుపై 2010లో అంతర్జాతీయ న్యాయస్థానంలో కూడా పాక్ ఫిర్యాదు చేసింది. 2013లో భారత్‌కు అనుకూలంగా తీర్పు వచ్చింది. ప్రస్తుతం యుద్ధమేఘాలు కమ్ముకుంటున్న తరుణంలో భారత్‌పై తన అక్కసును వెళ్లగక్కడానికి పాకిస్థాన్ ప్రపంచ బ్యాంకును ఆశ్రయించింది. పాక్ ఫిర్యాదు చేసినా పనులు ఆగవని భారత వర్గాలు తెలిపాయి.