తూర్పు జెరూసలేంలో పాలస్తీనా ప్రజలతో పోరాడుతున్న ఇజ్రాయెల్ సైనికులు
బీరట్, లెబనాన్ : వివాదాస్పద నిర్ణయంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య తూర్పు దేశాల్లో పెను కల్లోలం రేపారు. జెరూసలేంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తిస్తున్నట్లు ట్రంప్ బుధవారం రాత్రి ప్రకటించిన విషయం విదితమే. అక్కడితో ఆగని ట్రంప్ అమెరికా రాయబార కార్యాలయాన్ని టెల్ అవీవ్ నగరం నుంచి జెరూసలేంకు మార్చుతున్నట్లు కూడా పేర్కొన్నారు.
ట్రంప్ నిర్ణయాలతో ఆందోళనలకు పాలస్తీనాలోని రామల్లా, బెత్లేహంలోని ప్రజలు ఇజ్రాయెల్ దళాలతో కొట్లాటకు దిగారు. ట్రంప్ ప్రకటనపై అరబ్ దేశాల్లో ఓ వైపు బహిరంగ సభలు కొనసాగుతుండగా.. మరో వైపు నిరసన జ్వాలలు ఎగసిపడుతున్నాయి. ఇదే సమయంలో మధ్య ఆసియా దేశాల్లో మళ్లీ 1967 నాటి పరిస్థితులు తలెత్తుతాయేమోననే భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ సందర్భంగా ఇజ్రాయెల్ - పాలస్తీనాలు ‘జెరూసలేం’కు అంత ప్రాధాన్యతను ఎందుకు ఇస్తున్నాయో చూద్దాం.
‘జెరూసలేం’ ఓ ప్రాచీన పుడమి..
జెరూసలేం పుడమి ఇస్లాం, క్రైస్తవం, యూదు మతాలకు ప్రసిద్ధి గాంచింది. ఈ గడ్డపై క్రీస్తు నడయాడారని కూడా నమ్మకం. తొలిసారి 1948లో జెరూసలేం విషయమై అరబ్బులు, యూదుల మధ్య వివాదం రేగింది. దీంతో జెరూసలేంలోని పశ్చిమ ప్రాంతాన్ని ఇజ్రాయెల్(యూదులు), తూర్పు ప్రాంతాన్ని అరబ్బులు కైవసం చేసుకున్నారు.
1967లో జరిగిన యుద్ధంలో తూర్పుప్రాంతాన్ని కూడా ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకోవడం ఎడతెగని రక్తపాతానికి కారణమైంది. జెరూసలేంలోని తూర్పు ప్రాంతంలో జరిగే ఘోరాల్లో బయటకు రాని వాటి సంఖ్యకు లెక్కేలేదు. ఆ ప్రాంతంలో అశాంతి రాజ్యమేలుతోంది.
దాదాపు మూడు వేల ఏళ్ల నాటి నుంచి జెరూసలేం ఇజ్రాయెల్ రాజధానిగా ఉంటోందననేది యూదుల వాదన. ఇదే సమయంలో జెరూసలేంలోని తూర్పు ప్రాంతం పాలస్తీనాకు రాజధాని కావాలనేది అరబ్బుల కల. చాలా మంది అరబ్బులు ఇజ్రాయెల్ ప్రభుత్వం ఓటు హక్కు ఇవ్వకున్నా.. తూర్పు జెరూసలేంలోనే ఏళ్లుగా నివసిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment