ప్రైవేట్ కంపెనీలకు పనిగంటలు తగ్గింపు!
దుబాయ్ః రంజాన్ నెలలో ప్రైవేట్ కంపెనీల పనిగంటలపై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రంజాన్ పవిత్ర మాసంలో కార్మికులకు ఎటువంటి జీతం తగ్గింపు లేకుండా రెండు గంటల పని సమయాన్ని తగ్గిస్తూ ప్రకటన చేసింది.
కార్మిక సంబంధాలు, సవరణల నియంత్రణకు సంబంధించిన 1980 ఫెడరల్ చట్టం 08, ఆర్టికల్ 65 నిబంధన ప్రకారం కార్మికుల పనిగంటలకు సంబంధించిన నిబంధన అమల్లోకి తెచ్చినట్లు యూఏఈ మానవ వనరుల మంత్రిత్వ శాఖ నివేదించింది. ప్రభుత్వ మానవ వనరుల శాఖ ఫెడరల్ అథారిటీ ప్రకటన ప్రకారం రంజాన్ నెలలో ఉదయం 9 గంటలనుంచి 2గంటల వరకూ పని గంటలను సవరించినట్లు ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. తాజా ప్రకటన ప్రకారం అటు ప్రైవేట్ తో పాటు అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ రంజాన్ నెలంతా రెండు గంటల పని సమయం తగ్గిస్తూ తెచ్చిన నిబంధన అమల్లోకి వస్తుంది.
తాజా నిబంధననను సోమవారం అమల్లోకి తెచ్చిన సందర్భంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, యుఏఈ వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ ప్రధానమంత్రి హెచ్ హెచ్ షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్టౌమ్, ప్రజలకు రంజాన్ పండుగ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.