పొరపాటున వాట్సాప్‌లో వచ్చిన ఓ మెసేజ్.. వారిద్దరిని ముడివేసింది. ఒకరికి ఒకరు తెలియకపోయినా.. కేవలం ఒక పొరపాటు మెసేజ్ కారణంగా వారు పలుకరించుకున్నారు. అలా కొనసాగిన సంభాషణ కేవలం నాలుగు గంటల్లోనే వారి మనసులు ముడివేసింది. ఇద్దరూ ప్రేమలో పడ్డారు. అక్కడితో ఆగకుండా పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలో అడుగుపెట్టారు. నువ్వా దరిని.. నేనీ దరిని.. మన ఇద్దరిని కలిపింది వాట్సాప్ అని ఇప్పుడు పాట పాడుకుంటున్నారు మైఖేల్ ఎవాజింలో, లినా డాహ్ల్‌బెక్..
దక్షిణ లండన్‌లోని కొలియర్స్ వుడ్‌కు చెందిన మైఖేల్ (44) ఒకరోజు పొరపాటున ‘గర్ల్స్ ట్రిప్’ అంటూ ఒక మెసేజ్ వాట్సాప్‌లో పంపించాడు. తనకు తెలిసిన లీనా అనే ఒక యువతి ఫొన్ నంబర్ అనుకొని.. ఈ మెసేజ్ పెట్టాడు. కానీ, ఆ మెసేజ్ లీనా డాహ్ల్‌బెక్‌కు వెళ్లింది. ఆమె వెంటనే స్పందించింది. ‘గర్ల్స్ ట్రిప్పా? ఎవరు మీరు? మీరు అనుకుంటున్న లీనా నేను కాదోమో’ అంటూ లీనా (37) బదులు ఇచ్చింది. వారు అంతకుముందు కలువకపోయినా.. ముఖపరిచయం లేకపోయినా.. వాట్సాప్‌లో మాత్రం వారి సంభాషణ చాలా సరదాగా సాగిపోయింది. మొదటి చాటింగే సుదీర్ఘంగా సాగింది. ఇద్దరు మాటలు కలిసి.. అభిరుచులు తెలియడంతో ఇద్దరూ డేటింగ్ చేయాలనుకున్నారు. సాయంత్రం రెస్టారెంట్‌లో డిన్నర్ పార్టీలో ఇద్దరూ కలిశారు. ఇద్దరు ఒంటరివారే కావడంతో మనసులోని మాటలు పంచుకొని.. ప్రేమను తెలుపుకొని ఒక్కటయ్యారు. గత ఏడాది డిసెంబర్ 7న ఇద్దరు పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలో అడుగపెట్టారు. మేకప్ ఆర్టిస్ట్ అయిన లీనా దుబాయ్‌లో మేకప్ స్కూల్ ప్రారంభించాలనుకుంటోంది. ఇందుకోసం నూతన దంపతులు ఈ నెలలో దుబాయ్ వెళుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment